Current Affairs – Telugu – August 2, 2019

పేపర్ లెస్ గా మారనున్న లోక్‌సభ

లోక్‌సభ తదుపరి సమావేశాలన్నీ కాగితరహితంగానే జరుగుతాయని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా జూలై 31న తెలిపారు. దీని వల్ల కోట్ల రూపాయలు మిగులుతాయన్నారు. అవసరం అనుకున్న వారికి విడిగా పేపర్లు అందించే ఏర్పాటు చేస్తామని చెప్పారు.

సభ్యులు మాట్లాడే సమయంలో వారి పేర్లు, డివిజన్ నంబర్ కనిపించేలా కొత్తగా స్క్రీన్ ఏర్పాటు చేశారు.

పోక్సో సవరణ బిల్లుకి పార్లమెంట్ ఆమోదం

లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ (పోక్సో) (సవరణ) బిల్లు-2019’ని పార్లమెంటు ఆగస్టు 1న ఆమోదించింది. ఈ బిల్లును రాజ్యసభ జూలై 29నే ఆమోదించగా, లోక్‌సభలో బిల్లు ఆగస్టు 1ఆమోదం పొందింది. కొత్త సవరణల ప్రకారం…. చిన్నారులపై లైంగిక దాడులకు సంబంధించి అత్యంత అరుదైన కేసుల్లో దోషులకు మరణ శిక్ష విధించవచ్చు.

  • చిన్నారులతో నీలి చిత్రాలు’ (చైల్డ్ పోర్నోగ్రఫీ)కి ఈ బిల్లులో నిర్వచనం కూడా చేర్చి, మరిన్ని ఎక్కువ దుశ్చర్యలను నేరం కిందకు వచ్చేలా చేశారు.

  • చిన్నారులపై అత్యాచారాలతోపాటు మైనర్లపై లైంగికదాడులకు పాల్పడే వారినీ కఠినంగా శిక్షించవచ్చు.

  • పోక్సో చట్టంలోని 2,4,5,6,9,14,15,34,42,45 సెక్షన్లను సవరించారు.

బ్యాంక్ ఆఫ్ చైనాకు ఆర్‌బీఐ అనుమతి

దేశంలో మామూలు బ్యాంకింగ్ సేవలు ప్రారంభించడానికి బ్యాంక్ ఆఫ్ చైనాకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అనుమతి ఇచ్చింది. ఈ అనుమతితో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ తరహాలోనే దేశంలో బ్యాంకింగ్ సేవలు అందించడానికి బ్యాంక్ ఆఫ్ చైనాకు వీలు కలుగుతుంది.

ఆర్‌బీఐ నిబంధనలకు కట్టుబడి పనిచేసే బ్యాంకుల జాబితా ఆర్‌బీఐ యాక్ట్, 1934 రెండవ షెడ్యూల్‌లో ఉంటుంది. ఈ రెండవ షెడ్యూల్‌లో ‘బ్యాంక్ ఆఫ్ చైనా లిమిటెడ్’ పేరును కూడా చేర్చడం జరిగిందని సెంట్రల్ బ్యాంక్ ఆగస్టు 1న ప్రకటించింది.

జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్‌ను కూడా రెండవ షెడ్యూల్‌లో చేర్చినట్లు ఆర్బీఐ తెలింది.

ఢిల్లీలో కరెంట్ ఫ్రీ పథకం

ఢిల్లీలో నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగం ఉన్న ప్రజలు ఇకపై కరెంట్ బిల్లు చెల్లించాల్సిన పనిలేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆగస్టు 1న ప్రకటించారు. 201 నుంచి 400 యూనిట్ల వినియోగం ఉన్న వాళ్లు సగం విద్యుత్ బిల్లు చెల్లిస్తే సరిపోతుందని తెలిపారు. విద్యుత్ సబ్సిడీల కోసం ఢిల్లీ సర్కారు ఏటా రూ.2వేల కోట్లు భరించనుంది. 2020 ఏడాదిలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

యూపీ నుంచి ఢిల్లీకి ఉన్నావ్ కేసు బదిలీ

ఉన్నావ్ అత్యాచార ఘటనకు సంబంధించి నమోదైన మొత్తం ఐదు కేసులనూ ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీకి బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ఆగస్టు 1న ఆదేశించింది. అలాగే బాధితురాలికి తక్షణమే రూ. 25 లక్షల తాత్కాలిక పరిహారం అందజేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని నిర్దేశించింది. జూలై 28న ఉన్నావ్ అత్యాచార బాధితురాలి కారును ట్రక్కు ఢీకొట్టిన ఘటనపై దర్యాప్తును వారం రోజుల్లోనే పూర్తి చేయాలని కూడా సీబీఐకి సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అలాగే ఉన్నావ్ అత్యాచర ఘటన ప్రధాన కేసు విచారణను ప్రారంభించిన నాటి నుంచి 45 రోజుల్లోపే పూర్తి చేయాలని కూడా సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ప్రభుత్వ ప్రాజెక్టుగా ముంబైపుణే హైపర్‌లూప్

ముంబైపుణె మధ్య నిర్మించనున్న హైపర్‌లూప్‌ను ప్రభుత్వ మౌలిక వసతి ప్రాజెక్టుగా ప్రకటించే ప్రతిపాదనకు మహారాష్ట్ర మంత్రివర్గం ఆగస్టు 1న ఆమోదం తెలిపింది. దీంతో ఈ ప్రాజెక్టుకు అనుమతులు సత్వరంగాలభించనున్నాయి. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ నుంచి పుణెలోకి వాకాడ్ వరకు నిర్మించే ఈ హైపర్‌లూప్ అందుబాటులోకి వస్తే, ముంబైపుణె మధ్య 117.5 కి.మీ. దూరాన్ని కేవలం 23 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. రూ.70 వేల కోట్ల వ్యయంతో, రెండు దశల్లో ఈ ప్రాజెక్టును పుణె మహానగరాభివృద్ధి సంస్థ చేపడుతోంది. తొలి దశలో పుణె మహానగర పరిధిలోనే 11.8 కిలోమీటర్లపాటు హైపర్‌లూప్‌ను రూ. 5 వేల కోట్ల వ్యయంతో నిర్మించి, ప్రయోగాత్మకంగా పరీక్షిస్తారు. అంతా సవ్యంగా ఉంటే రెండో దశలో మిగతా దూరం మొత్తం హైపర్‌లూప్‌ను నిర్మిస్తారు.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments