కరంట్ అఫైర్స్ – జూలై 18, 2020

July 18

HCL తొలి మహిళా చైర్ పర్సన్ గా రోష్నీ నాడార్

పురుషాధిక్యత అధికంగా ఉన్న భారత IT రంగంలో తొలిసారి ఒక IT కంపెనీకి చైర్ పర్సన్ గా ఒక మహిళ ఎన్నికైంది. దేశీయ IT సేవల దిగ్గజాల్లో ఒకటైన HCL టెక్నాలజీస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన శివ్ నాడార్ చైర్మన్ పదవి నుంచి వైదొలగగా ఆ స్థానంలో నాడార్ ఏకైక సంతానం రోష్నీ నాడార్ మల్హోత్రా ఎంపికయ్యారు. హురున్ సంస్థ తాజా కుబేరుల జాబితాలో రూ. 36,800 కోట్ల సంపదతో భారత్ లోనే అత్యధిక సంపద గల మహిళగా అగ్ర స్థానంలో ఉన్న 27 ఏళ్ల రోష్ని9.9 బిలియన్ డాలర్ల విలువైన HCL సంస్థకు అధిపతిగా జూలై– 17న బాధ్యతలు స్వీకరించారు. అయితే ఈమె 2013లోనే HCL కంపెనీ వైస్ చైర్ పర్సన్ గా నియమితులయ్యారు. కాగా శివ్ నాడార్ HCL MD(చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్) గా బాధ్యతలు చేపట్టనున్నారు.

ఇక్రిశాట్ శాస్ర్తవేత్తకు జాతీయ అవార్డు

ఇక్రిశాట్ శాస్ర్తవేత్త డా. రాజీవ్ కుమార్ వర్షీ వ్యవసాయ రంగానికి అందిస్తున్న విశేష సేవలకు గుర్తింపుగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) రఫీ అహ్మద్ కిద్వాయ్ అవార్డుతో సత్కరించింది. జూలై– 17న వర్చువల్ విధానంలో జరిగిన ICAR 92వ వార్షికోత్సవంలో కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈ అవార్డును అందజేశారు. ICAR 1956 సంవత్సరం నుంచి ఏటా రఫీ అహ్మద్ కిద్వాయ్ అవార్డుతో పాటు రూ. 5 లక్షల నగదు బహుమతిని అందజేస్తుంది.

ప్రస్తుతం ఇక్రిశాట్ లోని జెనెటిక్ గెయిన్స్ రీ సెర్చ్ ప్రోగ్రామ్ కు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న డా. రాజీవ్ కుమార్ కు ప్లాంట్ జీనోమిక్స్, జీనోమిక్స్ అసిస్టెడ్ క్రాప్ బ్రీడింగ్ విభాగాల్లో అంతర్జాతీయ గుర్తింపు ఉంది. ఈయన నేతృత్వంలోని ఇక్రిశాట్ బృందం కందులు, శనగలు, పల్లీలు, సజ్జ పంటల జన్యుక్రమాలను గుర్తించింది.

సివిల్ సర్వెంట్స్ కి ప్రధాని అవార్డులు

జిల్లాలను ఆర్థికంగా అభివృద్ధి చేసి, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసి, సుపరిపాలన అందిస్తోన్న అధికారులను ప్రధాన మంత్రి అవార్డుతో సత్కరించనున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ అవార్డు ప్రదానానికి జిల్లా కలెక్టర్ల ఎంపిక కోసం, వారి పనితీరును గుర్తించడానికి ప్రాధాన్యతా రంగాలకు రుణసౌకర్యాలను కల్పించడం, ప్రజల సహకారంతో సమ్మిళత అభివృద్ధిలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. రాష్ట్రీయ ఏక్ తా దివస్ అక్టోబర్ – 31 పురస్కరించుకొని గుజరాత్ లోని కెవాడియాలో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద ప్రధాని మోదీ ఈ అవార్డులను అందజేస్తారు. దీని కోసం జూలై– 17 నుంచి ఆగష్టు– 15 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

రూ. 1,40,881 కోట్లతో గ్రామీణ స్వచ్ఛ భారత్-2

రోడ్లపై మురుగు నీరు, చెత్త లేకుండా గ్రామాలన్నీ పరిశుభ్రంగా ఉండాలన్నదే లక్ష్యం

తొలి ఏడాది రాష్ట్రంలో రూ. 1,700కోట్లతో కార్యక్రమ అమలుకు ప్రణాళిక సిద్ధం

దేశంలో గ్రామాల్లో రోడ్లపై మురుగు నీరు, చెత్త కుప్పలు లేకుండా చేయడానికి, వాడి పారేసిన ప్లాస్టిక్ వస్తువులను తిరిగి వినియోగించడానికి వీలుగా వాటిని సేకరించే విధంగా గ్రామీణ స్వచ్ఛ భారత్-2 కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమ అమలుకు సంబంధించిన సవరణ విధివిధానాలను జూలై– 18న కేంద్ర మంచినీటి సరఫరా, పారిశుద్ధ్య అమలు శాఖ విడుదల చేసింది.

మహాత్మా గాంధీ 150 జయంతోత్సవాలను పురస్కరించుకొని 2014, అక్టోబర్– 2న ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ మిషన్ కు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా 2019, అక్టోబర్– 2 వరకు మొదటి దశ స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు చేపట్టారు.

గ్రామీణ స్వచ్ఛ భారత్– 2 ను ఈ ఆర్థిక ఏడాది నుంచి 2025, మార్చి నెలాఖరు వరకు 5ఏళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు.

ఈ కార్యక్రమాల అమలుకు ఆయా గ్రామాల జనాభా ప్రాతిపదికన రాష్ట్రాలకు నిధులు కేటాయిస్తారు. ఇందులో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వరుసగా 40%, 60% భరించాల్సి ఉంటుంది. దీంట్లో భాగంగా చెత్త సేకరణకు 5 వేల జనాభా పైబడిన గ్రామంలో ఒక్కొక్కరికి రూ. 45 చొప్పున, 5వేల లోపు జనాభా ఉండే గ్రామంలో ఒక్కొక్కరికి రూ. 60 ల చొప్పున లెక్కగట్టి నిధులు కేటాయిస్తారు.గ్రామాల్లో మురుగునీటి వ్యవస్థ పర్యవేక్షణకు 5వేల పైబడి జనాభా ఉన్న గ్రామంలో ఒక్కొక్కరికి రూ. 660 చొప్పున, 5వేల లోపు జనాభా గల గ్రామంలో ఒక్కొక్కరికి రూ. 280 చొప్పున నిధులు ఇస్తారు.

2020-21 ఆర్థిక సం.నికి తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఈ కార్యక్రమ అమలుకు రూ. 1,700 కోట్లతో ప్రణాళికను సిద్ధం చేసి కేంద్ర ఆమోదానికి పంపింది. రాష్ట్రంలో తొలి ఏడాది మండలానికి రెండు గ్రామాల చొప్పున 1,320 పెద్ద గ్రామాల్లో కార్యక్రమ అమలుకు ప్రణాళిక సిద్ధం చేశారు.

అంగారకుడి పైకి రోవర్

చైనా అంతరిక్ష పరిశోధనలో ప్రతిష్ఠాత్మక ప్రయోగం మార్స్(అంగారకుడు) పైకి వాహకనౌకను పంపడానికి భారీ రాకెట్ లాంగ్ మార్చ్ – 5 కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. అంతరిక్ష ప్రయోగ కేంద్రం వద్ద లాంగ్ మార్చ్-5 రాకెట్ ద్వారా తియాన్ వెన్-1 అనే రోవర్ ను అంగారకుడిపైకి పంపనున్నారు. చైనా అంతరిక్ష పరిశోధనలో మొట్టమొదటి మార్స్ మిషన్ ఇది. అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ చేపట్టిన మార్స్ ప్రయోగాలు కూడా తుది దశకు చేరుకొని రాకెట్ ప్రయోగాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంగారకుడికి సంబంధించి మరింత సమాచారాన్ని సేకరించటమే లక్ష్యంగా మార్స్ మిషన్ ను చేపట్టిన చైనా.. జూలై – 23న వెన్ ఛాంగ్ స్పేస్ లాంచ్ సెంటర్ నుంచి రాకెట్ ప్రయోగించనున్నారు. అంగారకుడి వైపు ప్రయాణం ప్రారంభించాలంటే ప్రతి 26 నెలల్లో ఒకమారు మాత్రమే అనుకూల సమయం(30 రోజులు)అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తక్కువ సమయం, తక్కువ ఇంధనంతో రాకెట్ ప్రయాణించడానికి ఈ సమయాన్ని ఎంచుకుంటారు. అంతరిక్ష వాహకనౌక మార్స్ ను చేరాలంటే 48 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి.

యూనియన్ బ్యాంక్ కు ప్రతిష్టాత్మక అవార్డు

ప్రభుత్వ రంగంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మరోసారి ప్రతిష్టాత్మక గోల్డెన్ పికాక్ నేషనల్ ట్రెయినింగ్ అవార్డ్– 2020 దక్కింది. న్యూఢిల్లీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (IOD) వర్చువల్ అవార్డ్ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ జనరల్ మేనేజర్(HR- L&D) వినాయక్ వి టెంబర్న్ ఈ అవార్డుని అందుకున్నారు. జాతీయ శిక్షణ అవార్డు విభాగంలో UBIకి ఈ అవార్డు దక్కడం 9వ సారి.

ఒంగోలు రైల్వే సబ్ డివిజన్ కు కేంద్ర అవార్డు

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఒంగోలు సబ్ డివిజనల్ కార్యాలయానికి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ వాటర్ హీరోస్ అవార్డు ప్రకటించింది. జల సంరక్షణ కోసం చేపట్టే పద్ధతులు, చేసే ప్రయత్నాలకు సంబంధించి కేంద్రం ఈ అవార్డు ప్రకటిస్తుంది. ఈ నేపథ్యంలో జలవనరుల శాఖ, నదుల అభివృద్ధి, గంగా ప్రక్షాళన శాఖ, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సెప్టెంబర్, 2019 నుంచి జూన్, 2020 వరకు పోటీ నిర్వహించగా, ఈ అవార్డుకు ఒంగోలు సబ్ డివిజనల్ ఎంపికైందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య ప్రకటించారు.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments