Current Affairs – Telugu – August 6, 2019

దేశంలో అతిపెద్ద యూటీగా జమ్మూ కశ్మీర్

ఆర్టికల్ 370 రద్దుతో రాష్ట్రాల విభజన తర్వాత దేశంలో వైశాల్యపరంగా అతి పెద్ద కేంద్ర పాలిత ప్రాంతం (యూటీ)గా జమ్మూకశ్మీర్ అవతరించనుంది. జమ్మూకశ్మీర్ తర్వాత లదాఖ్ రెండో స్థానంలో ఉండనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జమ్మూ కశ్మీర్ పునర్విభజన బిల్లు-2019 ప్రకారం జమ్ముకశ్మీర్‌ను అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా, లదాఖ్ ప్రాంతాన్ని అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేస్తారు. దీంతో దేశంలో యూటీల సంఖ్య తొమ్మిదికి పెరగనుంది. అదే సమయంలో రాష్ట్రాల సంఖ్య 28కి తగ్గనుంది.

పోలవరం నిర్వాసితులకు ప్రత్యేక అధికారి

పోలవరం ప్రాజెక్టు కారణంగా నిర్వాసితులైన కుటుంబాలకు పునరావాసం కల్పించేందుకు ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. శ్రీపొట్టిశ్రీరాములునెల్లూరు జిల్లా గూడూరు సబ్ కలెక్టర్, 2016 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆనంద్‌ను పునరావాస కల్పన ప్రత్యేకాధికారిగా బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్వి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆగస్టు 5న ఉత్తర్వులు జారీచేశారు.

ఏపీ కార్మికశాఖ కమిషనర్‌గా ఉదయలక్ష్మీ
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీలశాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్న బి.ఉదయలక్ష్మికి.. కార్మికశాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

టెస్టు క్రికెట్‌కు డేల్ స్టెయిన్ వీడ్కోలు

ఆధునిక క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన పేసర్లలో ఒకడైన డేల్ స్టెయిన్ టెస్టు ఫార్మాట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. వరుస గాయాలతో ఇబ్బందిపడుతున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆగస్టు 5న ప్రకటించాడు. ఇక వన్డే, టీ20ల్లో మరింత ఎక్కువ కాలం కొనసాగేందుకు ప్రయత్నిస్తానన్నాడు. 2004లో ఇంగ్లండ్‌పై అరంగేట్రం చేసిన ఈ దక్షిణాఫ్రికా పేసర్ 2019, ఫిబ్రవరిలో శ్రీలంకపై చివరి టెస్టు ఆడాడు. అంతేకాకుండా ఈ ఫార్మాట్‌లో ప్రొటీస్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గానూ నిలిచాడు. 93 టెస్టుల్లో 439 వికెట్లు తీసిన స్టెయిన్ 1251 పరుగులు సాధించాడు.

ఏపీ గిరిజన విశ్వవిద్యాలయానికి చట్టబద్ధత

ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీ, గిరిజన విశ్వవిద్యాలయానికి చట్టబద్ధత లభించింది. ఈ మేరకు ఆగస్టు 5న కేంద్ర మానవ వనరుల శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఆంధ్రప్రదేశ్‌లో ఈ రెండు వర్సిటీల ఏర్పాటుకు ఉభయ సభలు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో ఈ రెండు విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశారు. అనంతపురం జిల్లాలో కేంద్ర విశ్వవిద్యాలయం, విజయనగరం జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం తాత్కాలిక భవనాల్లో తరగతులను నిర్వహిస్తున్నారు.

సరోగసీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

కమర్షియల్ సరోగసీ విధానాన్ని నిషేధించేందుకు రూపొందించిన ‘సరోగసీ (రెగ్యులేషన్) బిల్లు-2019’కి లోక్‌సభ ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటు ద్వారా ఆగస్టు 5న బిల్లు పాసైంది. కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో చట్టబద్ధమైన సరోగసీ బోర్డులు ఏర్పాటు చేసేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. ఈ బిల్లు ప్రకారంచట్టబద్ధంగా వివాహం జరిగి ఐదేళ్లు నిండిన భారతీయ దంపతులు మాత్రమే సరోగసీ ద్వారా పిల్లలను పొందేందుకు అర్హులు. సరోగసీ ద్వారా పిల్లలను పొందాలనుకునే దంపతులు తమ సమీప బంధువులు ద్వారా మాత్రమే పిల్లలను కనాలి. నిస్వార్థ సేవల ద్వారా బంధువుల సాయం తీసుకోవాలి. సరోగసీ ద్వారా పుట్టిన బిడ్డను.. సదరు బిడ్డ తల్లిదండ్రులు ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోకూడదు.

హెచ్‌ఎస్‌బీసీ తాత్కాలిక సీఈవోగా నోయెల్

ప్రపంచంలో ఏడో అతిపెద్ద బ్యాంకు, ఆర్థిక సేవల కంపెనీ హెచ్‌ఎస్‌బీసీ హోల్డింగ్‌‌స తాత్కాలిక సీఈవోగా నోయెల్ క్విన్ నియమితులయ్యారు. ప్రస్తుత సీఈవో జాన్ ఫ్లింట్ తన పదవి నుంచి వైదొలగడంతో ఈ నియామకం చేపట్టినట్లు హెచ్‌ఎస్‌బీసీ ఆగస్టు 5న తెలిపింది. సొంత దేశంతోపాటు ఆసియాలో ఇప్పుడున్న అనిశ్చిత పరిస్థితుల్లో నూతన నాయకత్వం అవసరమని పేర్కొంది. ప్రస్తుతం గ్లోబల్ కమర్షియల్ బ్యాంకింగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా నోయెల్ ఉన్నారు.

ట్రాన్స్ జెండర్స్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

ట్రాన్స్ జెండర్స్‌కు ఆర్థిక, సామాజిక, విద్య విషయంలో సాధికారత కల్పించేందుకు ఉద్దేశించిన ‘ట్రాన్స్ జెండర్ పర్సన్స్ (హక్కుల రక్షణ) బిల్లు– 2019’ను లోక్‌సభ ఆగస్టు 5న మూజువాణి ఓటుతో ఆమోదించింది. దేశంలో ఉన్న 4.80 లక్షల మంది ట్రాన్స్ జెండర్ల హక్కులు కాపాడటానికి జాతీయ అథారిటీని ఏర్పాటు చేయడానికి ఈ బిల్లు ఉపకరిస్తుంది. మరోవైపు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 31(30+1) నుంచి 34(33+1)కు పెంచేందుకు సంబంధించిన బిల్లును కూడా లోక్‌సభ ఆమోదించింది.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments