☛ ఆయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన
శ్రీరామచంద్రుడు జన్మించాడని భక్తులు విశ్వసించే ఉత్తరప్రదేశ్ లోని ఆయోధ్యలో భవ్యమైన రామ మందిర నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. సుముహూర్త సమయమైన ఆగస్టు 5న మధ్యాహ్నం 12.44 గంటలకు శంకుస్థాపన జరిపారు. అయోధ్యలో రామ జన్మభూమిని, హనుమాన్‌గఢీ ఆలయాన్ని సందర్శించిన తొలి ప్రధాని నరేంద్ర మోదీయేనని యూపీ ప్రభుత్వం తెలిపింది. భూమి పూజను పురస్కరించుకుని ప్రత్యేక స్మారక పోస్టల్ స్టాంప్‌ను మోదీ
ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనంది బెన్ పటేల్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్, శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చీఫ్ సంత్ నృత్య గోపాల్ దాస్ విశిష్ట అతిథులుగా హాజరయ్యారు.
హిందూ, ముస్లిం వర్గాల మధ్య దశాబ్దాలుగా సాగిన వివాదం అనంతరం.. రామజన్మభూమి ప్రాంతం రామ్‌లల్లాకే చెందుతుందని స్పష్టం చేస్తూ గత సంవత్సరం సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పు ప్రకటించిన నేపథ్యంలో రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమమైంది. 1992లో ఆ ప్రదేశంలో ఉన్న బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చివేయడం, తదనంతరం దేశవ్యాప్తంగా మతకల్లోలాలు చెలరేగడం తెలిసిందే.
☛ కృష్ణా జలాల్లో ఏపీకి 17.. తెలంగాణకు 37.673 టీఎంసీలు
కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు 37.672, ఆంధ్రప్రదేశ్‌కు 17 టీఎంసీలను కృష్ణా బోర్డు కేటాయించింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా చెన్నై తాగునీటి సరఫరా, రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు తాగు, సాగు అవసరాల కోసం 9, హంద్రీ–నీవాకు 8 టీఎంసీలను ఏపీకి కేటాయించింది. తెలంగాణకు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 7.746, నాగార్జునసాగర్ నుంచి ఎడమ కాలువ, ఏఎమ్మార్పీకి 22.186, హైదరాబాద్ తాగునీటి అవసరాలు, మిషన్ భగీరథకు 7.740 టీఎంసీలను కేటాయించింది. కేటాయించిన నీటి కంటే అదనంగా వినియోగించుకోకుండా ఆయా ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లు బాధ్య త తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు ఆగస్టు 5న కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి హరికేష్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు.
☛ తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు – పలు రిజర్వాయర్లకు పేర్లు
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఆగస్టు 5న ప్రగతి భవన్లో రాష్ట్ర మంత్రివర్గం సుదీర్ఘంగా సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సచివాలయం కొత్త భవన సముదాయం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన డిజైన్లను ఆమోదించింది.
-
నియంత్రిత పద్ధతిలో 1.13 కోట్ల ఎకరాల్లో పంటలు వేసారని, మరో 10–12 లక్షల ఎకరాల్లో పంటలు వేయాల్సి ఉందని, 8.65 లక్షల ఎకరాల్లో వివిధ రకాల తోటలున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు చెప్పారు.
-
దుమ్ముగూడెం బ్యారేజికి సీతమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్‌కు నృసింహ స్వామి రిజర్వాయర్, తుపాకులగూడం బ్యారేజికి సమ్మక్క బ్యారేజిగా నామకరణం చేస్తూ తీర్మానించింది.
టీఎస్–బీపాస్‌కు ఆమోదం
భవన నిర్మాణ అనుమతులను సరళతరం చేస్తూ రూపొందించిన టీఎస్–బీపాస్ పాలసీని మంత్రివర్గం ఆమోదించింది. టీఎస్–ఐపాస్ లాగానే టీఎస్–బీపాస్ కూడా అనుమతుల విషయంలో పెద్ద సంస్కరణ అని కేబినెట్ అభిప్రాయపడింది.
హైదరాబాద్ గ్రిడ్ పాలసీకి ఆమోదం
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమలు ఒకేచోట కాకుండా నగరం నలువైపులా విస్తరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఐటీ పరిశ్రమల కారిడార్‌గా పేరొందిన పశ్చిమ ప్రాంతంలో మినహా ఇతర ప్రాంతాల్లో ఐటీ కంపెనీలు పెట్టేవారికి అదనపు ప్రోత్సాహకాలు అందించేందుకు ప్రతిపాదిత హైదరాబాద్ గ్రిడ్ పాలసీని కేబినెట్ ఆమోదించింది.
-
ఉత్తరాన కొంపల్లి, పరిసర ప్రాంతాలు, తూర్పున ఉప్పల్, పోచారం, దక్షిణాన విమానాశ్రయం, శంషాబాద్, ఆదిభట్ల, వాయవ్యంలో(నార్త్‌వెస్ట్), కొల్లూరు, ఉస్మాన్‌నగర్‌తో పాటు పశ్చిమ కారిడార్ వెలుపలి ఇతర ప్రాంతాల్లో ఐటీ పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించడానికి ఈ పాలసీని ప్రభుత్వం తెచ్చింది.
-
2019–20లో హైదరాబాద్ 18 శాతం వృద్ధి రేటుతో రూ.1,18,000 కోట్ల ఐటీ ఎగుమతులను సాధించగా, ఇందులో 90 శాతం పశ్చిమ కారిడార్ పరిధిలోని మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, వీటి పరిసర ప్రాంతాల నుంచే వచ్చాయి.
తెలంగాణ పరిశ్రమల్లో స్థానికులకు ఉపాధి కల్పించేందుకు కొత్త విధానం
రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమల్లో స్థానికులకు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగావకాశాలు కల్పించే కొత్త విధానాన్ని తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించింది. టీఎస్ఐపాస్ ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక రంగం వృద్ధి చెందుతుండటంతో స్థానికులకు ఎక్కువ ఉపాధి అవకాశాలు లభించేలా పరిశ్రమలశాఖ రూపొందించిన ముసాయిదాను కేబినెట్ ఆమోదించింది. ఈ నూతన విధానంలో భాగంగా స్థానిక మానవ వనరులకు ఎక్కువ సంఖ్యలో ఉపాధి కల్పించే పరిశ్రమలకు జీఎస్టీలో రాయితీ, విద్యుత్ చార్జీల్లో ప్రోత్సాహకాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం కొంత మొత్తం ప్రభుత్వం చెల్లిస్తుంది. టీఎస్‌ఐపాస్‌లో భాగంగా టీ ప్రైడ్, టీ ఐడియాలో భాగంగా పరిశ్రమలకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలు రాయితీలు, ప్రోత్సాహకాలిస్తోంది.
పరిశ్రమలకుప్రోత్సాహకాలివే..
-
రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమలకు అవసరమైన స్థానిక మానవ వనరులను ప్రభుత్వ, పారిశ్రామిక, విద్యా సంస్థల సహకారంతో అందించాలనేది ఈ పాలసీ ఉద్దేశం.
-
అయితే మహారాష్ట్రలో 80 శాతం, ఏపీ, కర్ణాటకలో 75 శాతం, మధ్యప్రదేశ్‌లో 70 శాతం మేర స్థానికులకు ఉపాధి కల్పించే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. ఈ విధానంపై విమర్శ లు వస్తున్న నేపథ్యంలో రెండు కేటగిరీల్లో ప్రోత్సాహకాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
-
సెమీ స్కిల్డ్ కేటగిరీలో 70 శాతం, స్కిల్డ్ కేటగిరీలో 60 శాతం స్థానికుల కు ఉపాధి కల్పించే పరిశ్రమలకు రాయితీలు, ప్రోత్సాహకాలిస్తారు. టీ ప్రైడ్, టీ ఐడియాలలో ఇస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాలకు ఇవి అదనం.
ఎలక్ట్రిక్ వాహన పాలసీకి ఆమోదం
వాహన కాలుష్యాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం, తయారీని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ‘తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిక్ వెహికిల్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్ పాలసీ’ని తెలంగాణ మంత్రివర్గం ఆమోదించింది. ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పన్ను మినహాయింపును ప్రకటించింది. రోడ్డుపన్నును పూర్తిగా మినహాయించ డంతోపాటు, మొదటి 2 లక్షల ద్విచక్ర, 20 వేల త్రిచక్ర, 5వేల ఫోర్‌వీలర్ వాహనాలకు రిజిస్ట్రేషన్ చార్జీలు ఉండవని తెలిపింది. మొదటగా కొనుగోలు చేసే 5వేల ఎలక్ట్రిక్ వాహనాలకు 15శాతం ఇన్సెంటివ్(రెట్రో ఫిటమెంట్)గా ఇవ్వాలని నిర్ణయించింది. సరుకు రవాణా చేసే ఎలక్ట్రిక్ వాహనాలపై కూడా రోడ్డు పన్నుకు పూర్తి మినహాయింపునిచ్చింది.
☛ దేశంలోనే తొలి కార్గో ఎక్స్ ప్రెస్ ప్రారంభం
దేశంలోనే తొలి కార్గో ఎక్స్ ప్రెస్ రైలు ఆగస్టు 5న హైదరాబాద్ సనత్ నగర్ రైల్వేస్టేషన్ లో దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించింది. సనత్‌నగర్ నుంచి బయలుదేరిన రైలు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి న్యూఢిల్లీలోని ఆదర్శ్‌నగర్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుంది. ఈ మార్గంలో ప్రయోగాత్మకంగా ఆరునెలలపాటు కార్గో రైలును నడిపించనున్నారు. టైంటేబుల్ ఎక్స్‌ప్రెస్‌గా ఉండే ఈ రైలు వారానికి ఒకసారి నడవనుంది. రోడ్డు రవాణా లేదా రైల్వే పార్శిల్ చార్జీలతో పోల్చితే కార్గో ఎక్స్‌ప్రెస్ ద్వారా40 శాతం తక్కువ ధరకే వేగవంతమైన రవాణా సదుపాయం అందుతుంది. రైల్వే ద్వారా సరుకు రవాణా భద్రతతో కూడుకొన్నదని దక్షిణమధ్య రైల్వే జీఎం గజానన్ మాల్య తెలిపారు.
☛ జమ్మూ కశ్మీర్ ఎల్జీగా మనోజ్ సిన్హా
జమ్మూ కశ్మీర్ నూతన లెఫ్టినెంట్ గవర్నర్‌గా కేంద్ర మాజీ మంత్రి మనోజ్ సిన్హా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన నియామకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కాగా ఇన్నాళ్లుగా జమ్ము కాశ్మీర్ ఎల్జీగా సేవలు అందించిన గిరీష్ చంద్ర ముర్ము ఆగస్టు 5న రాజీనామా చేయటంతో… మనోజ్ సిన్హా నియామకాన్ని ఖరారు చేస్తూ రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది. గతేడాది (ఆగస్టు 5న) ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూకశ్మీర్, లఢక్ కేంద్రపాలిత ప్రాంతాలుగా మారాయి.
ఉత్తరప్రదేశ్‌కి చెందిన మనోజ్ సిన్హా ఐఐటీ వారణాసి నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో పట్టా పుచ్చుకున్నారు. విద్యార్థి దశలోనే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్న ఆయన బెనారస్ హిందూ యూనివర్సిటీ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో బీజేపీలో చేరి ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ నియోజకవర్గం నంచి మూడుసార్లు లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించారు. సమాచార శాఖ స్వతంత్ర మంత్రిగా, రైల్వేశాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేశారు.
☛ నూతన కాగ్ గిరీష్ చంద్ర ముర్ము
భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) గా ప్రస్తుతం జమ్మూ– కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గా పనిచేస్తున్న గిరీష్ చంద్ర ముర్ము నియమితులైనారు. ప్రస్తుతం ఆయన స్థానంలో రాజీవ్ మెహర్షి ఈ వారంలో పదవీ విరమణ చేయనున్నారు. ముర్ము తన లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి ఆగస్టు 5 రాత్రి రాజీనామా చేశారు. ఈయన 1985 బ్యాచ్ గుజరాత్ కేడర్ ఐఏఎస్ అధికారి. కేంద్ర ఆర్థిక శాఖలో వ్యయ విభాగం కార్యదర్శిగా పదవీ విరమణ చేయకముందే జమ్మూ– కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గా నియమితులయ్యారు.
☛ ఈడబ్ల్యూఎస్ కేసులు రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్లకు సంబంధించిన రాజ్యాంగ సవరణ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన కేసులను సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై విచారణ జరుపుతుందని ప్రధాన న్యాయమూర్తి బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఆగస్టు 5న ఉత్తర్వులు జారీ చేసింది.
ఈడబ్ల్యూఎస్ లకు విద్యా, ఉద్యోగాలలో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రాజ్యాంగ సవరణ చట్టాన్ని పార్లమెంటు గతేడాది ఆమోదించింది. దీన్ని సవాలు చేస్తూ జనహిత్ అభియాన్, యూత్ ఫర్ ఈక్వాలిటీతోపాటు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం, జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య తదితరులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ పూర్తిచేసిన ధర్మాసనం ఈ వ్యాజ్యాలను రాజ్యాంగ ధర్మాసనానికి నివేదిస్తున్నట్లు ప్రకటించింది.
☛ ఏపీలో నదుల శుద్ధికి నోడల్ అథారిటీ
మురుగునీటితో కలుషితమైన నదులను శుద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం కృష్ణా, గోదావరి, తుంగభద్ర, కుందూ, నాగావళి నదులను ఎంపిక చేసింది. ఈ నదులను శుద్ధి చేసేందుకు ఒక నోడల్ అథారిటీని ఏర్పాటు చేస్తూ ఆగస్టు 5న అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఐదు నదులను 2021 మార్చి 31 నాటికి 100 శాతం మురుగు శుద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
☛ మందుల నాణ్యత పరిశీలనకు ల్యాబ్ ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రగ్ టెస్టింగ్ లేబొరేటరీలపైన దృష్టి సారించింది. మందుల నాణ్యత పరిశీలనకు వీటిని యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కర్నూలు, విశాఖపట్నంలలో డ్రగ్ టెస్టింగ్ లేబొరేటరీలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కాగా ప్రస్తుతం విజయవాడలో ఉన్న మందుల నాణ్యత పరిశీలించే ల్యాబ్ కు… ఏడాదికి 3 వేల నుంచి 4 వేల లోపు మందుల నాణ్యతను పరిశీలించే సామర్థ్యం ఉంది.
☛ పరిశ్రమల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఐఎస్బీతో ఒప్పందం
కరోనా నేపథ్యంలో తీవ్రంగా దెబ్బతిన్న ఆర్థిక రంగాన్ని తిరిగి గాడిలో పెట్టడంతోపాటు కొత్త పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)తో ఆగస్టు 5న ఒప్పందం కుదుర్చుకుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమక్షంలో ఏపీ ఈడీబీ సీఈవో సుబ్రహ్మణ్యం జవ్వాది, ఐఎస్బీ డీన్ ప్రొఫెసర్ రాజేంద్ర శ్రీవాత్సవ సంతకాలు చేయడం ద్వారా వర్చువల్ ఒప్పందం జరిగింది. ఏపీని అభివృద్ధి పథంవైపు నడిపేందుకు ఐఎస్బీతో కలిసి ‘పబ్లిక్ పాలసీ ల్యాబ్’ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
-
తాజా ఒప్పందంతో పారిశ్రామిక, నైపుణ్య, పెట్టుబడి రంగాలలో సంస్కరణల ద్వారా ఉపాధి అవకాశాలు, ఆర్థిక ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిఆర్.కరికాలవలవన్తెలిపారు.
-
దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకోవడం తమ బాధ్యతను మరింత పెంచిందని ఐఎస్బీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశ్విని ఛాట్రే పేర్కొన్నారు.
☛ ‘వీ హబ్’ సీఈవోగా దీప్తిరెడ్డి పదవీకాలం రెండేళ్లు పొడిగింపు
‘వీ హబ్’ సీఈవోగా దీప్తిరెడ్డి రావుల సర్వీసును మరో రెండేళ్లు పొడిగిస్తూ తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ఆగస్టు 5న ఉత్తర్వులు జారీ చేశారు. 2019 జనవరి ఒకటిన వీ హబ్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన దీప్తి ఈ ఏడాది మార్చి 31వరకు సేవలు అందించారు. మరో మూడేళ్ల పాటు ఒప్పంద కాలాన్ని పొడిగించాల్సిందిగా దీప్తి ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో దీప్తి రెడ్డిని రూ.2 లక్షల నెలసరి వేతనంపై మరో రెండేళ్ల పాటు కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
☛ ఆర్ఐఎల్ కు నంబర్ 2 బ్రాండ్ హోదా
యాపిల్ తరువాత బిలియనీర్ ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) అంతర్జాతీయంగా నంబర్ 2 బ్రాండ్ హోదాను సంపాదించుకుంది. ఫ్యూచర్‌బ్రాండ్ ఇండెక్స్ 2020 ఈ విషయాన్ని తెలిపింది. ఫ్యూచర్‌బ్రాండ్ తన 2020 ఇండెక్స్‌ను విడుదల చేసింది. ఈ ఇండెక్స్‌లో శాంసంగ్ మూడవ స్థానంలో నిలవగా, ఎన్విడియా, మౌటాయ్, నైకీ, మైక్రోసాఫ్ట్, ఏఎస్ఎంఎల్, పేపాల్, నెట్‌ఫ్లిక్స్ తరువాత స్థానాల్లో నిలిచాయి. ఇండెక్స్‌లో కొత్తగా 15 సంస్థలకు చోటు లభించగా ఇందులో ఏఎస్ఎంఎల్ హోల్డింగ్స్, పేపాల్, దనాహెర్, సౌదీ ఆరాంకో, అమెరికన్ టవర్ కార్పొరేషన్లు ఉన్నాయి. కొత్తగా చేరిన 15 సంస్థల్లో ఏడు ఏకంగా టాప్–20లో నిలవడం గమనార్హం. వీటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ 2వ స్థానాన్నే కైవసం చేసుకుంది.
☛ అమ్మోనియం నైట్రేట్ వల్లే లెబనాన్ పేలుళ్లు
లెబనాన్ రాజధాని బీరుట్ నగరంలో ఆగస్టు 4న సంభవించిన శక్తివంతమైన పేలుడులో మృతుల సంఖ్య 135కు చేరిందని, 5,000 మందికి పైగా ప్రజలు గాయపడ్డారని లెబనీస్ రెడ్‌క్రాస్ సంస్థ ప్రతినిధి వెల్లడించారు. 2,700 టన్నులకు పైగా అమ్మోనియం నైట్రేట్‌కు మంటలు అంటుకోవడం వల్లే ఈ పేలుడు సంభవించినట్లు లెబనాన్ మంత్రి మొహమ్మద్ ఫహ్మీ చెప్పారు. బీరుట్ పోర్ట్‌లోని ఓ గోదాములో దీన్ని నిల్వ చేసినట్లు తెలిసింది. 2014లో ఓ సరుకు రవాణా నౌక నుంచి ఈ అమ్మోనియం నైట్రేట్‌ను స్వాధీనం చేసుకున్నారు. పేలుడు జరిగిన వెంటనే ముదురు నారింజ రంగు మేఘం పుట్టుగొడుగు ఆకారంలో ఆకాశంలోకి ఎగిరిపోతున్న దృశ్యం కనిపించింది. విషపూరితమైన నైట్రోజన్ డయాక్సైడ్ గ్యాస్ విడుదలైంది. దీన్ని పీల్చడం వల్ల చాలామంది శ్వాస ఆడక ప్రాణాలొదిలారు. పేలుడు ధాటికి చుట్టుపక్కల ఉన్న భవనాలు ధ్వంసమయ్యాయి.
☛ ఇన్ స్ట్రాగ్రామ్ రీల్స్ ను ప్రారంభించిన ఫేస్ బుక్
సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్బుక్ సంస్థకు చెందిన ఇన్స్టాగ్రామ్ యాప్ ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్ రీల్స్‌ను ప్రారంభించింది. టిక్‌టాక్‌కు పోటీగా ఫేస్బుక్ సరికొత్త రీల్స్ ఫీచర్‌తో ముందుకొచ్చింది. అమెరికాతో సహా 50 దేశాల్లో ఫీచర్ అందుబాటులో ఉంది. ప్రధాన అంతర్జాతీయ మార్కెట్లు భారత్, బ్రెజిల్, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, జపాన్, ఆస్ట్రేలియా, స్పెయిన్, మెక్సికో, అర్జెంటీనాదేశాల్లో రీల్స్‌ను యూజర్లు వినియోగిస్తున్నారు.
ఇందులో యూజర్లు 15 సెకన్ల నిడివిగల వీడియోలను అప్లోడ్ చేయొచ్చు. భారత్‌లో టిక్‌టాక్‌ను ఇప్పటికే బ్యాన్ చేయగా..అమెరికా కూడా నిషేధం విధించాలని భావిస్తుండటంతో యూజర్లను ఆకట్టుకోవడం కోసం షార్ట్ వీడియో షేరింగ్ యాప్ ఇన్స్టాగ్రామ్ రీల్స్‌ను ఫేస్బుక్ తీసుకొచ్చింది.
☛ సెబీ ఛైర్మన్ పదవీకాలం 18 నెలలు పొడిగింపు
మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ చైర్మన్‌గా అజయ్ త్యాగీ పదవీకాలాన్ని మరో 18 నెలలు పొడిగించారు. ఈ మేరకు ఆగస్టు 5న సిబ్బంది నియామకాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రధాని మోదీ నేతృత్వంలోని క్యాబినెట్ కమిటీ ఫిబ్రవరి 2022 వరకు సెబీ చైర్మన్‌గా త్యాగీనే ఉంచాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 1 నుంచి కొత్త పదవీకాలం మొదలు కానున్నది. నిజానికి ఈ ఏడాది మార్చితోనే పదవీకాలం ముగియగా, ఈ నెలాఖరుదాకా పొడిగించారు.