☛ జమ్ము కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు – రాష్ట్ర విభజన
జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక స్వయం ప్రతిపత్తి హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370ను రద్దు చేస్తున్నట్లు రాజ్యసభలో ఆగస్టు 5న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ మేరకు ఆర్టికల్ 370 రద్దు బిల్లును సభలో ప్రవేశపెట్టారు. రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ ద్వారానే ఆర్టికల్ 370 రద్దు అవుతుందని ఆయన ప్రకటించారు. వెనువెంటనే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో జమ్ముకశ్మీర్‌లో భారతరాజ్యాంగం పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చింది. కశ్మీర్‌పై కేంద్రానికి సర్వాధికారాలు లభించాయి.
జమ్ము కశ్మీర్ విభజన
రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం జమ్ము కశ్మీర్ ని.. జమ్ము అండ్ కశ్మీర్ మరియు లదాఖ్ లుగా విభజిస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లుకి రాజ్యసభలో ఆమోదం లభించింది. దీని ప్రకారం అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్ము అండ్ కశ్మీర్.. అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా లదాఖ్ ఉంటాయి.
ఆర్టికల్ 370 లో ఏముంది ??
-
జమ్మూకశ్మీర్ సంస్థానాధీశుడు మహారాజా హరి సింగ్ 1927, 1932లో జారీ చేసిన ఉత్తర్వుల్లో రాష్ట్ర పరిధిలోని అంశాలు, ప్రజల హక్కులను నిర్వచించారు. ఇదే చట్టాన్ని వలస వచ్చిన వారికీ వర్తింపజేశారు.
-
కశ్మీర్ పగ్గాలు చేపట్టిన షేక్ అబ్దుల్లా 1949లో భారత ప్రభుత్వంతో జరిపిన చర్చల ఫలి తంగా రాజ్యాంగంలో ఆర్టికల్ 370 చేరింది. దీంతో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి లభించింది. ఆ రాష్ట్రంపై భారత ప్రభుత్వ అధికారాలు.. రక్షణ, విదేశీ వ్యవహారాలు, సమాచార రంగాలకే పరిమితమయ్యాయి.
-
షేక్ అబ్దుల్లా, నెహ్రూ మధ్య కుదిరిన ఢిల్లీ ఒప్పందం ప్రకారం 1954లో రాష్ట్రపతి ఉత్త ర్వుల మేరకు జమ్మూకశ్మీర్‌కు సంబంధించి 35ఏతోపాటు మరికొన్ని ఆర్టికల్స్‌ను రాజ్యాంగంలో చేర్చారు.
-
అధికరణ 35ఏ ద్వారా జమ్మూకశ్మీర్ శాశ్వత నివాసులను నిర్వచించే అధికారం ఆ రాష్ట్ర శాసన సభకు లభిస్తోంది.
-
1956లో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగం రూపుదిద్దుకుంది. దాని ప్రకారం.. 1911కు పూర్వం అక్కడ జన్మించిన, వలస వచ్చిన వారే కశ్మీర్ పౌరులు. అంతేకాకుండా, 1911కు ముందు పదేళ్లకు తక్కువ కాకుండా అక్కడ ఉంటున్న వారికే స్థిరాస్తులపై హక్కుంటుంది. జమ్మూకశ్మీర్ నుంచి వలసవెళ్లిన వారు, ఇంకా పాకిస్తాన్ వెళ్లిన వారు కూడా రాష్ట్ర పౌరులుగానే పరిగణిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం. ప్రభుత్వం కల్పించే స్కాలర్షిప్లు, ఇతరత్రా సహాల్లాంటి ప్రత్యేక ప్రయోజనాలు పొందవచ్చు. ఇక్కడ దీర్షకాలం నివసిస్తున్న వారికి సర్టిఫికేట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయొచ్చు. రాష్ట్ర స్థిర నివాసులు ఎవరో నిర్వచించడం కోసం చట్టాలు చేసే అధికారాన్ని జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి ఆర్టికల్ 35ఏ కట్టబెట్టింది. అయితే ఈ నిర్వచనాన్ని మూడింట రెండొంతుల మెజారిటీతో రాష్ట్ర అసెంబ్లీ మార్చవచ్చు. ఈ రాష్ట్రానికి చెందిన మహిళ ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే…ఆమెకు జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో స్థిరాస్తులు ఉండడానికి వీల్లేదు. ఆమె పిల్లలకు కూడా ఆ ఆస్తిపై హక్కు ఉండదు. పిల్లలకు శ్వాశత నివాస సర్టిఫికేట్ ఇవ్వరు.
☛ రాష్ట్రపతికి గునియా అత్యున్నత పురస్కారం
భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను గునియా తమ దేశ అత్యున్నత పురస్కారమైన ‘‘నేషనల్ ఆర్టర్ ఆఫ్ మెరిట్’’ను ప్రదానం చేసింది. గునియా రాజధాని కొనాక్రైలో ఆగస్టు 3న జరిగిన కార్యక్రమంలో గునియా అధ్యక్షుడు అల్ఫా కొండే చేతుల మీదుగా రామ్‌నాథ్ కోవింద్ ఈ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. భారత్–గునియా దేశాల మైత్రి బంధానికి, గునియా ప్రజల గౌరవానికి ప్రతీకగా అందజేసిన ఈ అవార్డును భారత ప్రజలకు అంకితం చేస్తున్నానన్నారు.
☛ విశాఖలో ఐ అండ్ సి సెంటర్
విశాఖ జిల్లా ఆనందపురం మండలం గంభీరం గ్రామంలో ఇన్స్పెక్షన్ అండ్ సర్టిఫికేషన్ సెంటర్ (ఐ అండ్ సీ సెంటర్) ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ కేంద్ర ప్రభుత్వానికి ఆగస్టు 4న ప్రతిపాదన పంపింది. రాష్ట్ర విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఈ సెంటరును మంజూరు చేసింది. ఇప్పటికే ఐ అండ్ సీ సెంటరు నిర్మాణాన్ని ఏపీలో చేపట్టేందుకు రూ.16.5 కోట్లు కేటాయించాలని మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ అండ్ హైవేస్ (ఎంఓఆర్టీహెచ్) కేంద్రానికి సిఫారసు చేసింది. దీని నిర్మాణానికి స్థలం చూపిస్తే ఏర్పాటుకు అయ్యే వ్యయం మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరించనుంది. ఐ అండ్ సీ సెంటర్ ఏర్పాటైతే డ్రైవింగ్ పరీక్షలు అన్నీ ఆటోమేషన్ విధానంలోనే జరుగుతాయి.
☛ అధికారికంగా జయశంకర్ జయంతి వేడుకలు
ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతీ ఏటా ఆగస్టు 6న ప్రభుత్వ కార్యాలయాల్లో జయశంకర్ చిత్రపటానికి నివాళులు అర్పించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖలకు ఆగస్టు 3న ఆదేశాలు పంపింది. ప్రభుత్వ పాఠశాలల్లోనూ జయశంకర్ జయంతి వేడుకలు నిర్వహించాలని సూచిస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ టి.విజయ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
☛ థాయ్‌లాండ్ ఓపెన్‌లో భారత్‌కు టైటిల్
థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-500 టోర్నమెంట్లో భారత్‌కు టైటిల్ లభించింది. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఆగస్టు 4న జరిగిన పురుషుల డబుల్స్‌లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్, ముంబై ఆటగాడు చిరాగ్ శెట్టి ఈ టైటిల్ సాధించారు. ఫైనల్లో అన్‌సీడెడ్ సాయిరాజ్–చిరాగ్ (భారత్) జంట 21-19, 18-21, 21-18తో ప్రస్తుత ప్రపంచ చాంపియన్, ప్రపంచ ర్యాంకింగ్‌సలో రెండో స్థానంలో ఉన్న లి జున్ హుయ్–లియు యు చెన్ (చైనా) జోడీపై గెలిచి చాంపియన్‌గా అవతరించింది. దీంతో సూపర్-500 స్థాయి టోర్నీలో డబుల్స్ టైటిల్ గెలిచిన తొలి భారతీయ జోడీగా సాయిరాజ్–చిరాగ్ జంట గుర్తింపు పొందింది.
☛ హామిల్టన్‌కు హంగేరి గ్రాండ్ ప్రి టైటిల్
మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్‌కు హంగేరి గ్రాండ్‌ప్రి టైటిల్ లభించింది. ఆగస్టు 4న జరిగిన హంగేరి గ్రాండ్‌ప్రిలో 70 ల్యాప్‌ల రేసును హామిల్టన్ అందరికంటే ముందుగా గంటా 35 నిమిషాల 3.796 సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు. కెరీర్లో తొలిసారి పోల్ పొజిషన్ సాధించిన రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ చివర్లో ఆధిక్యాన్ని కోల్పోయి రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. తదుపరి బెల్జియం గ్రాండ్‌ప్రి సెప్టెంబర్ 1న జరగనుంది.
☛ పొలాండ్ ఓపెన్‌లో వినేశ్‌కు స్వర్ణం
పొలాండ్ ఓపెన్ రెజ్లింగ్ టోర్నమెంట్లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు స్వర్ణం పతకం లభించింది. పొలాండ్ రాజధాని వార్సాలో ఆగస్టు 4న జరిగిన మహిళల 53 కేజీల విభాగం ఫైనల్ బౌట్లో 24 ఏళ్ల వినేశ్ 3-2తో పొలాండ్‌కు చెందిన రొక్సానాపై విజయం సాధించింది. జూలై నెలలో జరిగిన స్పెయిన్ గ్రాండ్‌ప్రితో పాటు టర్కీలో జరిగిన యాసర్ డొగు ఇంటర్నేషనల్ టోర్నీలో వినేశ్ బంగారు పతకాలు నెగ్గిన విషయం తెలిసిందే.