కరంట్ అఫైర్స్ – జూలై 19, 2020

6 ఏళ్లలో రూ. 5 లక్షల కోట్ల మొండి బకాయిలు రద్దు

గత ఏడాది (2019)తో ముగిసిన ఆరేళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.5,48,734 కోట్ల మొండి బకాయిల (నిరర్థక ఆస్తులుఎన్‌పీఏ)ను రద్దు చేశాయి. ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ (ఏఐబీఈఏ) డేటా ప్రకారం.. అంతక్రితం ఆరేళ్లలో కొట్టేసిన ఎన్‌పీఏలతో పోలిస్తే 6 రెట్లు అధికం. 2008-13 మధ్యకాలంలో ప్రభుత్వ బ్యాంకులు రూ.86,528 కోట్ల మొండి పద్దులను రద్దు చేశాయి. ‘‘అన్ని బ్యాంకులతో పాటు ఆర్‌బీఐ నుంచి సేకరించిన గణాంకాలను విశ్లేషించడం జరిగింది. బ్యాంకులు ఎన్‌పీఏలను భారీగా రైటాఫ్‌ చేస్తూ వచ్చాయి. ఏటేటా భారీగా పెరుగుతూ వచ్చాయి. అందులో అధికభాగం కార్పొరేట్‌ రుణాలే’’నని ఏఐబీఈఏ జనరల్‌ సెక్రటరీ సీహెచ్‌ వెంకటాచలం అన్నారు. అంతిమంగా ఈ భారం మోయాల్సింది పన్ను చెల్లింపుదారులు, బ్యాంక్‌ ఖాతాదారులేనని ఆయన పేర్కొన్నారు. ఏఐబీఈఏ దేశంలోనే అతిపెద్ద బ్యాంక్‌ ఉద్యోగుల సంఘం.

ఎస్‌బీఐలోనే అధికం

దేశంలోనే అతిపెద్ద బ్యాంకైన ఎస్‌బీఐ.. మొండి బకాయిల రద్దులోనూ అగ్రస్థానంలో ఉంది. గడిచిన నాలుగేళ్లలో ఎస్‌బీఐ రూ.1.79 లక్షల కోట్లు రైటాఫ్‌ చేసింది. అందులో రూ.52,387 కోట్ల బకాయిలను గత ఆర్థిక సంవత్సరం (2019-20)లోనే కొట్టివేసింది. 2018-19లో రూ.58,905 కోట్లు, 2017-18లో రూ.40,196 కోట్లు రైటాఫ్‌ చేసింది.

2,426 మంది.. రూ.1.47 లక్షల కోట్ల ఎగవే

జూలై 19న బ్యాంకుల జాతీయీకరణ దినోత్సవం సందర్భంగా ఏఐబీఈఏ భారీగా రుణ ఎగవేతలకు పాల్పడిన వారి వివరాలు వెల్లడించింది. 17 ప్రభుత్వ రంగ బ్యాంకులకు 2,426 మంది రూ.1,47,350 కోట్లు ఎగవేసినట్లు తెలిపింది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎ్‌సబీఐ) 685 మంది రూ.43,887 కోట్లు ఎగవేశారు.

చమురు నిల్వలపై అమెరికాతో ఒప్పందం

చమురు నిల్వల కోసం అమెరికాతో భారత్‌ వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా నిల్వలకు, చమురు రవాణా సమయంలో ఏదైనా నష్టం వాటిల్లితే.. దానికి బీమా సదుపాయం ఉంటుందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెల్లడించారు. జూలై 18 ఆయన అమెరికా మంత్రి డాన్‌ బ్రౌయిలెట్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. అమెరికాలో 71.4 కోట్ల బ్యారెళ్లను నిల్వచేసేలా మౌలిక వసతులున్నాయని ఆయన తెలిపారు. భారత చమురు నిల్వల భద్రతకోసం అమెరికాలో ‘యూఎ్‌సఇండియా గ్యాస్‌ టాస్క్‌ఫోర్స్‌’ ఏర్పాటైందన్నారు.

దేశంలో కరోనా సామాజిక వ్యాప్తి మొదలైంది : ఐఎంఏ

దేశంలో కోవిడ్‌–19 పరిస్థితి తీవ్రంగా ఉందనీ, కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి మొదలైందని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ) తెలిపింది. ‘దేశంలో ప్రతి రోజూ 30వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి. ముఖ్యంగా ఈ వైరస్‌ గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తోంది. ఇది సామాజిక వ్యాప్తికి సంకేతం’అని ఐఎంఏ హాస్పిటల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా చైర్‌పర్సన్‌ డాక్టర్‌ వీకే మోంగా అన్నారు. ఈ పరిస్థితుల్లో వైరస్‌ను అదుపు చేయడం చాలా కష్టమైన విషయమన్నారు. దేశంలో కరోనా వైరస్‌ సామాజిక వ్యాప్తి మొదలు కాలేదంటూ కేంద్రం చెబుతున్న నేపథ్యంలో ఐఎంఏ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

గణితవేత్త శేషాద్రి కన్నుమూత

ఆల్జీబ్రా జామెట్రీలో నిష్ణాతునిగా పేరుతెచ్చుకున్న మేథమెటీషియన్, పద్మభూషణ్ గ్రహీత సీఎస్ శేషాద్రి (88) జూలై 17న కన్నుమూశారు. ఆల్జీబ్రా జామెట్రీలో ఆయన ఉన్నత శిఖిరాలను అందుకున్నారు. ఆ రంగంలో ఆయన చేసిన సేవలు నేటికీ గుర్తుగా నిలిచి ఉన్నాయి. టాటా ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ లో కెరీర్ ప్రారంభించిన ఆయనఅనంతరం చెన్నై మేథమెటికల్ ఇన్సిస్టిట్యూట్ ని స్థాపించారు. 1998లో రాయల్ సొసైటీ సభ్యుడిగా, 2010లో అమెరికాలోని నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఫారెన్ అసోసియేట్ గా ఎన్నికయ్యారు. ఆయన చేసిన సేవలు మరువలేనివని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు.

ఆయోధ్య రామమందిర శంకుస్థాపనకు ప్రధానికి ఆహ్వానం

అయోధ్యలో భవ్య రామ మందిరం శంకుస్థాపనకు విచ్చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు శనివారం ఆహ్వానించింది. రామ మందిరం నిర్మాణానికి ఆగస్టు 3 లేదా 5వ తేదీన పునాది రాయి వేయనున్నట్లు ట్రస్టు అధికార ప్రతినిధి మహంత్‌ కమల్‌నయన్‌ దాస్, అధ్యక్షుడు నృత్య గోపాల్‌ దాస్‌ వెల్లడిం చారు. నక్షత్రాలు, గ్రహాల కదలికల ఆధారంగా రెండు తేదీలను శుభ ముహూర్తాలుగా నిర్ణయించామని తెలిపారు. వీటిలో ఏదో ఒక తేదీన రామ మందిరం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామన్నారు. దేశంలో 10 కోట్ల కుటుంబాలను కలిసి నిర్మాణానికి అవసరమైన నిధులు సేకరిస్తామని ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ పేర్కొన్నారు. డిజైన్‌ ఖరారైన తర్వాత మూడు నుంచి మూడున్నరేళ్లలో గుడి నిర్మాణం పూర్తి చేస్తామని వివరించారు.

తెలంగాణలో 6 శాఖల్లో ఈ – ఆఫీస్ ప్రారంభం

రాష్ట్రంలో ఈ ఆఫీస్ విధానం అమల్లోకి వచ్చింది. ఆరు శాఖలలో ప్రయోగత్మకంగా ఈ ఆఫీస్ విధానం జూలై 18 నుంచి ప్రారంభమైంది. ఈ కొత్త విధానంలో 1600 మందికి పైగా ఉద్యోగులు విధులు ప్రారంభించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వెల్లడించారు. సిఎం కెసిఆర్ ఆదేశాలకు అనుగుణంగా పరిపాలనతో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు ఈ ఆఫీస్ విధానాన్ని తీసుకువచ్చారు. సాధారణ పరిపాలన శాఖ, ఎక్సైజ్ శాఖ, వాణిజ్య పన్నులు, ప్రధాన కమిషనర్ సిసిఎల్‌ఎ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖలు ఈ ఆఫీస్ విధానంలో ముందుండగా, త్వరలోనే అన్ని శాఖలకు ఈ ఆఫీస్ విధానాన్ని విస్తరించనున్నారు.

రైతులకు ఆన్‌లైన్‌ సలహాలకు యాప్‌

వ్యవసాయంలో అన్నదాతలకు ఏ అనుమానం వచ్చినా ఆన్‌లైన్‌లో సందేహాల నివృత్తికి, సలహాల కోసం తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌ (టీటా) టి.కన్సల్ట్‌ యాప్‌ను రూపొందించింది. జూలై 18 వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి.. ప్రతినిధులతో భేటీ అయి యాప్‌ను ఆవిష్కరించి పనితీరును తెలుసుకున్నారు. అలాగే వ్యవసాయ కమిషనరేట్‌ను తనిఖీ చేసిన మంత్రి.. ఎరువులు, రైతువేదికల నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు. దసరా నాటికి రైతు వేదికల నిర్మాణం పూర్తి కావాలని, రాష్ట్రంలో ఎక్కడా ఎరువుల కొరత రానీయొద్దని అధికారులకు సూచించారు.

ఖేల్ రత్న అవార్డు హర్భజన్ పేరు వెనక్కి

రాజీవ్‌ఖేల్‌రత్న’ అవార్డు కోసం ఈ ఏడాది భారత సీనియర్‌ స్పిన్‌ బౌలర్‌ హర్భజన్‌ సింగ్‌ పేరును ప్రతిపాదించిన పంజాబ్‌ ప్రభుత్వం ఇప్పుడు దానిని ఉపసంహరించుకుంది. అయితే ఇందులో ప్రభుత్వం తప్పేమీ లేదని, వారు నిబంధనల ప్రకారమే వ్యవహరించారని భజ్జీ వివరణ ఇచ్చాడు. ‘కొంత మంది ఈ అంశాన్ని వివాదం చేయాలని చూస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం సరిగానే పని చేసింది. ఖేల్‌రత్న నిబంధన ప్రకారం గత మూడేళ్ల కాలంలో అంతర్జాతీయ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకోవాలి. అలా చూస్తే నాకు అర్హత లేదు. అందుకే నేనే దరఖాస్తు వెనక్కి తీసుకోమని వారికి విజ్ఞప్తి చేశాను. ప్రభుత్వం దానికి అంగీకరించింది’ అని హర్భజన్‌ వెల్లడించాడు.

భారత జట్టు తరఫున 2016 మార్చిలో చివరి మ్యాచ్‌ ఆడిన హర్భజన్‌ పేరును అసలు అర్హతే లేకుండా ఇప్పుడు ఎందుకు ప్రతిపాదించారనేదే ప్రాధమిక సందేహం. 40 ఏళ్ల హర్భజన్‌ భారత్‌ తరఫున మూడు ఫార్మాట్‌లలో కలిపి మొత్తం 711 వికెట్లు తీశాడు.

3టీమ్‌ క్రికెట్‌ (3టీసీ) సాలిడారిటీ కప్‌ డివిలియర్స్ జట్టుకి స్వర్ణం

కరోనా దెబ్బ తర్వాత ఎలాగైనా క్రికెట్‌ను మొదలు పెట్టేందుకు దక్షిణాఫ్రికా బోర్డు తీసుకొచ్చిన కొత్త ఫార్మాట్‌ 3టీమ్‌ క్రికెట్‌ (3టీసీ) సాలిడారిటీ కప్‌ టోర్నీలో డివిలియర్స్ జట్టు స్వర్ణం గెలుచుకుంది. నెల్సన్‌ మండేలా డే’ అయిన జూలై 18 ఈ టోర్నీ జరిగింది. డివిలియర్స్‌ నాయకత్వంలో ‘ఈగల్స్‌’, తెంబా బవుమా సారథిగా ఉన్న ‘కైట్స్‌’, రీజా హెన్‌డ్రిక్స్‌ కెప్టెన్సీ చేసిన ‘కింగ్‌ఫిషర్స్‌’ జట్లు బరిలోకి దిగాయి. నిబంధనల ప్రకారం ప్రతీ జట్టులో గరిష్టంగా ఎనిమిది మంది ఆటగాళ్లే ఉంటారు. మూడు జట్లు కలిపి ఒకే సారి 36 ఓవర్ల ఈ మ్యాచ్‌లో తలపడతాయి. రెండు భాగాలుగా ఈ మ్యాచ్‌ జరుగుతుంది. ఒక్కో జట్టు 6 + 6 ఓవర్ల చొప్పున 12 ఓవర్లు ఆడుతుంది. ప్రతీ జట్టు తొలి భాగంలో ఒక ప్రత్యర్థిని, రెండో భాగంలో మరో పత్య్రర్థిని ఎదుర్కొంటుంది. ఫీల్డర్లందరూ బౌండరీ వద్దనే నిలబడతారు. చివరకు ఒక్కో జట్టు చేసిన మొత్తం పరుగులను బట్టి విజేతను నిర్ణయిస్తారు. డివిలియర్స్‌ ‘ఈగల్స్‌’ టీమ్‌ 4 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసి స్వర్ణం గెలుచుకుంది. డివిలియర్స్‌ తనదైన శైలిలో చెలరేగి 24 బంతుల్లో 61 పరుగులు చేశాడు. 3 వికెట్లకు 138 పరుగులు సాధించిన కైట్స్‌కు రజతం, 5 వికెట్లకు 113 పరుగులు చేసిన కింగ్‌ ఫిషర్స్‌కు కాంస్య లభించాయి. దేశంలో కరోనా కేసులు అత్యధికంగా (సుమారు 82 వేలు) ఉన్న గాటెంగ్‌ ప్రావిన్స్‌లో ప్రజల కు భరోసా కల్పించే ఉద్దేశంలో అక్కడే మ్యాచ్‌ ను నిర్వహించారు.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments