Current Affairs – Telugu – August 7, 2019

370 రద్దు తీర్మానం, పునర్ వ్యవస్థీకరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం

జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించేందుకు రాజ్యాంగంలోని 370వ అధికరణాన్ని రద్దు చేసే తీర్మానాన్ని, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టే బిల్లును ఆగస్టు 6న లోక్ సభ ఆమోదం పొందింది. కాగా, తీర్మానం, బిల్లు రాజ్యసభలో సోమవారమే పాస్‌ అవ్వడంతో వీటికి సోమవారం పార్లమెంటు ఆమోదం లభించనట్లైంది. చర్చ అనంతరం తీర్మానం ఆమోదంపై ఓటింగ్‌ నిర్వహించగా, అనుకూలంగా 351 ఓట్లు, వ్యతిరేకంగా 72 ఓట్లు పడ్డాయి. ఒక సభ్యుడు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.

జమ్మూ కశ్మీర్‌ను విడగొట్టి, లదాఖ్‌ను అసెంబ్లీ రహిత కేంద్ర పాలిత ప్రాంతంగా, జమ్మూ కశ్మీర్‌ను అసెంబ్లీ సహిత కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేందుకు తీసుకొచ్చిన ‘జమ్మూ కశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లు–2019’పై కూడా ఓటింగ్‌ నిర్వహించగా, 370 ఓట్లు అనుకూలంగా, 70 ఓట్లు వ్యతిరేకంగా పడ్డాయి. ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల బిల్లును మాత్రం లోక్‌సభ నుంచి అమిత్‌ షా వెనక్కు తీసుకుంటూ, ఈ రిజర్వేషన్లు కేంద్రపాలిత ప్రాంతాల్లో వాటంతట అవే అమలవుతాయని అన్నారు. రాజ్యసభ నుంచి కూడా బిల్లును వెనక్కు తీసుకుంటామన్నారు.

బిల్లును ప్రవేశపెడుతున్నప్పుడు, ఆ తర్వాత చర్చ సమయంలోనూ అమిత్‌ షా ఎంతో ఆవేశంగా, ఉద్వేగంతో సుదీర్ఘ సమయంపాటు ప్రసంగించారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే), చైనా ఆక్రమణలో ఉన్న ఆక్సాయ్‌చిన్‌లు కూడా భారత్‌లో అంతర్భాగమేనని చెప్పారు. కశ్మీర్‌లో శాంతి కోసం తమ ప్రభుత్వం ప్రజలతో చర్చిస్తుందనీ, అంతేకానీ వేర్పాటువాద సంస్థ అయిన హురియత్‌ కాన్ఫరెన్స్‌తో చర్చలేమీ ఉండవని ఆయన స్పష్టం చేశారు. కశ్మీర్‌ను పాకిస్తాన్‌ ఆక్రమించినప్పుడు కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకోకుండా, నాడే భారత సైనికులకు స్వేచ్ఛ ఇచ్చి ఉంటే ఈరోజు పీవోకే కూడా సంపూర్ణంగా భారత్‌లో అంతర్భాగంగా ఉండేదని అమిత్‌ షా పేర్కొన్నారు. తీర్మానం, బిల్లును లోక్‌సభ ఆమోదించిన సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా సభలోనే ఉన్నారు.

బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ హఠాన్మరణం

బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ (67) కన్నుమూశారు. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో ఆమె గుండెపోటుకు గురవడంతో, అపస్మారక స్థితిలో ఉన్న సుష్మాను హుటాహుటిన ఢిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌)లోని ఎమెర్జెన్సీ వార్డ్‌కు తీసుకువచ్చారు. దాదాపు గంటపాటు ఆమెను కాపాడేందుకు వైద్యులు విఫలయత్నం చేశారు. ఆ తరువాత రాత్రి 10.50 గంటల సమయంలో ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. పార్టీలకు అతీతంగా అందరికీ ఆప్తురాలయిన సుష్మా హఠాన్మరణం ఆమె సన్నిహితులకు, అభిమానులకు దిగ్భ్రాంతిని కలిగించింది. ముఖ్యంగా ఆర్టికల్‌ 370 రద్దు విజయంతో సంబరాలు చేసుకుంటున్న బీజేపీ నేతలు, శ్రేణులకు ఈ వార్త అశనిపాతమైంది. సుష్మాస్వరాజ్‌కు భర్త స్వరాజ్‌ కౌశల్, కూతురు బన్సురి ఉన్నారు. 2016లో సుష్మాస్వరాజ్‌కు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లోనూ అనారోగ్యం కారణంగా చూపి ఆమె పోటీ చేయలేదు.

  • 1952 ఫిబ్రవరి 14న హరియాణాలోని అంబాలాలో సుష్మ జన్మించారు. పంజాబ్‌ యూనివర్సిటీ నుంచి న్యాయవిద్య ముగించారు.
  • 1975 జూలై 13న స్వరాజ్‌ కౌశల్‌ను వివాహమాడారు. కొన్నాళ్లు సుప్రీంకోర్టు న్యాయవాదిగా పనిచేశారు.
  • 1977లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
  • 1998లో ఢిల్లీ సీఎంగా పదవి చేపట్టి.. తొలి మహిళగా గుర్తింపు పొందారు.
  • 1996లో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగా ఉన్నారు.
  • ప్రధాని మోదీ గత మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు.
  • తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించి.. తెలంగాణ చిన్నమ్మగా ప్రజల మదిలో నిలిచారు.

17 దేశాల్లో తీవ్ర స్థాయికి జలసంక్షోభం

భారత్ సహా ప్రపంచంలోని 17 దేశాల్లో జలసంక్షోభం అత్యంత తీవ్ర స్థాయికి చేరుకుందని ప్రపంచ వనరుల సంస్థ(డబ్ల్యూఆర్‌ఐ) వెల్లడించింది. ఈ మేరకు ‘ఆక్వెడక్ట్ వాటర్ రిస్క్ అట్లాస్’ పేరుతో ఆగస్టు 6న ఒక నివేదికను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా 189 దేశాల్లో రాష్ట్రాలవారీగా జల సంక్షోభం, కరవు ముప్పు, వరదల ముప్పును అధ్యయనం చేసి ఈ నివేదికను ఆ సంస్థ రూపొందించింది. ప్రపంచవ్యాప్తంగా 17 దేశాల్లో జల సంక్షోభం అత్యంత తీవ్రస్థాయిలో ఉందని, ఈ జాబితాలో భారత్ 13వ స్థానంలో ఉందని డబ్ల్యూఆర్‌ఐ తన నివేదికలో తెలిపింది. ఉత్తర భారతంలో భూగర్భజలాలు వేగంగా తగ్గుతున్నాయని పేర్కొంది. పక్కా ప్రణాళికలతో జలసంరక్షణ చర్యలకు పూనుకోవాల్సిన ఆవశ్యకత ఉందని స్పష్టం చేసింది.

చంద్రయాన్-2 కక్ష్య ఐదోసారి పెంపు

చంద్రయాన్-2 మిషన్‌కు ఆగస్టు 6న ఐదో(చివరిది) విడత కక్ష్య దూరాన్ని పెంచే ఆపరేషన్‌ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విజయవంతంగా పూర్తి చేసింది. బెంగళూరు సమీపంలోని బైలాలు భూనియంత్రిత కేంద్రం నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు ఈ ఆపరేషన్‌ను చేపట్టారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా షార్ కేంద్రం నుంచి జూలై 22న జీఎస్‌ఎల్‌వీ మార్క్3-ఎం1 రాకెట్ ద్వారా చంద్రయాన్ -2ను ప్రయోగించారు. ఆగస్టు 14న చంద్రుడు పరిభ్రమిస్తున్న కక్ష్యలోకి చంద్రయాన్-2 ప్రవేశించి, ఆ తర్వాత చంద్రుడి స్థిర కక్ష్యలోకి ఆగస్టు 20 నాటికి చేరుతుంది. అనంతరం సెప్టెంబరు 7న చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ విక్రమ్ దిగుతుంది.

భారత్ క్రికెట్ టీ20లో అరంగ్రేటం చేసిన నాలుగో పిన్న వయస్కుడిగా రాహుల్

గయానాలో వెస్టిండీస్‌తో ఆగస్టు 6న జరిగిన చివరిదైన మూడో టి20 మ్యాచ్‌లో లెగ్ స్పిన్నర్ రాహుల్ చహర్ అరంగేట్రం చేశాడు. భారత్ తరఫున టి20ల్లో అరంగేట్రం చేసిన నాలుగో పిన్న వయస్కుడిగా రాహుల్ (20 ఏళ్ల 2 రోజులు) నిలిచాడు. ఈ జాబితాలో వాషింగ్టన్ సుందర్ (18 ఏళ్ల 80 రోజులు), రిషభ్ పంత్ (19 ఏళ్ల 120 రోజులు), ఇషాంత్ శర్మ (19 ఏళ్ల 152 రోజులు) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ఈ క్రమంలో టి20ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన 81వ క్రికెటర్‌గా అతను గుర్తింపు పొందాడు.

ప్రముఖ రచయిత్రి మారిసన్ కన్నుమూత

ప్రముఖ అమెరికన్ సాహితీ వేత్త, నవలా రచయిత్రి నోబెల్ అవార్డు గ్రహీత టోని మారిసన్ (88) న్యూయార్క్‌లోని మోంటిఫియోర్ మెడికల్ సెంటర్‌లో ఆగస్టు 5న కన్నుమశారు. అమెరికాలోని ఒహియో రాష్ట్రంలోగల లోరైన్‌లో 1931, ఫిబ్రవరి 18న మారిసన్ జన్మించారు. ఆధునిక సాహిత్యానికి మార్గదర్శిగా ఖ్యాతి గడించిన ఆమె బిలవ్‌‌డ నవల ద్వారా ఎనలేని కీర్తిని సంపాదించారు. సాంగ్ ఆఫ్ సాలమన్‌తో పాటు ఇతర రచనలు ఆమెలోని భావుకతకు, ఊహాత్మక శక్తికి దర్పణంగా నిలిచాయి.

వినియోగదారుల రక్షణ బిల్లుకు ఆమోదం

వినియోగదారులకు మరిన్ని హక్కులు కల్పించేందుకు ఉద్దేశించిన కన్జ్యూమర్ ప్రొటెక్షన్ బిల్లు-2019ను ఆగస్టు 6న రాజ్యసభ ఆమోదించింది. కేంద్ర ఆహారం, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చ సందర్భంగా మంత్రి పాశ్వాన్ మాట్లాడుతూవినియోగదారుల ఫిర్యాదులపై తక్షణ, సులభ పరిష్కారమే ఈ బిల్లు అంతిమ లక్ష్యమన్నారు. రాష్ట్రపతి ఆమోదంతో ఈ బిల్లు చట్టంగా మారితే 1986 నాటి వినియోగదారుల చట్టం రద్దవుతుంది. ఈ బిల్లును లోక్‌సభ జూలై 30 ఆమోదించింది.

ఈ బిల్లు ప్రకారం.. వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించేందుకు వీలుగా ‘వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ మరియు ఫోరంలు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఏర్పాటుకానున్నాయి. వినియోగదారుల హక్కుల పరిరక్షణ, అమలు, ప్రోత్సాహం లక్ష్యంగా సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(సీసీపీఏ) రూపుదాల్చనుంది. సురక్షితంకాని వస్తువుల తయారీ కంపెనీలపై రూ.10 లక్షల వరకు జరిమానా విధింపు. బాధ్యులకు రెండేళ్ల వరకు జైలు శిక్ష.

క్రికెట్‌కు బ్రెండన్ మెకల్లమ్ వీడ్కోలు

క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు పలుకుతున్నట్లు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ ఆగస్టు 6న ప్రకటించాడు. అంతర్జాతీయ పోటీ క్రికెట్ నుంచి 2016లోనే తప్పుకొన్న అతడు ప్రపంచవ్యాప్తంగా టి20 లీగ్‌లలో ఆడుతున్నాడు. ప్రసుత్తం కెనడాలో జరుగుతున్న గ్లోబల్ టి20 లీగ్‌లో టొరంటో నేషనల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. టెస్టుల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ (54 బంతుల్లో) రికార్డు మెకల్లమ్ పేరిటే ఉంది. 2016లో ఆస్ట్రేలియాపై తన చివరి టెస్టులో అతడీ రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో న్యూజిలాండ్ తరఫున ట్రిపుల్ సెంచరీ చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా కూడా మెకల్లమ్ గుర్తింపు పొందాడు.

కాళోజీ విశ్వవిద్యాలయానికి ఎంసీఐ గుర్తింపు

కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) ఆగస్టు 6న గుర్తింపునిచ్చింది. దీంతో వర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో చదివే ఎంబీబీఎస్, ఎండీ, సూపర్ స్పెషాలిటీ మెడికల్ విద్యార్థులందరికీ ఈ వర్సిటీ పేరు మీదే సర్టిఫికెట్లు జారీ కానున్నాయి. రాష్ట్ర విభజన జరిగాక 2016-17 వైద్య విద్యా సంవత్సరం నుంచి కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ ఉనికిలోకి వచ్చింది.

కెడాయ్ న్యాట్‌కాన్ సదస్సు ప్రారంభం

ఇజ్రాయిల్‌లోని టెల్ అవీవ్ నగరంలో ఆగస్టు 6న కాన్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) న్యాట్‌కాన్ సదస్సు– 2019 ప్రారంభమైంది. ఈ సందర్భంగా సమావేశాన్ని ఉద్దేశించి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఇండియా ఇజ్రాయెల్ దేశాల మధ్య ఇన్నాళ్లుగా రక్షణ, వ్యవసాయ రంగాల్లో మాత్రమే ద్వైపాక్షిక వాణిజ్యం జరిగిందని, ఇక నుంచి సాంకేతికత, మౌలిక, నిర్మాణ రంగాల్లో బలపడాల్సిన అవసరముందని ఆయన ఆకాంక్షించారు.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments