కరెంట్ అఫైర్స్ – ఆగస్టు 7, 2020

దేశంలో తొలి కిసాన్ ప్రత్యేక పార్శిల్ రైలు ప్రారంభం

భారత దేశపు తొలి కిసాన్ స్పెషల్ పార్శిల్ రైలు ఆగస్టు 7 సేవలు ప్రారంభించింది. మహారాష్ట్రలోని దేవ్‌లాలీ నుంచి బిహార్‌లోని దానాపూర్ వరకు ఇది ప్రయాణిస్తుంది. దీనిలో సాధారణ ప్రయాణికులకు అనుమతి ఉండదు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ రైలును ప్రారంభించారు. 2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కిసాన్ రైలు ప్రాజెక్టు ప్రకటించారు.

 • ఈ రైలు దేవ్‌లాలీలో బయల్దేరిదానాపూర్ చేరుకుంటుంది. 1519 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. కూరగాయలు, పండ్లు రవాణా చేస్తూ, కొన్ని స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలులో 10 బోగీలు ఉంటాయి.

 • నాసిక్‌లో కూరగాయలు, పండ్లు, పూలు విస్తారంగా పండుతాయి. వీటిని ఈ రైలు ద్వారా పాట్నా, ప్రయాగ్‌రాజ్, కట్ని సహా ఉత్తరాదికి పంపిస్తారు.

 • అత్యంత త్వరగా చెడిపోయే ఆహార పదార్థాల రవాణాకు రిఫ్రిజిరేటెడ్ పార్శిల్ వ్యాన్లను భారతీయ రైల్వేలు సమకూర్చుకున్నాయి. ప్రస్తుతం 9 రిఫ్రిజిరేటెడ్ పార్శిల్ వ్యాన్లు అందుబాటులో ఉన్నాయి. దీనిలో రవాణాకు సాధారణ వ్యాన్లకు వసూలు చేసే ఛార్జీ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది.

☛ దళిత కుటుంబానికి అయోధ్య భూమి పూజ తొలి ప్రసాదం

అయోధ్యలో రామ మందిర భూమి పూజకు సంబంధించిన ప్రసాదాన్ని తొలిగా ఒక దళిత కుటుంబం అందుకుంది. లడ్డూలు, రామచరిత మానస్‌ పుస్తకం, తులసిమాల ఉన్న ప్రసాదాన్ని యూపీ సీఎం ఆదేశాల మేరకు అయోధ్యలోని మేస్త్రీ వృత్తిలో ఉన్న మహావీర్‌ కుటుంబానికి అధికారులు పంపించారు. మహావీర్‌ అయోధ్యలోని సుతాటి ప్రాంతంలో కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. 2019 ఎన్నికల సందర్భంగా మహావీర్‌ ఇంట్లో ఆదిత్యనాథ్‌ భోజనం చేశారు. ‘అలి– బజరంగ బలి’ వ్యాఖ్యల కారణంగా అంతకుముందే సీఎం యోగిని మూడు రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ‘నన్ను గుర్తుంచుకుని ప్రసాదం పంపినందుకు ఆయనకు కృతజ్ఞతలు’ అని మహావీర్‌ పేర్కొన్నారు.

☛ ఇకపై బంగారం విలువలో 90 శాతం వరకూ రుణం

కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో ఆర్థిక రంగానికి ఊతం అందించడానికి తన ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కీలక రేట్లను పావుశాతం తగ్గిస్తుందన్న అంచనాలకు భిన్నంగా గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) నిర్ణయం తీసుకుంది. కీలక రేట్లను యథాతథంగా కొనసాగించాలని మూడు రోజుల పాటు జరిగిన సమావేశం ఆగస్టు 6 నిర్ణయించింది. కీలక నిర్ణయాల్లో కొన్ని….

 • రేట్లను యథాతథంగా కొనసాగిస్తుండడంతో రెపో రేటు (4 శాతం) 20 ఏళ్ల (2000 తర్వాత) కనిష్ట స్థాయిలోనే కొనసాగుతోంది. ఇక రివర్స్‌ రెపో రేటు (బ్యాంకులు ఆర్‌బీఐ వద్ద ఉంచే అదనపు నిధులపై లభించే వడ్డీరేటు) 3.35 శాతంగా కొనసాగుతుంది. వాణిజ్య బ్యాంకులు తమ డిపాజిట్లలో ఆర్‌బీఐ వద్ద ఉంచాల్సిన కనీస మొత్తం నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్‌) 3 శాతంగా కొనసాగనుంది.

 • పసిడిని బ్యాంకింగ్‌లో హామీగా పెట్టి రుణం తీసుకునే వ్యక్తులు ఇకపై ఆ విలువలో 90% రుణాన్ని పొందగలుగుతారు. తాజా నిర్ణయం 2021 మార్చి వరకూ అమల్లో ఉంటుంది.

