Current Affairs – Telugu – August 8, 2019

వరుసగా నాలుగోసారి రెపో రేటు తగ్గింపు

వృద్ధి మందగమనానికి విరుగుడుగా ఆర్‌బీఐ రెపో రేటును మరింత తగ్గించింది. ద్వైమాసిక ద్రవ్యపరపతి సమీక్షలో మరో 0.35 శాతం కోత పెట్టింది. దీంతో రెపో రేటు 5.40 శాతానికి, రివర్స్‌ రెపో రేటు 5.15 శాతానికి చేరాయి. రెపో రేటును తగ్గించడం వరుసగా ఇది నాలుగోసారి. మొత్తం 1.1 శాతం తగ్గించింది. ఫలితంగా రెపో తొమ్మిదేళ్ల కనిష్ఠ (2010 ఏప్రిల్‌ నాటి) స్థాయికి తగ్గింది. సాధారణంగా ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లను 0.25 శాతం చొప్పున పెంచడం లేదా తగ్గించడం చేస్తుంది. కానీ ఈసారి అందుకు భిన్నంగా 35 బేసిస్‌ పాయింట్లు (0.35 శాతం) తగ్గించడం గమనార్హం. ఆర్‌బీఐ భవిష్యత్‌లో తీసుకోబోయే వడ్డీ రేట్ల నిర్ణయంపై ‘వెసులుబాటు’ వైఖరినే కొనసాగించింది.

మున్ముందు సమీక్షల్లో వడ్డీ రేట్లను మరింత తగ్గించేందుకు అవకాశాలున్నాయి. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అధ్యక్షతన ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) మూడ్రోజులపాటు సమావేశమైంది. అందులో శక్తికాంతదా్‌సతో సహా నలుగురు సభ్యులు 0.35 శాతం తగ్గింపునకు ఓటు వేయగా.. మరో ఇద్దరు మాత్రం 0.25 శాతం కోతకు మద్దతు పలికారు. తదుపరి పరపతి సమీక్షలో భాగంగా అక్టోబరు 1, 3, 4 తేదీల్లో కమిటీ భేటీ కానుంది. చివరి రోజున ఆర్‌బీఐ సమీక్ష నిర్ణయాలను ప్రకటించనుంది. 2012 ఏప్రిల్‌ – 2013 మే మధ్యకాలంలోనూ ఆర్‌బీఐ రెపో రేట్లను నాలుగుసార్లు తగ్గించింది.

హైదరాబాద్‌లో కటెర్రా ప్లాంట్‌

సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఫ్యాక్టరీలోనే భవన నిర్మాణాన్ని 80 శాతం వరకూ పూర్తి చేసి పెద్ద, పెద్ద భవనాలను తక్కువ సమయంలో నిర్మిస్తున్న అమెరికా సిలికాన్‌ వ్యాలీ కంపెనీ కటెర్రా హైదరాబాద్‌లో యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. నిర్మాణంలో వినియోగించే బీమ్‌లు, కాలమ్‌లు, శ్లాబ్‌లు వంటి మొత్తం ఉత్పత్తులను ఇక్కడ తయారు చేస్తారు. 80 శాతం నిర్మాణం ఫ్యాక్టరీలోనే పూర్తవుతుందని.. బీమ్‌లు, శ్లాబ్‌లు, కిటికీలు, దర్వాజాలు వంటి వాటిని తయారు చేసి నిర్ణీత ప్రదేశంలో భవన నిర్మాణం చేపడతామని కటెర్రా ప్రెసిడెంట్‌ (ఆసియా, మధ్యప్రాచ్య) ఆశ్‌ భరద్వాజ్‌ తెలిపారు. లక్‌నౌలో ఆన్‌సైట్‌కు తీసుకువెళ్లడానికి వీలైన చిన్న ప్లాంట్‌తోపాటు తమిళనాడులోని కృష్ణగిరిలో కటెర్రాకు ప్లాంట్‌ ఉంది. ఈ ప్లాంట్‌ కంటే హైదరాబాద్‌ ప్లాంట్‌ పెద్దది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో హైదరాబాద్‌లోని శంషాబాద్‌ వద్ద 50 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారు. దీనికి బుధవారం భూమి పూజ జరిగింది. ఈ ఫ్యాక్టరీ 2020 మార్చినాటికి అందుబాటులోకి వస్తుందని భరద్వాజ్‌ అన్నారు. దాదాపు రూ.700 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ ఫ్యాక్టరీ ద్వారా 1,000 మందికి ప్రత్యక్షంగా, 7,000 మందికి పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. బీమ్‌లు, కాలమ్‌లు, శ్లాబ్‌లు వంటి భవన నిర్మాణంలో వినియోగించే అన్నింటిని ఇక్కడ తయారు చేస్తా రు.

రైతు బీమా పథకం మరో ఏడాది పొడగింపు

రైతు బీమా పథకాన్ని మరో ఏడాదిపాటు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 31.10 లక్షల కుటుంబాల్లో ధీమా పెరిగింది. ఈపథకం కింద జిల్లాలో లక్ష మందికి పైగా రైతులు బీమా పరిధిలోకి వస్తారు. గత ఆగస్టు 14 నుంచి రాష్ట్రంలో రైతుబీమా పథకం అమల్లోకి వచ్చింది. ఇప్పటి వరకు జిల్లాలో 331 మంది రైతులు మరణించగా ఇప్పటి వరకు 318 మంది రైతుల కుటుంబాలకు 15 కోట్ల 90 లక్షల రూపాయల ఆర్థికసహాయం అందింది. మరో 10 మంది రైతుల కుటుంబాలకు జీవిత బీమా సంస్థ నుంచి త్వరలో ఆర్థిక సాయం అందనున్నదని సమాచారం. గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. 2018 ఆగస్టు 14 నుంచి 2019 ఆగస్టు 13 వరకు 31 లక్షల 10 వేల మంది రైతుల పేరిట ప్రీమియం చెల్లించి వారందరిని బీమా పరిధిలోకి తీసుకొనివచ్చింది.జిల్లాలో 92,235 మంది రైతులు రైతు బీమా పథకం పరిధిలోకి వచ్చారు. ఈ సంవత్సరం మరో ఆరు రోజుల్లో బీమా పథకం గడువు ముగియనుండగా ప్రభుత్వం మళ్లీ ఈ సంవత్సరం కూడా దీనిని కొనసాగించాలని నిర్ణయించి జీవిత బీమా సంస్థకు ప్రీమియం చెల్లిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది.

కాగా బీమా ప్రీమియంను ఎల్ఐసీ పెంచింది. గతేడాది ఒక్కో రైతుకు ప్రభుత్వం రూ.2,271.50 చెల్లించింది. ఈ సారి రెండో విడత రైతు బీమా కోసం రూ.3,555.94 ప్రీమియంను నిర్ధారించింది. ఈ ప్రకారం ఎల్ఐసీకి ప్రభుత్వం.. 934.19 కోట్లు చెల్లించింది. 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వరకున్న మొత్తం 31. 21 లక్షల మందికి ఈ పథకం వర్తిస్తుంది.

భారత్ తో ద్వైపాక్షిక సంబంధాలు తెంచుకుంటున్నట్లు పాక్ ప్రకటన

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు, స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ని కేంద్రం రద్దుచేయడంపై పాకిస్తాన్‌ ప్రతీకార చర్యలకు దిగింది. పాక్‌లో పనిచేస్తున్న భారత రాయబారి అజయ్‌ బిసారియాను దేశం నుంచి బహిష్కరించింది. అలాగే భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలన్నింటినీ తెంచుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని నిలిపివేయాలని నిర్ణయించింది. ఇస్లామాబాద్‌లో ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ అధ్యక్షతన ఆగస్టు 7న జరిగిన జాతీయ భద్రతా కమిటీ(ఎన్‌ఎస్‌సీ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఎన్‌ఎస్‌సీ సమావేశం అనంతరం పాక్‌ విదేశాంగ మంత్రి షా మెహమూద్‌ ఖురేషీ మీడియాతో మాట్లాడుతూ..‘మా దౌత్యాధికారులు ఇకపై ఢిల్లీలో(భారత్‌) ఉండబోరు. అలాగే పాక్‌లో భారత రాయబారి అజయ్‌ బిసారియాను వెనక్కి పంపాలని నిర్ణయించాం. జమ్మూకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొడుతూ, ఆర్టికల్‌ 370ను రద్దుచేస్తూ భారత్‌ ఏకపక్షంగా చట్టవిరుద్ధమైన నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో భారత్‌తో కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందాలు, ఇతర ముఖ్యమైన విషయాల్లో కుదిరిన పరస్పర అవగాహన, ప్రోటోకాల్స్‌ను సమీక్షిస్తాం. అంతేకాదు.. జమ్మూకశ్మీర్‌ విషయంలో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఐక్యరాజ్యసమితి, భద్రతా మండలి దృష్టికి తీసుకెళతాం’ అని తెలిపారు. తమ గగనతలాన్ని సెప్టెంబర్‌ 5 వరకూ పాక్షికంగా మూసేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ విషయంలో తాము చైనాతోనూ సంప్రదింపులు జరుపుతామని చెప్పారు. ప్రస్తుతం భారత రాయబారి అజయ్‌ బిసారియా ఇస్లామాబాద్‌లో పనిచేస్తుండగా, భారత్‌లో పాక్‌ రాయబారి మొయిన్‌–ఉల్‌–హక్‌ ఇంకా బాధ్యతలు స్వీకరించలేదు.

ఫోర్బ్స్‌’ సంపన్న మహిళా క్రీడాకారిణుల జాబితాలో 13వ స్థానంలో సింధు

బ్యాడ్మింటన్‌ స్టార్‌ పూసర్ల వెంకట సింధు ప్రపంచ సంపన్న మహిళా క్రీడాకారిణుల జాబితాలో 13వ స్థానంలో నిలిచింది. ఫోర్బ్స్‌ విడుదల చేసిన ఈ జాబితాలో భారత్‌ నుంచి ఆమె ఒక్కరికే చోటు దక్కడం విశేషం. ఫోర్బ్స్‌ లెక్కల ప్రకారం ఆమె గతేడాది సంపాదన రూ. 39 కోట్లు (5.5 మిలియన్‌ డాలర్లు)గా తేల్చింది. ‘సింధు విలువైన మార్కెట్‌ కలిగిన భారత మహిళా అథ్లెట్‌గా కొనసాగుతోంది. ఆమె గతేడాది సీజన్‌ ముగింపు టోర్నీ అయిన ‘బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌’లో విజేతగా నిలువడంతో ఆమె బ్రాండింగ్‌కు ఢోకా లేకపోయింది’ అని ఫోర్బ్స్‌ తెలిపింది. ఈ ఆదాయంలో ప్రైజ్‌మనీ, కాంట్రాక్టు ఫీజులు, బోనస్, ఎండార్స్‌మెంట్లు, అప్పియరెన్స్‌ ఫీజులు అన్ని కలిసి ఉన్నాయని ఆ సంస్థ వెల్లడించింది. అత్యధికంగా ఆర్జించే మహిళా అథ్లెట్ల టాప్‌–15 జాబితాలో భారత్‌ నుంచి మరే క్రీడాకారిణి కూడా ఆమె సమీప దూరంలో లేదు. ఈ లిస్ట్‌లో అమెరికా టెన్నిస్‌ దిగ్గజం సెరెనా విలియమ్స్‌ 29.2 మిలియన్‌ డాలర్ల (రూ. 207 కోట్లు)తో అగ్రస్థానంలో ఉంది.

కోచ్‌ మికీ ఆర్థర్‌ ను తప్పించనున్న పాక్

పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు హెడ్‌ కోచ్‌గా మికీ ఆర్థర్‌కు పొడిగింపు ఇవ్వరాదని పాక్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) నిర్ణయించింది. అతనితో పాటు బౌలింగ్‌ కోచ్‌ అజహర్‌ మహమూద్, బ్యాటింగ్‌ కోచ్‌ గ్రాంట్‌ ఫ్లవర్, ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ ల్యూడెన్‌లను కూడా పీసీబీ తప్పించనుంది. ఈ నలుగురి కాంట్రాక్ట్‌ ఈ నెల 15తో ముగుస్తుంది. అయితే ఎవరినీ కొనసాగించకుండా వీలైనంత త్వరలో కొత్త సహాయక సిబ్బందిని ఎంపిక చేస్తామని బోర్డు చైర్మన్‌ ఎహ్‌సాన్‌ మణి వెల్లడించారు. వన్డే ప్రపంచకప్‌లో 9 మ్యాచ్‌లలో 5 గెలిచిన పాకిస్తాన్‌ 11 పాయింట్లతో న్యూజిలాండ్‌తో సమంగా నిలిచింది. అయితే రన్‌రేట్‌లో వెనుకబడటంతో సెమీస్‌ అవకాశం చేజార్చుకుంది. ఆర్థర్‌ 2016 టి20 ప్రపంచ కప్‌ తర్వాత పాక్‌ జట్టు కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. అతని పదవీకాలంలో పాక్‌ వన్డేల్లో చాంపియన్స్‌ ట్రోఫీ గెలుచుకోవడం పెద్ద ఘనత కాగా, టి20ల్లో నంబర్‌వన్‌ జట్టుగా నిలిచింది.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments