☛ అంతరిక్ష ప్రయోగాల్లో యూఏఈ చరిత్ర
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) చరిత్ర సృష్టించింది. సొంతంగా రూపొందించిన అల్ అమాల్ అనే అంతరిక్ష నౌకను విజయవంతంగా ప్రయోగించింది. ఒక అరబ్ దేశం మరో గ్రహం కక్ష్యలోకి అంతరిక్ష నౌకను పంపిస్తుండడం ఇదే తొలిసారి. ఇందుకు జపాన్‌లోని టానేగషిమా స్పేస్‌పోర్టు వేదికగా నిలిచింది. స్థానిక కాలమానం ప్రకారం జూలై 20న తెల్లవారుజామున 1.58 గంటలకు హెచ్–2ఏ అనే రాకెట్ సాయంతో అల్ అమాల్ నింగిలోకి దూసుకెళ్లింది. ఎలాంటి అపశ్రుతులు లేకుండా ప్రయోగం విజయవంతమైనట్లు సమాచారం అందగానే దుబాయ్‌లోని మహమ్మద్ బిన్ రషీద్ స్పేస్ సెంటర్లోని శాస్త్రవేత్తలు, యూఏఈ ప్రజలు ఆనందంలో మునిగిపోయారు. నౌక బరువు 1.3 టన్నులు. ఇది 49.5 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించి అంగారక గ్రహం కక్ష్యలోకి చేరుకోనుంది. గ్రహం చుట్టూ ఆవరించి ఉన్న వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేయడమే అల్ అమాల్ లక్ష్యం.
☛ నిమ్స్ లో కరోనా వాక్సిన్ ట్రయల్స్ ప్రారంభం
కరోనా వైరస్‌కు దేశీయంగా తొలి వ్యాక్సిన్ తయారీలో ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ ఇంట ర్నేషనల్ మరో ముందడుగు వేసింది. తాము అభి వృద్ధి చేస్తున్న ‘కోవాగ్జిన్’ను మనుషులకు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించింది. ఇప్పటికే ఎయిమ్స్ (పాట్నా) సహా రోహతక్ (హరియాణా)లో హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించిన ఆ సంస్థ తాజాగా జూలై 20న హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లోనూ మనుషులపై టీకాను ప్రయోగించింది. ఇద్దరు వలంటీర్లకు మూడు మైక్రోగ్రాముల చొప్పున వ్యాక్సిన్ ఇచ్చారు. 14 రోజుల తరువాత శరీరంలో యాంటీబాడీస్ ఏ మేరకు వృద్ధి చెం దాయి? వ్యాక్సినేషన్ తర్వాత ఏమైనా అనారోగ్య సమస్యలు తలెత్తాయా? వంటివి విశ్లేషించి, వచ్చే ఫలితాలను బట్టి వీరికి అదే బ్యాచ్‌కి చెందిన ఆరు మైక్రో గ్రాముల చొప్పున రెండో డోస్ ఇవ్వనున్నారు.
☛ కరోనా వ్యాక్సిన్ – ఆక్స్ ఫర్డ్ ప్రయోగాలు ఆశాజనకం
కరోనా మహమ్మారితో గడగడలాడుతున్న ప్రపంచానికి ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ శుభవార్త చెప్పింది. తాము రూపొందిస్తున్న వ్యాక్సిన్ ప్రయోగాల్లో సానుకూల ఫలితాలు చూపుతోందని తెలిపింది. వర్సిటీ అస్ట్రాజెనెకాతో కలిసి రూపొందించిన కరోనా టీకా ఒకటి, రెండో దశల క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు సానుకూలంగా వచ్చాయి. బ్రిటన్‌లోని ఐదు ఆస్పత్రుల్లో 18–55 ఏళ్ల మధ్యనున్న 1,107 మంది ఆరోగ్య వంతులపై చేపట్టిన క్లినికల్ ట్రయల్స్‌లో వైరస్ ను నిరోధించేలా వ్యాధినిరోధకతను పెంచే యాంటీబాడీలు, టీ సెల్స్ పెరిగినట్లు గుర్తించినట్లు వర్సిటీ పరిశోధకులు తెలిపారు. ఈ ఫలితాలు జూలై 20న లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
మరోవైపు.. రష్యా తయారీ కోవిడ్ టీకా త్వరగా క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకుని, వచ్చే నెలలోనే మార్కెట్లోకి విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ప్రపంచంలోనే మొట్టమొ దటిసారిగా తాము విడుదల చేస్తున్న వ్యాక్సిన్ పూర్తి సురక్షితమైందని రష్యా రక్షణ శాఖకు చెందిన సెంట్రల్ సైంటిఫిక్ రీసెర్చి ఇన్స్టిట్యూట్ తెలిపింది.
☛ వాల్వుతో ఉన్న ఎన్ – 95 మాస్కులు వద్దన్న కేంద్రం
ఎన్–95 మాస్క్‌లు, ముఖ్యంగా రెస్పిరేటరీ వాల్వ్‌లున్న ఎన్–95 మాస్క్‌ల వినియోగంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. అలాంటి మాస్క్‌లు వైరస్ వ్యాప్తిని అడ్డుకోలేవని, కరోనాను నిరోధించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రతికూల ప్రభావం చూపుతాయని హెచ్చరిస్తూ రాష్ట్రాలకు లేఖ రాసింది. వైద్యసిబ్బంది వినియోగానికి ఉద్దేశించిన మాస్క్‌లను అనుచిత రీతిలో సామాన్య ప్రజలు వినియోగిస్తున్న తీరు తమ దృష్టికి వచ్చిందని ఆ లేఖలో ఆరోగ్య శాఖకు చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ పేర్కొంది. ఇంట్లో తయారు చేసుకునే మాస్క్‌లను వినియోగించేందుకు మార్గదర్శకాలు ఆరోగ్య శాఖ వెబ్సైట్లో ఉన్నాయని, వాటిని ప్రచారం చేయాలని సూచించింది.
☛ వెస్టిండీస్ తో రెండో టెస్టులో ఇంగ్లండ్ విజయం
వెస్టిండీస్‌తో జరుగుతున్న 3 మ్యాచ్ ల టెస్ట్ సీరీస్ రెండో టెస్టులో ఇంగ్లండ్ విజయం సాధించింది. 312 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో… అటు ధాటిగా ఆడలేక, ఇటు ‘డ్రా’ కోసం పూర్తి ఓవర్లు ఎదుర్కోలేక ఒత్తిడిలో విండీస్ తలవంచింది. 113 పరుగులతో గెలిచిన ఇంగ్లండ్ సిరీస్‌ను 1–1తో సజీవంగా ఉంచింది. ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన ఇంగ్లండ్ ప్లేయర్ బెన్ స్టోక్స్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. చివరిదైన మూడో టెస్టు జూలై 24 నుంచి జరుగుతుంది.
☛ ఈ ఏడాది జరగాల్సిన టీ-20 ప్రపంచ కప్ వాయిదా
ఆస్ట్రేలియాలో ఈ ఏడాది అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు జరగాల్సిన టి20 ప్రపంచకప్ టోర్నీ వాయిదా పడింది. కరోనా దెబ్బకు అంతా తల్లడిల్లుతున్న దశలో ఒక మెగా టోర్నీ నిర్వహణ సాధ్యం కాదని భావించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టోర్నీని సంవత్సరంపాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. 2021లో ఇదే తేదీల్లో టీ-20 ప్రపంచ కప్ నిర్వహిస్తామని స్పష్టం చేసింది. నవంబర్ 14న ఫైనల్ జరుగుతుంది. షెడ్యూల్ ప్రకారం 2021లోనే మరో టి20 ప్రపంచకప్ కూడా జరగాల్సి ఉంది. దానిని ఇప్పుడు 2022కు వాయిదా వేశారు. 2023లో భారత్‌లో జరగాల్సిన వన్డే వరల్డ్‌కప్ మాత్రం అదే ఏడాది కొత్త తేదీల్లో నిర్వహిస్తారు.
☛ హైదరాబాద్ జూలో ఏనుగుని దత్తత తీసుకున్న ఉపాసన
హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్కులో ‘రాణి’ అనే ఏనుగును అపోలో ఫౌండేషన్, అపోలో లైఫ్ వైస్ చైర్పర్సన్ ఉపాసన కొణిదెల ఏడాది కాలానికి దత్తత తీసుకున్నారు. జూలై 20న జూ పార్కును సందర్శించిన ఆమె రాణిని ఏడాది పాటు దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించి దాని పోషణకు అయ్యే ఖర్చు నిమిత్తం రూ. 5 లక్షల చెక్‌ను క్యూరేటర్, ఐఎఫ్ఎస్ అధికారిని క్షితిజకు అందజేశారు.
☛ ఏపీలో పెట్రోల్, డీజీల్ పై వ్యాట్ పెంపు
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌పై విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను 2015–18 స్థాయికి సవరిస్తూ ప్రభుత్వం జూలై 20న ఉత్తర్వులు జారీ చేసింది. పెట్రోల్‌పై రూ.1.24, డీజిల్‌పై 93 పైసల చొప్పున వ్యాట్‌ను పెంచింది. పెట్రోల్‌పై 31 శాతం పన్నుతో పాటు అదనంగా రూ.4, డీజిల్‌పై 22.25 శాతం వ్యాట్‌తో పాటు అదనంగా రూ.4 సుంకం విధించింది. కోవిడ్ కారణంగా ఆదాయం పడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. లాక్డౌన్ వల్ల ఆదాయాలు భారీగా పడిపోవడంతో చాలా రాష్ట్రాలు పన్నులు పెంచాయి. అదే బాటలో ఇక్కడ కూడా ధరలు సవరించినట్టు ప్రభుత్వం పేర్కొంది. ఏప్రిల్, మే నెలల్లో ఢిల్లీ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు పన్ను రేట్లు పెంచాయి. ఈ సవరించిన ధరలు జూలై 21 నుంచి అమల్లోకి వచ్చాయి.