 • రిటైల్‌ ద్రవ్యోల్బణం 2020–21 ద్వితీయార్థంలో పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయని పేర్కొంటూ, ధరల స్పీడ్‌ను కేంద్రం నిర్దేశిత 4 శాతం కట్టడే లక్ష్యంగా (2 ప్లస్‌ లేదా 2 మైనస్‌) ప్రస్తుతానికి కీలక రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 4%) యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటన.

 • వ్యవసాయ రంగానికి సాయం అందించే క్రమంలో నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (నాబార్డ్‌)కు రూ.5,000 కోట్ల లిక్విడిటీ (ద్రవ్య లభ్యత)ను ఆర్‌బీఐ కల్పించింది. అలాగే హౌసింగ్‌ సెక్టార్‌ విషయంలో ద్రవ్యపరమైన ఇబ్బందులు తలెత్తకుండా నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌ (ఎన్ హెచ్ బీ)కి కూడా రూ.5,000 కోట్ల ప్రత్యేక లిక్విడిటీ సౌలభ్యత కల్పిస్తున్నట్లు పేర్కొంది.

☛ రైతు బీమాకు రూ.1,141 కోట్లు విడుదల చేసిన తెలంగాణ

రైతు బీమా పథకం కోసం రూ.1,141.44 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి ఆగస్టు 6 జీవో జారీ చేశారు. రాష్ట్రంలో 18 నుంచి 59 ఏళ్లు ఉండే అర్హులైన రైతులకు ఈ నిధులతో బీమా సౌకర్యం కల్పించనున్నారు.

 • రాష్ట్రంలో 2018 ఆగస్టు14 నుంచి రైతు బీమా అమలవుతోంది.

 • 60 ఏళ్లలోపు పట్టాదారు రైతులందరూ అర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది.

 • 2018 లో 31.27 లక్షల మంది రైతులకు ఎల్ఐసీ ద్వారా ఇన్సూరెన్స్ కల్పించారు.

 • ఒక్కోరైతుకు రూ .2,271.50 (జీఎస్టీ కలుపుకుని) చొప్పున ఎల్ఐసీకి ప్రభుత్వం రూ . 710.50 కోట్లు చెల్లించింది.

 • 2019 ఆగస్టు 13వ తేదీ వరకు బీమా పరిధిలో ఉన్న 17,519 మంది రైతులు దురదృష్టవశాత్తు వివిధ కారణాలతో చనిపోయారు. వారి వివరాలను వ్యవసాయ విస్తరణ అధికారులు (ఎఇఒ) ఎల్ఐసీకి ఆన్‌లైన్ లో సమర్పించగా రూ 5 లక్షల చొప్పున రూ.875.95 కోట్ల పరిహారం చెల్లించింది. అంటే ప్రీమియం కట్టిన మొత్తం కంటే అధికంగా క్లెయిమ్స్ రూపంలో అందించింది.

 • 2019లో 32.16 లక్షల మంది రైతులకు బీమా వర్తింపజేశారు. రూ.3,157.40 ప్రీమియం చొప్పున ఎల్ఐసీకి రూ.1,065.37 కోట్లు ప్రభుత్వం చెల్లించింది. జూన్ 20 నాటికి 10,961 రైతు కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున ఎల్ఐసీ రూ.548 కోట్ల పరిహారం ఇచ్చింది.

☛ దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూత

అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్మన్, దుబ్బాక శాసనసభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి (57) గుండెపోటుతో ఆగస్టు 5 కన్నుమూశారు. కాలిపై కురుపుతో బాధపడుతున్న ఆయన 15 రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలోనే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బుధవారం రాత్రి 2.15 గంటల సమయంలో గుండెపోటుకు గురయ్యారు. వైద్యులు ఆయనను కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆగస్టు 6 ఆయన స్వగ్రామం చిట్టాపూర్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పెద్దసంఖ్యలో అభిమానులు చిట్టాపూర్‌ తరలివచ్చి ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు.

☛ మహిళా సంఘాలకు సహాయం కోసం బీ–పోస్ట్‌ ప్రారంభం

స్వయం సహాయక సంఘాల మహిళల బ్యాంకు లావాదేవీలకు సంబంధించి ఐటీ విభాగం ఎమర్జింగ్‌ టెక్నాలజీ బ్లాక్‌చెయిన్‌తో రూపొందించిన ‘బ్లాక్‌చెయిన్‌ – ప్రొటెక్షన్‌ ఆఫ్‌ స్త్రీ నిధి ట్రాన్జాక్షన్స్‌’(బీ–పోస్ట్‌)ను ఆగస్టు 6న తెలంగాణలో ప్రారంభించారు. ఈ విధానం ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 1.5 లక్షల మంది సంఘాలకు చెందిన మహిళలు ‘స్త్రీ నిధి’ద్వారా మంజూరయ్యే రుణాలకు క్రెడిట్‌ రేటింగ్‌ పొందే అవకాశం ఉంటుంది. తద్వారా బ్యాంకులు, ఫైనాన్షియల్‌ సంస్థల నుంచి రుణాలు పొందే వీలు కలుగుతుంది. హైదరాబాద్‌కు చెందిన కాగ్నిటోచెయిన్‌ అనే స్టార్టప్‌ ‘బీ పోస్ట్‌’ను ప్రయోగాత్మకంగా రూపొందించింది. ఈ విధానంతో రుణవితరణ, చెల్లింపులు సులువు కానున్నాయి.

☛ ఏపీ రాజధాని నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే

రాజధాని’ ఎక్కడ ఉండాలన్నది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో తీసుకునే నిర్ణయమే అని, అందులో తమ పాత్రేమీ ఉండదని కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం సెక్షన్‌ 6 ప్రకారం ఏపీ రాజధాని విషయంలో ప్రత్యామ్నాయాల నిమిత్తం విశ్రాంత ఐఏఎస్‌ అధికారి కేసీ శివరామకృష్ణన్‌ నేతృత్వంలో ఏర్పాటైన నిపుణుల కమిటీ 2014 ఆగస్టు 30న ఇచ్చిన నివేదికను కేంద్రం అదే ఏడాది సెప్టెంబర్‌ 1న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి పంపినట్లు వివరించింది. అనంతరం 2015 ఏప్రిల్‌ 23న అప్పటి రాష్ట్ర ప్రభుత్వమే అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేసింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ‘ఆంధ్రప్రదేశ్‌ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి చట్టం’ తెచ్చి జూలై 31న గెజిట్‌లో ప్రచురించిందని తెలిపింది. దీని ప్రకారం అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ ఏరియాను శాసన రాజధానిగా, విశాఖపట్నం మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ ఏరియాను కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ఏరియాను న్యాయ రాజధానిగా ప్రకటించిందని కోర్టుకు నివేదించింది.

☛ ఏపీలో కరోనా రోగి వద్ద కాలింగ్‌ బెల్‌

ఆంధ్రప్రదేశ్ లో కరోనాతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి పడకల దగ్గర కాలింగ్‌ బెల్స్‌ ఏర్పాటు చేయనున్నారు. కొన్ని ఆస్పత్రుల్లో వైద్యులు తరచూ రౌండ్స్‌కు వెళ్లడం లేదన్న విమర్శలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అవసరమైనప్పుడు రోగి బెల్‌ నొక్కితే చాలు.. నర్సు లేదా డాక్టర్‌ వచ్చి పేషెంట్‌ పరిస్థితి తెలుసుకునే వీలుంటుంది. ఈ నేపథ్యంలో అన్ని కోవిడ్‌ ఆస్పత్రుల్లో వీటిని ఏర్పాటు చేయాలని సూపరింటెండెంట్‌లకు ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు.

☛ ఏపీలో డిగ్రీ, ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ఆనర్స్‌

రాష్ట్రంలో ఈ విద్యాసంవత్సరం నుంచి డిగ్రీ, ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ఆనర్స్‌ పద్ధతిని ప్రవేశపెట్టనున్నామని విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. ఆయా కోర్సుల్లో ప్రవేశాలను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని సీఎం ఆదేశించారని తెలిపారు.

 • నాలుగేళ్ల బీఈ, బీటెక్‌ కోర్సుల్లో 10 నెలలు అప్రెంటిస్‌షిప్‌ విధానం. కనీసం 20 క్రెడిట్లు సాధిస్తే బీటెక్‌ ఆనర్స్‌ డిగ్రీ. ఉదాహరణకు బీటెక్‌ మెకానికల్‌ చేస్తూ కంప్యూటర్‌ సైన్సులో కొన్ని అంశాలను అధ్యయనం చేయడం ద్వారా 20 క్రెడిట్లు సాధిస్తే ఆ విద్యార్థికి బీటెక్‌ ఆనర్స్‌ ఇవ్వాలని సూచన.

 • ప్రకాశంలో ఉపాధ్యాయ విద్య కోర్సుకు ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేక వర్సిటీ, విజయనగరంలో మరో కొత్త వర్సిటీని ఈ ఏడాది నుంచే ప్రారంభించాలని సీఎం ఆదేశం. టీచర్‌ ట్రైనింగ్‌ వర్సిటీకి జిల్లాల్లోని టీచర్‌ ట్రైనింగ్‌ సంస్థలు అనుబంధంగా ఉంటాయి.

☛ 2020 జాతీయ పంచాయతీ అవార్డుల్లో ఏపీకి 15 పురస్కారాలు

గ్రామాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలకు గాను ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏకంగా 15 పురస్కారాలు దక్కాయి. ఏటా కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ జాతీయ స్థాయిలో ఇచ్చే అవార్డుల్లో భాగంగా 2020 సంవత్సరానికిగానూ రాష్ట్రానికి ఈ పురస్కారాలు దక్కాయి. ప్రతిష్టాత్మక అవార్డులు సాధించడంపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.

 • 2020 సంవత్సరానికి గానూ ఈ–పంచాయత్‌ పురస్కార్‌ కేటగిరి–ఐఐ()లో రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments