వైరా కేవీకేకు దీన్ దయాల్ అవార్డు
పంటల సాగులో వినూత్న పద్ధతులను ప్రొత్సహించినందుకుగాను ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే)కు ప్రతిష్ఠాత్మకమైన పండి ట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ్ కృషి ప్రోత్సాహన్ అవార్డు దక్కింది. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి(ఐకార్) 92వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ఈ అవార్డును ప్రకటించారు. జోన్-10(తెలంగాణ, ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరి) పరిధిలో మొత్తం 71 కేవీకేలు పోటీ పడగా వైరా-కేవీకేకు అవార్డు దక్కడం గమనార్హం. వివిధ రకాల వరిసాగు పద్ధతులపై.. ముఖ్యంగా యంత్రాల ద్వారా నాటు వేయడం, డైరెక్ట్ సీడెడ్ రైస్, పొడి దుక్కిలో వరి విత్తనాలు వేసి నీటి పారుదల కిందకు తీసుకురావడం, సెలినిటిని తట్టుకునే సిద్ది(డబ్ల్యూజీఎల్-44) వరి రకాన్ని రైతులలో ప్రమోట్ చేయడంలో కేవీకే కృషి చేసింది.
20 విభాగాల్లో 160 అవార్డులు
వ్యవసాయ రంగంలో కృషి చేసిన వారికి ఏటా ఐకార్ అవార్డులను అందిస్తున్నది. ఈ ఏడాదికి 20 విభాగాల్లో 160 అవార్డులను ప్రకటించింది. ఇందులో మూడు యూనివర్సిటీలు, రెండు ఏఐసీఆర్పీ, 14 కేవీకేలు, 94 మంది శాస్త్రవేత్తలు, 31మంది రైతులు, ఆరుగురు జర్నలిస్టు లు, 10 మంది ఐకార్ ఉద్యోగులు ఉన్నారు. అవార్డు పొందిన 141 వ్యక్తుల్లో 19 మంది మహిళలు ఉండటం విశేషం. నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మెనేజ్మెంట్ డైరెక్టర్ శ్రీనివాస్‌రావుకు అగ్రికల్చర్ సైన్స్ పరిశోధనల్లో రఫిఅహ్మద్ కిడ్వాయ్ అవార్డు, ఎక్స్టెన్షన్ సిస్టమ్స్ మేనేజ్మెంట్ విభాగం అధిపతి బీఎస్ సోన్టక్కి కి స్వామి సహజానంద సరస్వతి ఔట్‌స్టాండింగ్ ఎక్స్టెన్షన్ సైంటిస్ట్ అవార్డు దక్కింది. వీరితో పాటు ఎన్ విజయలక్ష్మి, ఎస్ఎన్ రసూల్‌కు జాతీయ స్థాయి అవార్డులు దక్కాయి. సోర్గమ్పై పరిశోధనలకుగాను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్(ఐఐఎంఆర్)హైదరాబాద్‌కు చౌదరీ దేవిలాల్ ఔట్స్టాడింగ్ అవార్డు దక్కింది. వ్యవసాయ పరిశోధన, అభివృద్ధికి విశేష కృషి చేసిన పాత్రికేయులకిచ్చే చౌదరి చరణ్‌సింగ్ అవార్డు.. అన్నదాత ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ హరికృష్ణకు దక్కింది.
ట్విటర్ పై బిట్ కాయిన్ సైబర్ నేరగాళ్ల దాడి
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న ఏడాదిలోనే సామాజిక మాధ్యమం ట్విట్టర్లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. రాజకీయ ప్రముఖులు, టెక్నాలజీ మొఘల్స్, సంపన్నులే లక్ష్యంగా వారి ట్విట్టర్ అకౌంట్లను హ్యాక్ చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, మీడియా మొఘల్ మైక్ బ్లూమ్‌బర్గ్, అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్, మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌తోపాటు యాపిల్, ఉబర్ వంటి సంస్థల అకౌంట్లు బుధవారం హ్యాక్ అయ్యాయి. వారి అధికారిక ఖాతాలలో హఠాత్తుగా అనుమానాస్పద పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. ఈ పోస్టులన్నీ క్రిప్టో కరెన్సీకి సంబంధించినవే కావడం గమనార్హం. బిట్‌కాయిన్ సైబర్ నేరగాళ్లు చేసిన ఈ పనితో ట్విట్టర్ వణికిపోయింది. ‘‘వచ్చే 30 నిమిషాల్లో నాకు వెయ్యి డాలర్లు పంపండి. నేను తిరిగి 2 వేల డాలర్లు పంపుతాను’’అంటూ బిట్‌కాయిన్ లింక్ అడ్రస్ ఇస్తూ ప్రముఖుల అధికారిక ఖాతాలలో ట్వీట్లు ప్రత్యక్షమయ్యాయి. ఆ ట్వీట్లు మూడు, నాలుగు గంటలసేపు ఉన్నాయి. హ్యాక్ విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన ట్విట్టర్ యంత్రాంగం పోస్టులన్నింటినీ తొలగించి తాత్కాలికంగా ఆ ఖాతాలను నిలిపివేసింది. భద్రతా పరమైన అంశాలను పరీక్షించి అకౌంట్లను పునరుద్ధరించింది.
సోషల్ మీడియా చరిత్రలోనే అతి పెద్దదైన ఈ హ్యాకింగ్ ద్వారా బిట్‌కాయిన్ వాలెట్‌లోకి లక్షా12 వేలకు పైగా డాలర్లు వచ్చి చేరాయని అంచనా. ఒకసారి గుర్తు తెలియని వాలెట్లలోకి వెళ్లిన మొత్తాన్ని తిరిగి రాబట్టడం అసాధ్యమని న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెల్లడించింది.
మైలార్డ్ అనకండి.. ‘సర్’ చాలు
ఇప్పటి వరకు ఆచరణలో ఉన్న ‘మైలార్డ్’, ‘లార్డ్‌షిప్’ లాంటి సంబోధన తగదని, తనను ‘సర్’ అని మాత్రమే పిలిస్తే సరిపోతుందని కలకత్తా హైకోర్టు చీఫ్ జస్టిస్ టీబీఎన్ రాధాక్రిష్ణన్ వ్యాఖ్యానించారు. బెంగాల్, అండమాన్‌లలోని న్యాయాధికారులందరూ తనను ‘సర్’ అనే సంబోధించాలని ఆయన సూచించారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ రాయ్ చటోపాధ్యాయ.. బెంగాల్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్‌లోని జిల్లా జడ్జీలకు, కింది కోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు చీఫ్ జస్టిస్ చేసిన సూచనలను పంపారు. ఇకపై జిల్లా న్యాయాధికారులు, హైకోర్టులోని రిజిస్ట్రీ సిబ్బంది తనను ‘సర్’అని సంభోదించాలని చీఫ్ జస్టిస్ ఆకాంక్షించారు.
నేటి నుంచి అంతర్జాతీయ విమానాలు
కరోనా నేపథ్యంలో 116 రోజులుగా నిలిచిపోయిన అంతర్జాతీయ విమాన సర్వీసులు పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆయా దేశాల నుంచి భారత్‌కు పాక్షికంగా విమానాలు నడవనున్నాయి. దీనికి సంబంధించి అమెరికా, ఫ్రాన్స్ దేశాలతో కేంద్రం కీలక ఒప్పందం చేసుకొంది. జూలై 17 నుంచే ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీ్పసింగ్ పురి వెల్లడించారు. అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఈ నెల 17-31 మధ్య 18 విమానాలను నడపనుంది.
సీపీసీ సభ్యులకు అమెరికాలోకి నో ఎంట్రీ
చైనా అధికార కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు అమెరికాలో ప్రవేశించకుండా సంపూర్ణ నిషేధం విధించాలని అమెరికా యోచిస్తోంది. వారెవరైనా ఇప్పటికే అమెరికాలో ఉన్నట్లు తేలితే.. వీసారు రద్దు చేసి వారిని దేశం నుంచి పంపించేయాలని కూడా భావిస్తోంది. ఈ దిశగా ఉత్తర్వులు రూపుదిద్దుకుంటున్నాయని న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. అయితే.. ఈ దిశగా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ నిర్ణయాన్ని అమెరికా అమలు చేస్తే చైనాతో యూఎస్ ద్వైపాక్షిక సంబంధాలు కనిష్ట స్థాయికి చేరే అవకాశముంది.
ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్యశ్రీ విస్తృతం
వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తూ పశ్చిమగోదావరి జిల్లాలో ప్రస్తుతం అమలవుతున్న పైలట్ ప్రాజెక్టు విధానాన్ని ఇప్పుడు కొత్తగా మరో ఆరు (విజయనగరం, విశాఖ, గుంటూరు, ప్రకాశం, వైఎస్సార్ కడప, కర్నూలు) జిల్లాలకు విస్తరించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జూలై 16న తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. అలాగే, మొత్తం 2,200 రకాల వైద్య సేవలను ఈ పథకం కింద అందజేయనున్నారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల్లోని ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు, కలెక్టర్లనుద్దేశించి సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ పథకంలో 1,259 వైద్య సేవలు అందుతుండగా, పశ్చిమ గోదావరి జిల్లా పైలట్ ప్రాజెక్టులో మొత్తం 2,200 రకాల సేవలు అందుతున్నాయని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఈ 2,200 సేవలను ఇప్పుడు మరో ఆరు జిల్లాలకు విస్తరిస్తున్నామన్న ఆయన.. నవంబర్ 14 నుంచి మిగిలిన జిల్లాల్లోనూ అమలుకు ఆరోగ్యశాఖ సన్నాహాలు చేస్తోందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఏప్రిల్ 6న కరోనాను కూడా ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చామని, వారం క్రితం నాన్ ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లోనూ కరోనాకు చికిత్స చేయాలని ఆదేశాలు జారీచేశామని తెలిపారు. దేశంలో తొలిసారిగా అత్యాధునిక వైద్య సదుపాయాలతో ఒకేసారి 1,088 అంబులెన్సులు ప్రవేశపెట్టామని, తద్వారా రాష్ట్రంలోని ప్రతి మండలంలో అత్యంత మెరుగైన సేవలందించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. వార్షిక ఆదాయం రూ.5 లక్షల వరకు ఉన్న వారికి కూడా ఈ పథకం అమలుచేస్తున్నామని.. తొలిసారిగా 1.42 కోట్ల ఆరోగ్యశ్రీ కార్డులు క్యూఆర్ కోడ్‌తో ఇస్తున్నామని సీఎం వైఎస్ జగన్ చెప్పారు.
కొత్త రెవెన్యూ డివిజన్ గా వేములవాడ
పరిపాలనా సౌలభ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా మరో రెవెన్యూ డివిజన్ ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆరు మండలాలతో కొత్తగా వేములవాడ రెవెన్యూ డివిజన్ ను ఏర్పాటు చేసింది. వేములవాడ, వేములవాడ రూరల్, రుద్రంగి, కోనారావుపేట, చందుర్తి, బోయిన్ పల్లి మండలాలు ఈ డివిజన్ పరిధిలోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.