కరంట్ అఫైర్స్ – జూలై 22, 2020

రూ. 40,000 కోట్ల ఔషధాల తయారీ!

పోటీలో తెలంగాణ, ఏపీ, పంజాబ్

ముడి ఔషధాలు, కీలక మూలకాలను చైనా నుంచి దిగుమతి చేసుకోవడం తగ్గించడం కోసం దేశ వ్యాప్తంగా 3 మెగా ఔషధపార్కులను అభివృద్ధి చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. ఔషధాల తయారీలో వినియోగించే యాక్టివ్‌ ఫార్మాసుటికల్‌ ఇన్‌గ్రిడియెంట్స్‌ (ఏపీఐ), కీలక మూలకాలు (కేఎస్ఎం), ఇంటర్మీడియెట్ల తయారీని పెంచేందుకు మెగా ఔషధ పార్కుల అభివృద్ధికి సంబంధించి రాష్ట్రాలను ఎంపిక చేయడానికి ప్రభుత్వం త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేయనుంది. రాష్ట్రాలు ఈ పార్కులను అభివృద్ధి చేస్తే.. వాటికి కేంద్రం రూ.1,000 కోట్ల చొప్పున సాయం చేయనుంది. ఈ పార్కులను అభివృద్ధి చేయడానికి ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, పంజాబ్‌ వంటి రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. ఈ పార్కులు అందుబాటులోకి వస్తే దాదాపు రూ.40 వేల కోట్లకు పైగా విలువైన ఏపీఐలు, కీలక ఔషధాలు ఉత్పత్తి కాగలవని భావిస్తున్నారు. దీనివల్ల ముడి ఔషధాలకు చైనాపై ఆధారపడడం తగ్గడమే కాకుండా ఉద్యోగావకాశాలు లభిస్తాయని పరిశ్రమ వర్గాలంటున్నాయి.

ఏపీఐల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ఉత్పత్తితో ముడిపడిన ప్రోత్సాహకాల పథకాన్ని కూడా ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ పథకం కింద వచ్చే ఎనిమిదేళ్లలో కీలకమైన 53 ఏపీఐలు, ఇంటర్మీడియెట్లు, కీలక మూలకాల తయారీకి దాదాపు రూ.7,000 కోట్లను ప్రోత్సాహకాల రూపంలో ఇవ్వనున్నారు.

మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ కన్నుమూత

బీజేపీ సీనియర్‌ నేత, మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ లాల్జీ టాండన్‌(85) కన్నుమూశారు. కొంతకాలంగా అస్వస్థతతో లక్నోలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టాండన్‌ మంగళవారం ఉదయం కన్నుమూశారని కుటుంబసభ్యులు తెలిపారు. లాల్జీ టాండన్‌కు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. లాల్జీ కుమారుడు అశుతోష్‌ టాండన్‌ ప్రస్తుతం యూపీలో కేబినెట్‌ మంత్రిగా ఉన్నారు.

నంబర్ వన్ ఆల్రౌండర్ గా బెన్ స్టోక్స్

వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో వీర విహారం చేసిన ఇంగ్లండ్‌ ఆటగాడు బెన్ స్టోక్స్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ఆండ్రూ ఫ్లింటాఫ్‌ తర్వాత ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌ ఆల్‌ రౌండర్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్న మొదటి ఇంగ్లండ్‌ క్రికెటర్‌గా నిలిచాడు. విండీస్‌ టెస్టు కెప్టెన్‌ జాసన్‌ హోల్డర్‌(459)ను వెనక్కినెట్టి 497 పాయింట్లతో ప్రథమ స్థానాన్ని ఆక్రమించాడు. అంతేగాక టెస్ట్‌ ర్యాంకింగ్స్‌ బ్యాట్స్‌మెన్‌ జాబితాలో మూడో స్థానం((827))లో నిలిచాడు.

UAE లో మరోసారి IPL- 2020

ఐపీఎల్‌–2020ని యూఏఈలో నిర్వహించడం ఖాయమైంది. టోర్నీ మొత్తం అక్కడే జరపనున్నట్లు లీగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ చైర్మన్, భారత మాజీ క్రికెటర్‌ బ్రిజేశ్‌ పటేల్‌ ప్రకటించారు. వచ్చే వారం జరిగే మరో సమావేశంలో తుది షెడ్యూల్‌తోపాటు ఇతర వివరాలను ప్రకటిస్తామని ఆయన చెప్పారు. సెప్టెంబర్‌ 26 నుంచి నవంబర్‌ 7 వరకు టోర్నీ జరిగే అవకాశం కనిపిస్తోంది. దుబాయ్, అబుదాబి, షార్జా వేదికలుగా టోర్నీ జరుగుతుంది. జూలై 21 వరకు యూఏఈలో సుమారు 57 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే కోలుకున్నవారి సంఖ్య కూడా 49 వేలు ఉండటం విశేషం. కాబట్టి అక్కడ కరోనా మహమ్మారి తీవ్రత తక్కువే. మన దేశంలో 2014లో సార్వత్రిక ఎన్నికలు జరిగిన సమయంలో ఐపీఎల్‌ తొలి భాగం (20 మ్యాచ్‌లు) ఇక్కడే జరిగాయి.

కోవిడ్ టీకా పరిశోధనలను తస్కరించిన చైనా హ్యాకర్లు

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ సంస్థల అత్యంత విలువైన వాణిజ్య రహస్యాలను ఇద్దరు చైనా హ్యాకర్లు తస్కరించారని అమెరికా న్యాయశాఖ ఆరోపించింది. తాజాగా, ఈ హ్యాకర్లు కోవిడ్‌ టీకా కోసం పరిశోధనలు జరుపుతున్న అమెరికా సంస్థలను లక్ష్యంగా చేసుకున్నారని పేర్కొంది. వ్యాక్సిన్‌ల అభివృద్ధి, చికిత్సలపై పరిశోధనలు జరుపుతున్న మసాచుసెట్స్, మేరీల్యాండ్‌లకు చెందిన ప్రముఖ సంస్థల కంప్యూటర్‌ నెట్‌వర్క్‌లో లోపాలపై పరిశోధన జరిపారని పేర్కొంది. ఈ హ్యాకర్లపై వాణిజ్య రహస్యాల దొంగతనం, కుట్ర అభియోగాలు మోపుతున్నట్లు తెలిపింది. తస్కరణకు గురైన సమాచారం హ్యాకర్లకే కాకుండా చైనా ప్రభుత్వానికి కూడా ఎంతో విలువైందని వివరించింది. చైనా ప్రభుత్వం పరోక్షంగా నేరగాళ్లను ప్రోత్సహిస్తోందని ఆరోపించింది. విదేశీ హ్యాకర్లపై అమెరికా ఆరోపణలు చేయడం ఇదే ప్రథమం.

ఢిల్లీలో 23 శాతం మందికి కరోనా

దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటివరకూ 23 శాతం మందికి పైగా కోవిడ్‌-19 బారినపడ్డారని ఓ అథ్యయనం వెల్లడించింది. ప్రభుత్వం నిర్వహించిన సెరో సర్వే ఫలితాలను జూలై 21 ప్రకటించారు. ఈ అధ్యయనం ప్రకారం 23.48 శాతం మంది ఢిల్లీ వాసుల్లో కోవిడ్‌-19 యాంటీబాడీలు ఉన్నాయని వెల్లడైంది. కరోనా మహమ్మారి ఆరు నెలల నుంచి ఢిల్లీ నగరంలో అన్ని ప్రాంతాలకూ, విస్తృత జనాభాకూ విస్తరించినా కేవలం 23.48 శాతం ఢిల్లీ ప్రజలే దీని బారినపడ్డారని, ప్రభుత్వం.. పౌరుల సహకారంతో కోవిడ్‌-19 కట్టడి సాధ్యమైందని ఈ అధ్యయనంపై ప్రభుత్వం వ్యాఖ్యానించింది. కరోనా సోకిన వారిలో అత్యధిక మందిలో ఎలాంటి లక్షణాలు లేవని అథ్యయనంలో వెల్లడైంది. జూన్‌ 27 నుంచి జులై 10 వరకూ ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన వ్యాధి నివారణ జాతీయ కేంద్రం (ఎన్‌సీడీసీ) ఈ అథ్యయనాన్ని చేపట్టింది.

12వ తరగతి సిలబస్ లో ఆర్టికల్ 370′ రద్దు

పన్నెండో తరగతిలోని రాజకీయ శాస్త్రంలో ఆర్టికల్ 370 రద్దు పాఠాన్ని చేరుస్తూ ఎన్‌సీఈఆర్‌టీ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో.. వేర్పాటువాదంపై ఉన్న పాఠ్యాంశాన్ని సిలబస్ నుంచి తొలగించింది. 2020-21 విద్యా సంవత్సరం సిలబస్‌కు సంబంధించి జరిగిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకుంది. రాజకీయ శాస్త్రంలోని రీజినల్ ఆస్పిరేషన్స్ అధ్యాయానికి ఈ మేరకు మార్పులు చేసింది. ప్రత్యేక ప్రతిపత్తి కారణంగా కశ్మీర్‌లో ఉగ్రవాదం, హింస, రాజకీయ అనిశ్చితి పెరిగినట్టు ఆ అధ్యయనంలో పేర్కొంది. ఈ చట్టం కారణంగా అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని కూడా అందులో పొందుపరిచింది. 2002 తరువాత కశ్మీర్‌లో జరిగిన మార్పుల ఆధారంగానూ ఈ అధ్యాయానికి మార్పులు చేసింది. ఇక గత నెలలో సిలబస్‌లో కోతకు సంబంధించి వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. భారతీయ ప్రజాస్వామ్యం, భిన్నత్వం వంటి వాటిపై ఉన్న కొన్ని పాఠాలను తొలగిస్తున్నారంటూ ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. అయితే ఎన్‌సీఈఆర్‌టీ మాత్రం ఈ ఆరోపణలు ఖండించింది. అవన్నీ ఈ విద్యా సంవత్సరానికి మాత్రమే వర్తించే మార్పులని, కొందరు ఆరోపిస్తున్నట్టుగా ఇవి ఏ ఒక్క అంశానికీ పరిమితం కావని స్పష్టం చేసింది.

అమర్ నాథ్ యాత్ర రద్దు

జూలై 21 నుంచి ప్రారంభం కావాల్సిన అమర్‌నాథ్ యాత్ర రద్దయింది. కరోనా నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్రను రద్దు చేస్తూ శ్రీ అమర్‌నాథ్ దేవస్థాన బోర్డ్ నిర్ణయం తీసుకుంది. ఈ యాత్ర ఆగస్ట్ 3 వరకూ కొనసాగాలని తొలుత నిర్ణయం తీసుకున్నా ఆఖరు నిమిషంలో రద్దు చేశారు. జూలై 18న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ స్వయంగా అమర్‌నాథ్ వెళ్లి మంచు శివలింగం వద్ద పూజలు కూడా చేశారు. దీంతో యాత్ర తప్పకుండా జరుగుతుందని భక్తులు ఆశించారు. అయితే కరోనా మహమ్మరి తీవ్రత నేపథ్యంలో అమర్‌నాథ్ దేవస్థానం బోర్డ్ రద్దు నిర్ణయం తీసుకుంది.

ఏపీ కేబినెట్ లో కొత్తగా ఇద్దరు మంత్రులు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రివర్గంలో కొత్త మంత్రులుగా సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ జూలై 22న ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ విజయవాడలోని రాజ్‌భవన్‌లో వారితో పదవీ ప్రమాణం చేయించారు. పిల్లి సుభాష్‌చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణారావు రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయిన నేపథ్యంలో మంత్రి పదవులకు చేసిన రాజీనామాలను గవర్నర్‌ ఇప్పటికే ఆమోదించిన విషయం తెలిసిందే. వారి స్థానంలో అప్పలరాజు, వేణుగోపాలకృష్ణకు మంత్రివర్గంలో అవకాశం దక్కింది.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన అప్పలరాజు 2019లో తొలిసారిగా పలాస నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మత్స్యకార వర్గానికి చెందిన మోపిదేవి స్థానంలో అదే సామాజిక వర్గం నుంచి అప్పలరాజుకు అవకాశం కల్పిస్తున్నారు. శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ స్థానంలో అదే సామాజిక వర్గం నుంచి తూర్పు గోదావరికి చెందిన చెల్లుబోయిన వేణుకు పదవి దక్కనుంది.

కరూర్ వైశ్యా బ్యాంక్ ఎండీ, సీఈవోగా రమేశ్ బాబు

కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ ఎండీ, సీఈవోగా బొడ్డు రమేశ్‌బాబు నియమితులయ్యారు. జూలై 20 జరిగిన సమావేశంలో తమ బోర్డు డైరెక్టర్లురమేశ్‌బాబును కొత్త ఎండీ, సీఈవోగా నియమించారని కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ వెల్లడించింది. మరోవైపు నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎండీసీ) సీఎండీగా సుమిత్‌ దేవ్‌ నియమితులయ్యారు.

బెంగళూరులో జూమ్ టెక్నాలజీ కేంద్రం

కరోనా లాక్‌డౌన్‌తో ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అయిన వీడియో కాన్ఫరెన్స్‌ యాప్‌ జూమ్‌ .. బెంగళూరులో కొత్త టెక్నాలజీ కేంద్రాన్ని ప్రారంభిస్తామని జూలై 21 ప్రకటించింది. రాబోయే కొన్నేళ్లలో టెక్నాలజీ నిపుణులను నియమించుకుంటామని కంపెనీ పేర్కొంది. ఆపరేషన్‌ ఇంజినీర్లు, ఐటీ, సెక్యూరిటీ, బిజినెస్‌ ఆపరేషన్స్‌ విభాగాల్లో కంపెనీ ఇప్పటికే ఉద్యోగ నియామకాలు చేపట్టింది. కంపెనీకి ఇప్పటికే ముంబైలో ఒక కార్యాలయం ఉండగా.. ముంబై, హైదరాబాద్‌లో రెండు డేటా సెంటర్లు ఉన్నాయి. 2020 జనవరి నుంచి ఏప్రిల్‌ మధ్య భారత్‌లో రికార్డు స్థాయిలో ఫ్రీ యూజర్లను సొంతం చేసుకున్నది. భారత్‌లో 6,700% వృద్ధిని సాధించినట్లు జూమ్‌ వెల్లడించింది.

ఏపీలో పాడి అభివృద్ధికి అమూల్ తో ప్రభుత్వ ఒప్పందం

ఆంధ్రప్రదేశ్ లో పాడి అభివృద్ధి కోసం గుజరాత్ కు చెందిన డెయిరీ సంస్థ అమూల్ తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. మహిళల జీవితాలను మార్చే క్రమంలో అమూల్‌తో ఒప్పందం గొప్ప అడుగు అవుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు, అమూల్‌కు ఈ ఒప్పందం ఒక చరిత్రాత్మక అడుగుగా నిలుస్తుందని స్పష్టం చేశారు. అమూల్‌తో బాగస్వామ్యం ద్వారా మహిళలకు మరింత చేదోడు లభిస్తుందని చెప్పారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, అమూల్‌ చెన్నై జోనల్‌ హెడ్‌ రాజన్‌ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments