Current Affairs – Telugu – August 3, 2019

చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టి చైనా వ్యోమనౌక

చైనాకు చెందిన లాంగ్‌జియాంగ్-2 వ్యోమనౌక తన ప్రస్థానాన్ని ముగించుకొని ఆగస్టు 2న చంద్రుడి ఉపరితలాన్ని ఢీ కొట్టి, అంతమైంది. నిర్దేశించిన రీతిలో చంద్రుని అవతి భాగాన్ని వ్యోమనౌక తాకిందని చైనా అంతరిక్ష సంస్థ వివరించింది. 47 కిలోల బరువున్న లాంగ్‌జియాంగ్-2ను 2018, మే 21న ప్రయోగించారు. ఇది 437 రోజుల పాటు చంద్రుడి చుట్టూ పరిభ్రమించింది. ఈ వ్యోమనౌకలో సౌదీ అరేబియా అభివృద్ధి చేసిన ఒక ఆప్టికల్ కెమెరాను కూడా ఉంది.

అయోధ్య మధ్యవర్తిత్వం విఫలం

అయోధ్యలోని రామజన్మభూమిబాబ్రీ మసీదు భూ వివాదా కేసులో సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎఫ్‌ఎంఐ ఖలీఫుల్లా నేతృత్వంలోని త్రిసభ్య మధ్యవర్తిత్వ కమిటీ విఫలమైంది. ఈ మేరకు ఆగస్టు 2న సుప్రీంకోర్టుకు కమిటీ తన నివేదికను సమర్పించింది. క్లిష్టమైన అయోధ్య సమస్యకు హిందూ, ముస్లిం వర్గాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించడం లేదని నివేదికలో కమిటీ పేర్కొంది.

ఐఎన్‌ఎఫ్‌ను రద్దు చేసుకున్న అమెరికా, రష్యా

ప్రచ్ఛన్న యుద్ధకాలంలో కుదిరిన అణు క్షిపణుల నిరోధక ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు అమెరికారష్యా ఆగస్టు 2న ప్రకటించాయి. భూమి నుంచి ప్రయోగించే స్వల్ప, మధ్యంతర శ్రేణి అణ్వస్త్ర, ఇతర క్షిపణుల ప్రయోగాలను నిషేధిస్తూ అమెరికారష్యాల మధ్య 1987లో ఐఎన్‌ఎఫ్ (ఇంటర్మీడియెట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్) ఒప్పందం కుదిరింది. ఆయుధ పోటీని తగ్గించే లక్ష్యంతో ఇరు దేశాలు ఈ ఒప్పందాన్ని చేసుకున్నాయి.

హైదరాబాద్ వర్సిటీకి ఎమినెన్స్ హోదా

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సహా దేశంలోని ఐదు వర్సిటీలకు ఎమినెన్స్ హోదా ప్రకటించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) సిఫారసు చేసింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీతోపాటు ఢిల్లీ వర్సిటీ, బీహెచ్‌యూ, ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఖరగ్‌పూర్ ఈ జాబితాలో ఉన్నాయి. ఈ మేరకు ఆగస్టు 2న యూజీసీ ఎంపవర్డ్ ఎక్స్‌పర్ట్ కమిటీ(ఈఈసీ) నిర్ణయం తీసుకుంది.

ఎమినెన్స్ హోదా పొందాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు 50 శాతం నిధులను వెచ్చించేందుకు అంగీకారం తెలపాల్సి ఉంటుంది. అదే ప్రైవేట్ సంస్థలకై తే ప్రభుత్వాల నుంచి నిధులు అందనప్పటికీ స్పెషల్ కేటగిరీ డీమ్డ్ యూనివర్సిటీగా మరింత అటానమీ లభిస్తుంది.

వేతన కోడ్‌కు రాజ్యసభ ఆమోదం

దేశ వ్యాప్తంగా వివిధ సంస్థల్లో పనిచేసే ప్రతి కార్మికుడికీ కనీస వేతనం అందించేందుకు వీలు కల్పించే వేతనాల కోడ్ -2019 బిల్లును రాజ్యసభ ఆగస్టు 2న ఆమోదించింది. సభలో ఈ బిల్లుకు అనుకూలంగా 85 మంది, వ్యతిరేకంగా 8 మంది ఓటేశారు. వేతనాలు, బోనస్‌లకు సంబంధించిన వివిధ నిబంధనలు, సమస్యలకు పరిష్కారం చూపుతూ ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించింది.ఈ బిల్లు చట్ట రూపం దాల్చితే దేశ వ్యాప్తంగా ఉన్న 50 కోట్ల మంది కార్మికులకు లాభం కలుగుతుందని కార్మిక మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ సభలో తెలిపారు.

కనీస వేతనాల చట్టం, వేతన చెల్లింపు చట్టం, బోనస్ చెల్లింపు చట్టం, సమాన ప్రతిఫలం చట్టం స్థానంలో వేతనాల కోడ్ -2019అమల్లోకి రానుంది.

పాత్రికేయుడు రవీశ్‌కు మెగసెసె అవార్డు

ప్రముఖ పాత్రికేయుడు, ఎన్డీటీవీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రవీశ్ కుమార్‌ను ఆసియా నోబెల్‌గా అభివర్ణించే ప్రఖ్యాత రామన్ మెగసెసె పురస్కారం-2019 వరించింది. ఈ మేరకు రామన్ మెగసెసె ఫౌండేషన్ ఆగస్టు 2న ప్రకటించింది. నిస్సహాయుల గొంతుకగా నిలిచినందుకుగాను ఆయనను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు ఫౌండేషన్ పేర్కొంది. ఎన్డీటీవీ హిందీ భాష ఛానల్‌లో ప్రసారమయ్యే ప్రైమ్ టైమ్ కార్యక్రమం ద్వారా అంతగా వెలుగులోకి రాని సామాన్యుల సమస్యలను దేశానికి చూపించే ప్రయత్నం చేశారంది.

రవీష్‌తోపాటు మరో నలుగురు ఆసియా నుంచి మెగసెసె-2019 పురస్కారానికి ఎంపికయ్యారు. వారిలో కో స్వీ విన్(మయన్మార్), అంగ్‌ఖానా నిలపైజిత్(థాయిలాండ్), రేముండో పుజాంతే కాయాబ్యాబ్(ఫిలిప్పీన్స్), కిమ్ జాంగ్ కి(దక్షిణ కొరియా) ఉన్నారు. వీరందరికీ ఆగస్టు 31వ తేదీన ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు.

రామన్ మెగసెసె అవార్డు అంటే ఏంటి ??
ఆసియా నోబెల్‌గా పరిగణించే రామన్ మెగసెసె అవార్డును 1957లో ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రామన్ మెగసెసె జ్ఞాపకార్థం ఏర్పాటు చేశారు. ఆసియా అత్యున్నత పురస్కారంగా పిలిచే ఈ అవార్డును వ్యక్తులు లేదా సంస్థలకు రామన్ మెగసెసే ఫౌండేషన్ ఏటా అందిస్తోంది. గతంలో భారత్ నుంచి ఆర్‌కే లక్ష్మణ్, పి.సాయినాథ్, అరుణ్ శౌరి, కిరణ్ బేడీ, అర్వింద్ కేజ్రీవాల్ ఈ అవార్డును అందుకున్నారు.

జలియన్ వాలాబాగ్ బిల్లుకు ఆమోదం

జలియన్ వాలాబాగ్ నేషనల్ మెమోరియల్ చట్టం-1951 (సవరణ)బిల్లుకు లోక్‌సభ ఆగస్టు 2న మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం జలియన్ వాలాబాగ్ నేషనల్ మెమోరియల్ కమిటీలో కాంగ్రెస్ అధ్యక్షుడు ట్రస్టీగా ఉండేందుకు ఇకపై వీలుండదు. ప్రస్తుతం జలియన్ వాలాబాగ్ నేషనల్ మెమోరియల్ కమిటీలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు, పంజాబ్ ముఖ్యమంత్రి, పంజాబ్ గవర్నర్ సభ్యలుగా ఉన్నారు.

చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టానికి ఆమోదం

చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (సవరణ)-2019 బిల్లు(ఉపా)కు రాజ్యసభ ఆగస్టు 2న ఆమోదం తెలిపింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల(నిరోధక) చట్టం-1967 సవరిస్తూ ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు అనుకూలంగా 147 ఓట్లు, వ్యతిరేకంగా 42 ఓట్లు పడ్డాయి. ఈ బిల్లు చట్ట రూపం దాలిస్తే ఉగ్ర చర్యలతో సంబంధమున్న ఏ వ్యక్తిని అయినా సరే ఉగ్రవాదిగా ప్రకటించడంతోపాటు, అతని ఆస్తులను స్వాధీనం చేసుకునే అధికారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది.

ప్రభుత్వ రంగ బ్యాంకులపై జరిమానా

కరెంట్ అకౌంట్ ప్రారంభం విషయంలో నిబంధనలను ఉల్లంఘించిన ఏడు ప్రభుత్వ రంగ బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రూ.11 కోట్ల జరిమానా విధించింది.

వీటిలో అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (రూ. 2 కోట్ల చొప్పున), బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్, యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (రూ.1.5 కోట్ల చొప్పున) ఉన్నాయి. ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌పై రూ. కోటి జరిమానా విధించడం జరిగింది.

సావరిన్ గోల్డ్ బాండ్ ధర స్థిరీకరణ

సావరిన్ గోల్డ్ బాండ్స్ 2019-2020 (సిరీస్ 3) జారీ ధరను కేంద్రం గ్రాముకు రూ.3,499గా స్థిరీకరించింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వశాఖ ఆగస్టు 2న ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ప్రకారం బాండ్లకు చందా చెల్లింపు ఆగస్టు 5వ తేదీన ప్రారంభమై ఆగస్టు 9వ తేదీన ముగుస్తుంది. సెటిల్‌మెంట్ తేదీ ఆగస్టు 14 అని ఆర్థిక శాఖ తెలిపింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి, డిజిటల్ పద్దతిలో చెల్లింపులు జరిపే వారికి గ్రాముకు రూ.50 వరకూ డిస్కౌంట్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో బంగారానికి (ఫిజికల్‌గా) డిమాండ్‌ను తగ్గించడం లక్ష్యంగా 2015 నవంబర్‌లో కేంద్రప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌ను ప్రారంభించింది.

2018 జీడీపీ ర్యాంకులు విడుదల

ప్రపంచ బ్యాంకు 2018 జీడీపీ ర్యాంకుల జాబితాను ఆగస్టు 2న విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం జీడీపీ పరంగా 20.5 ట్రిలియన్ డాలర్ల పరిమాణంతో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. 2.72 ట్రిలియన్ డాలర్ల పరిమాణంతో భారత్ ఏడో ర్యాంకును పొందింది.

13.5 ట్రిలియన్ డాలర్లతో చైనా రెండో స్థానంలో, 4.9 ట్రిలియన్ డాలర్లతో జపాన్ 3వ స్థానంలో నిలిచాయి. భారత్ తర్వాత 8, 9, 10వ స్థానాల్లో ఇటలీ, బ్రెజిల్, కెనడా ఉన్నాయి.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments