Current Affairs – Telugu – August 11 – 14 – 2019

మోదీ సాహసయాత్ర డిస్కవరీలో ప్రసారం

ప్రముఖ సాహస యాత్రికుడు బేర్ గ్రిల్స్, ప్రధాని నరేంద్ర మోదీ కలిసి ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్పెట్ జాతీయ పార్కులో చేపట్టిన సాహసయాత్ర ఆగస్టు 12న డిస్కవరీ గ్రూప్ ఛానళ్లలో ప్రపంచవ్యాప్తంగా 180కిపైగా దేశాల్లో ప్రసారమైంది. ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ కార్యక్రమంలో భాగంగా ఈ సాహస యాత్రను చిత్రీకరించారు. ఈ యాత్ర లో బెంగాల్ పులులు, మొసళ్లు, విషసర్పాల మధ్య ఎలా మనుగడ సాగించాలో గ్రిల్స్ మోదీకి వివరించారు. పులుల అడుగుజాడల్ని చూసుకుంటూ వీరిద్దరూ హిమాలయాల్లోని ఓ నదిని తెప్పపై దాటారు.

ఇన్‌క్రెడిబుల్ ఇండియాకు వైల్డ్ లైఫ్ థీమ్

అంతర్జాతీయంగా పర్యాటకాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో భారత ప్రభు త్వం చేపట్టిన ‘ఇన్‌క్రెడిబుల్ ఇండియా ’ కార్యక్రమానికి ‘వైల్డ్ లైఫ్’ను ఇతివృత్తంగా ఎంచుకోనున్నట్లు కేంద్ర పర్యాటక మంత్రి ప్లహాద్ పటేల్ ఆగస్టు 11న వెల్లడించారు. డిస్కవరీ చానల్‌లో ప్రసారమయ్యే ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ కార్యక్రమంలో ఇటీవల ప్రధాని మోదీ పాల్గొన్న విషయం తెలిసిందే.

మాంట్రియాల్ మాస్టర్ టైటిల్ విజేత నాదల్

స్పెయిన్ టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్‌కు మాంట్రియల్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్-1000 టైటిల్ లభించింది. కెనడాలోని టొరంటోలో ఆగస్టు 12న జరిగిన పురుషుల విభాగం ఫైనల్లో నాదల్ 6-3, 6-0తో మెద్వెదేవ్ (రష్యా)పై గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. దీంతో నాదల్ కెరీర్‌లో 35వ మాస్టర్స్ సిరీస్ టైటిల్‌ను సాధించినట్లయింది. విజేత నాదల్‌కు 10,49,040 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 7 కోట్ల 48 లక్షలు) లభించింది.

ఢిల్లీలాహోర్ బస్ సర్వీసు రద్దు : భారత్

ఢిల్లీలాహోర్ బస్ సర్వీసును రద్దు చేస్తున్నట్లు ఆగస్టు 12న భారత్ ప్రకటించింది. జమ్మూ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు అనంతరం లాహోర్ఢిల్లీ బస్ సర్వీసులను పాకిస్తాన్ రద్దు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ తెలిపింది.

ఇప్పటికే భారత్పాక్‌ల మధ్య నడిచే సంఝౌతా ఎక్స్‌ప్రెస్, థార్ ఎక్స్‌ప్రెస్‌లను పాకిస్తాన్ రద్దు చేసింది. 1999 ఫిబ్రవరిలో ఢిల్లీలాహోర్ బస్ సర్వీసు ప్రారంభమైంది. అయితే 2001లో భారత పార్లమెంటు భవనంపై దాడి జరిగిన తర్వాత బస్సు సర్వీసులను నిలిపివేశారు. అనంతరం 2003 జూలైలో బస్సు సర్వీసు పునఃప్రారంభమైంది.

చైనాలో భారత విదేశాంగ మంత్రి జై శంకర్ పర్యటన

చైనా రాజధాని బీజింగ్‌లో ఆగస్టు 12న జరిగిన భారత్చైనా అత్యున్నత కమిటీ(సాంస్కృతిక, ప్రజా సంబంధాలు) సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైనా ఉపాధ్యక్షుడు వాంగ్ క్విషన్, విదేశాంగ మంత్రి వాంగ్ యీతో జై శంకర్ భేటీ అయ్యారు. ఈ భేటీలో జై శంకర్ మాట్లాడుతూభారత్, చైనా మధ్య ఉండే భిన్నాభిప్రాయాలు ఘర్షణగా మారకూడదని తెలిపారు. ఓ దేశపు సమస్యలపై మరో దేశం ఎలా స్పందిస్తుందన్న విషయంపైనే భవిష్యత్తులో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు ఆధారపడి ఉంటాయని స్పష్టం చేశారు.

ఫిజీ సుప్రీంకోర్టు జడ్జీగా జస్టిస్ లోకూర్

ఫిజీ దేశ సుప్రీంకోర్టులో నాన్‌రెసిడెంట్ ప్యానల్ జడ్జిగా భారత సుప్రీంకోర్టు జడ్జిగా సేవలందించిన జస్టిస్(విశ్రాంత) మదన్ బి.లోకూర్ ఆగస్టు 12న ప్రమాణస్వీకారం చేశారు. లోకూర్‌తో ఫిజీ అధ్యక్షుడు జియోజీ కొన్‌రోటే ప్రమాణస్వీకారం చేయించారు. ఫిజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా లోకూర్ మూడేళ్లపాటు కొనసాగనున్నారు. ఒక భారత జడ్జి మరోదేశ సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి. గతంలో తెలుగురాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగానూ ఆయన పనిచేశారు.

గ్వాటెమాలా నూతన అధ్యక్షుడిగా అలెజాండ్రో

గ్వాటెమాలా నూతన అధ్యక్షుడిగా కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి అలెజాండ్రో గియామాట్టి ఎన్నికయ్యారు. గ్వాటెమాలాలో జరిగిన తాజా అధ్యక్ష ఎన్నికల్లో అలెజాండ్రో 90 శాతం ఓట్ల ఆధిక్యతతో ప్రత్యర్థి సాండ్రా టోరెస్(మాజీ అధ్యక్షుడు అల్వారో కొలొం సతీమణి)పై విజయం సాధించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రస్తుత అధ్యక్షుడు జిమ్మీ మొరేల్స్ జనవరిలో పదవీ విరమణ చేసిన తరువాత ఆయన స్థానంలో అలెజాండ్రో బాధ్యతలు స్వీకరించనున్నారు.

జాతీయ యువజన అవార్డులు ప్రధానం

2016-17కు ప్రకటించిన జాతీయ యువజన అవార్డులను ఆగస్టు 12న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి కిరెణ్ రిజిజు ప్రధానం చేశారు. తెలంగాణ నుంచి ఒద్దిరాజు వంశీకృష్ణ, ఆంధ్రప్రదేశ్ నుంచి గట్టెం వెంకటేష్, పృథ్వీ గొల్ల ఈ అవార్డులు అందుకున్నవారిలో ఉన్నారు. అవార్డు అందుకున్నవారికి రూ.50 వేల నగదు, పతకం, సర్టిఫికెట్ అందజేశారు. దేశవ్యాప్తంగా 20 మంది యువజన అవార్డులకు ఎంపికయ్యారు. వివిధ రంగాల అభివృద్ధి, సామాజిక సేవారంగంలో కృషికి గుర్తింపుగా కేంద్ర యువజన సర్వీసుల శాఖ ఈ యువజన అవార్డులను ఇస్తుంది.

ఏపీ ప్రాజెక్టులకు అడ్డుచెప్పిన జాతీయ హరిత ట్రిబ్యునల్

గోదావరిపెన్నా, పురుషోత్తపట్నం, పట్టిసీమ, చింతలపూడి ప్రాజెక్టులను ఆపేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆగస్టు 13న ఆదేశించింది. పర్యావరణ అనుమతులు పొందిన తర్వాతనే ఆయా ప్రాజెక్టులను తిరిగి కొనసాగించాలని స్పష్టం చేసింది. గోదావరి, పెన్నా నదులపై ఎక్కువగా ఎత్తిపోతల పథకాలు చేపడుతున్నారని, దీనివల్ల పర్యావరణం దెబ్బతింటోందని మాజీ మంత్రి వట్టి వసంతకుమార్, త్రినాథ్‌రెడ్డి ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు.

బాంబే జయశ్రీకి మంగళంపల్లి పురస్కారం

ఫ్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు బాంబే జయశ్రీకి 2019 సంవత్సరానికిగాను పద్మ విభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రదానం చేసింది. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా సాంస్కృతిక, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఆగస్టు 10న ఆమెను ఘనంగా సన్మానించి ప్రశంసాపత్రం, రూ.పది లక్షలు, జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర యువజనాభ్యుదయ, పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు(అవంతి శ్రీనివాస్) మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సాంస్కృతిక శాఖకు రూ.72 కోట్ల బడ్జెట్‌ను ఇచ్చి ఈ శాఖకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారన్నారు.

బయోడీజిల్ పథకాన్ని ప్రారంభించిన ధర్మేంద్ర ప్రదాన్

వాడేసిన వంటనూనె నుంచి ఉత్పత్తి చేసిన బయోడీజిల్‌ను కొనుగోలు చేసే బయోడీజిల్ కొనుగోలు పథకాన్ని ప్రభుత్వరంగ ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ ప్రారంభించాయి. ప్రపంచ బయోడీజిల్ దినోత్సవ సందర్భంగా పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఆగస్టు 10న అధికారికంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ బయోడీజిల్ పథకం కింద… 100 పట్టణాల్లో వినియోగించిన మిగిలిన వంట నూనె నుంచి బయోడీజిల్ ఉత్పత్తి చేసే ప్లాంట్ల ఏర్పాటుకు ఆసక్తి కలిగిన వారి నుంచి దరఖాస్తులను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఆహ్వానించనున్నాయి.

సంగారెడ్డి కలెక్టర్‌కి పోషణ్ అభియాన్ అవార్డు

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.హనుమంతరావుకు ‘పోషణ్ అభియాన్ 2018-19’ అవార్డు లభించింది. దేశరాజధాని న్యూఢిల్లీలో ఆగస్టు 23న జరగనున్న కార్యక్రమంలో ఆయనకు ఈ అవార్డు ప్రదానం చేయనున్నారు. పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని సంగారెడ్డిలో పక్కాగా అమలు చేసి విజయవంతమైందుకుగాను హనుమంతరావుకు ఈ పురస్కారం దక్కింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పోషణ్ అభియాన్’కార్యక్రమంలో భాగంగా మాతా శిశు సంరక్షణ, గర్భిణుల ఆరోగ్యం, పిల్లల్లో పౌష్టికారం పెంపుదల విషయంపై జిల్లా ప్రజలకు అవగాహన కల్పించడం, ఆచరించడంలో సంగారెడ్డి జిల్లా తెలంగాణలో తొలి స్థానంలో నిలిచింది.

సిద్దిపేట కలెక్టర్‌కు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అవార్డు

తెలంగాణాలోని సిద్దిపేట జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామిరెడ్డికు జాతీయ స్థాయిలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌లెన్స్ ఇన్ గవర్నెన్స్ అవార్డు లభించింది. ఈ మేరకు కేంద్రప్రభుత్వం పర్యవేక్షణలోని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్ ఆధ్వర్యంలోని కమిటీ ఆగస్టు 10నప్రకటించింది. ఢిల్లీలో ఆగస్టు 21న జరగనున్న కార్యక్రమంలో ఈ అవార్డునుఅందజేయనున్నట్లు తెలిపింది. పభుత్వ పథకాలను సమర్థంగా అమలు చేస్తూ ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా వివిధ ప్రాజెక్టులను, పథకాలను ప్రజలకు చేరవేస్తూ మంచి పాలనా ప్రక్రియకు నాంది పలికే కలెక్టర్లకు ఇండియన్ ఎక్స్ ప్రెస్ అవార్డును అందజేస్తారు.

