☛ ట్విట్టర్ లో మోదీకి 6 కోట్ల ఫాలోవర్లు
భారత ప్రధాని నరేంద్రమోదీ మరో ఘనత సాధించారు. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో ఆయన ఫాలోవర్ల సంఖ్య ఏకంగా 6 కోట్లకు చేరుకుంది. జనవరి 2009లో మోదీ ట్విట్టర్ ఖాతా ప్రారంభించారు. ప్రధాని 2,354 మందిని ఫాలో అవుతున్నారు. ప్రధానమంత్రి కార్యాలయ ట్విట్టర్‌ను 3.7 కోట్ల మంది అనుసరిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో మోదీకి 4.5 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
ఏప్రిల్ 2015లో ట్విట్టర్లో చేరిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి 1.5 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ట్విట్టర్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు 8.3 కోట్ల మంది ఫాలోవర్లు ఉండగా ఆయన 46 మందిని మాత్రమే అనుసరిస్తున్నారు.
☛ సంచార బయో టాయిలెట్లుగా ఆర్టీసీ పాత బస్సులు
ప్రయాణికుల సేవలో అలసి మూలపడిపోయిన పాత బస్సులు ఇక కొత్త అవతారమెత్తనున్నాయి. పట్టణాల్లో జనసమ్మర్థం ఉండే ప్రాంతాల్లో సంచార బయో టాయిలెట్లుగా మారబోతున్నాయి. ఇప్పటికే ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌లో కొన్ని ప్రారంభించగా.. జూలై 19న ఖమ్మం కలెక్టరేట్ ప్రాంగణంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఈ సంచార బయో టాయిలెట్లను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణాల్లో పురపాలక శాఖ వీటిని ఏర్పాటు చేయబోతోంది. ఆర్టీసీ వద్ద నిరుపయోగంగా ఉన్న పాత బస్సులను బయో టాయిలెట్లుగా మార్చి అన్ని పట్టణాల్లో అవసరమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో బస్సులో నాలుగు టాయిలెట్లు ఉండేలా డిజైన్ చేస్తున్నారు. ఇందులో ఒకటి ఇండియన్ మోడల్, మూడు వెస్ట్రన్ మోడల్ ఉంటాయి.
☛ చెస్ 960 విజేత హరికృష్ణ
ప్రతిష్టాత్మక బీల్ చెస్ ఫెస్టివల్లో భాగంగా నిర్వహించిన చెస్960 టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. కరోనా మహమ్మారి సమయంలో దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత అంతర్జాతీయంగా ముఖాముఖి పద్ధతిలో జరుగుతున్న తొలి చెస్ టోర్నీ ఇదే కావడం విశేషం. స్విట్జర్లాండ్‌లోని బీల్ నగరంలో ఏడు రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో 34 ఏళ్ల హరికృష్ణ అజేయంగా నిలిచాడు. హరికృష్ణ మొత్తం 5.5 పాయింట్లు స్కోరు చేశాడు.
☛ హంగేరీ గ్రాండ్ ప్రీ 2020 విజేత హామిల్టన్
ఫార్ములావన్ ప్రపంచ చాంపియన్ హామిల్టన్ దూసుకుపోతున్నాడు. జూలై 19న జరిగిన హంగేరి గ్రాండ్‌ప్రిలో ఈ బ్రిటన్ డ్రైవర్ చాంపియన్‌గా నిలిచాడు. 70 ల్యాప్లపాటు జరిగిన ఈ రేసును ‘పోల్ పొజిషన్’తో ప్రారంభించిన హామిల్టన్ ఆద్యంతం ఆధిపత్యం చలాయించి తన కెరీర్లో 86వ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. హామిల్టన్ అందరికంటే ముందుగా గంటా 36 నిమిషాల 12.473 సెకన్లలో రేసును ముగించి విజేత అయ్యాడు. హంగేరి గ్రాండ్‌ప్రి టైటిల్‌ను ఎనిమిదో సారి నెగ్గిన హామిల్టన్ (2007, 09, 2012, 13, 16, 18, 19, 2020)… ఈ క్రమంలో ఒకే వేదికపై అత్యధిక రేసులు నెగ్గిన జర్మనీ దిగ్గజ రేసర్ షుమాకర్ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. గతంలో షుమాకర్ ఫ్రెంచ్ గ్రాండ్‌ప్రిని ఎనిమిదిసార్లు గెలిచాడు. సీజన్‌లోని తదుపరి రేసు బ్రిటిష్ గ్రాండ్‌ప్రి ఆగస్టు 2న జరుగుతుంది.
☛ ఈ ఏడాది దేశవాళీ టోర్నీలు రంజీ, వినూ మన్కడ్ కే పరిమితం
దేశవాళీ క్రికెట్ సీజన్‌ను కరోనా మింగేయనుంది. దేశంలో వైరస్ విలయతాండవం అంతకంతకూ పెరిగిపోతోంది. ఆటలకు బాటలే పడట్లేదు. దీంతో ప్రస్తుత కరోనా సీజన్లో దేశవాళీ టోర్నీలను రెండుకే పరిమితం చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించింది. 2020–21లో సీనియర్ల కోసం రంజీ ట్రోఫీ… కుర్రాళ్ల కోసం అండర్–19 వినూ మన్కడ్ ట్రోఫీల ను మాత్రమే నిర్వహిస్తారు. దులీప్, దేవధర్, విజయ్ హజారే, సీకే నాయుడు (అండర్–23) టోర్నీలు అసాధ్యమేనని బోర్డు భావించింది. వీలు ను బట్టి ముస్తాక్ అలీ టి20 టోర్నీకి చోటిచ్చింది. రంజీ కూడా ఇపుడున్న ఎలైట్, ప్లేట్ కాకుండా పాత పద్ధతిలోనే నిర్వహించే అవకాశముంది. అంటే ఐదు జోన్ల (నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, సెంట్రల్)లోని జట్ల మధ్య లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. తదుపరి జోన్ విజేతలకు (పాయింట్ల పట్టికలో జోన్ టాపర్) నాకౌట్ పద్ధతిలో నిర్వహించి విజేతను తేలుస్తారు.
☛ సుప్రీంకోర్టు కొలీజియంలో జస్టిస్ యు.యు. లలిత్
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొలీజియంలో జస్టిస్ యు.యు.లలిత్ నూతనంగా చేరారు. జస్టిస్ ఆర్.భానుమతి పదవీ విరమణ చేయడంతో ఆమె స్థానంలో జస్టిస్ లలిత్ కొలీజియం ఐదో సభ్యుడయ్యారు. కొలీజియంలో ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే, జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఆర్.ఎఫ్.నారిమన్ ఉన్నారు. అత్యున్నత న్యాయ స్థానంలోని ఐదుగురు సీనియర్ న్యాయమూర్తులు కొలీజియం సభ్యులుగా ఉంటారు. సుప్రీంకోర్టు జడ్జీలను కొలీజియం ఎంపిక చేసి, ప్రభుత్వానికి పేర్లను ప్రతిపాదిస్తుంది. జస్టిస్ లలిత్ కొలీజియంలో 2022లో పదవీ విరమణ చేసే వరకు కొనసాగుతారు.
☛ తిరునగరి రామానుజయ్యకు దాశరథి అవార్డు
యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ప్రముఖ సాహితీవేత్త, పద్యకవి డాక్టర్ తిరునగరి రామానుజయ్యకు దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. జూలై 22న దాశరథి జయంతి సందర్భంగా అవార్డుతో పాటు నగదు బహుమతిని కూడా అందజేయనుంది. డాక్టర్ తిరునగరి.. తెలుగు, సంస్కృతం, హిందీ, ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యులు. అయిదు దశాబ్దాలుగా మానవీయ, ఆధ్యాత్మిక, జీవనతత్వం, మానవ సంబంధాల గురించి తన కవిత్వం, పద్యాలు, ప్రసంగ వ్యాసాల్లో చాటిచెబుతున్నారు. ’సముద్ర మథనం’ వచన కవిత్వ సంపుటి, ’తిరునగరీయం’ పద్య కవిత్వాన్ని ఇటీవలే ఆయన వెలువరించారు.
1945లో జన్మించిన తిరునగరి.. జూనియర్ లెక్చరర్‌గా 1999లో ఉద్యోగ విరమణ చేశారు. స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బేగంపేట కాగా, ఉద్యోగరీత్యా ఆలేరులో స్థిరపడ్డారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని చింతల్లో తన కుమారుడితో కలిసి ఉంటున్నారు. దాశరథి కృష్ణమాచార్యతో ఆయనకు 20 ఏళ్ల సాన్నిహిత్యం ఉంది.