దేశంలోని 688 జిల్లాల్లో కలెక్టర్ల పనితీరును పరిగణనలోకి తీసుకుని రెండేళ్లకోసారి అవార్డులను ప్రకటిస్తారు. ప్రధాని మోదీ కమిటీ చైర్మన్‌గా, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్ చైర్మన్ వివేక్ గోయెంక, రమానాథ్ గోయెంక సభ్యులుగా ఉన్న ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్ కమిటీ అవార్డులను ప్రకటిస్తుంది.

లిజనింగ్ లెర్నింగ్ లీడింగ్ పుస్తకావిష్కరణ

భారత ఉప రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడి రెండేళ్ల పయనంలో సాగిన పర్యటనలు, సందేశాలు, ఉపదేశాలు, కార్యక్రమాలతో కూడిన ‘లిజనింగ్ లెర్నింగ్ లీడింగ్’ పుస్తకావిష్కరణ ఆగస్టు 11న తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగింది. సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ నేతృత్వంలో రూపొందించిన ఈ పుస్తకాన్ని హోం మంత్రి అమిత్‌షా ఆవిష్కరించారు. తొలి ప్రతిని వెంకయ్య అందుకున్నారు.

ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా యార్లగడ్డ

ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ నియమితులయ్యారు. సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి కె. ప్రవీణ్ కుమార్ ఆగస్టు 13న ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతలు చేపట్టే తేదీ నుంచి రెండేళ్లు ఈ పదవిలో కొనసాగుతారు.

రాష్ట్రంలో అధికార కార్యకలాపాల నిమిత్తం, అధికార భాష తెలుగును పరిపాలనలో విస్తృతంగా ఉపయోగించడానికి చర్యలు చేపట్టేందుకు, తెలుగు వాడుక ప్రగతి సమీక్షించి ప్రభుత్వానికి సూచనలు, సిఫారసులు చేసే అధికారం అధ్యక్షుడికి ఉంటుంది.

ఏపీలో ప్రతి కుటుంబానికి హెల్త్‌కార్డు: సీఎం జగన్

రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి హెల్త్‌కార్డు ఇవ్వాలని, క్యూ ఆర్‌ కోడ్‌తో వీటిని జారీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కుటుంబ ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలన్నారు. ఆ వివరాలన్నీ గోప్యంగా ఉంటాయన్నారు. కార్డు స్కాన్‌ చేయగానే సంబంధిత కార్డుదారుడికి ఓటీపీ నెంబర్‌ వచ్చేలా ఉండాలని సూచించారు. ఈ ఏడాది డిసెంబర్‌ 21 నుంచి కార్డులు జారీ చేయాలని ఆదేశించారు. వార్షికాదాయం రూ.5 లక్షలలోపు ఉన్న ప్రతి ఒక్కరికీ ‘వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ’ వర్తించేలా చర్యలు చేపట్టాలన్నారు.

జ్ఞానపీఠ్‌ సలహా కమిటీ కన్వీనర్ గా సుబ్బారావు

ప్రతిష్ఠాత్మక జ్ఞానపీఠ్‌ తెలుగు భాషా సలహా కమిటీలో కన్వీనర్ గా ప్రముఖ సాహితీవేత్త డాక్టర్‌ చందూ సుబ్బారావు నియమితులయ్యారు. కమిటీ సభ్యులుగా సీనియర్‌ జర్నలిస్ట, ఆంధ్రజ్యోతి అసోసియేట్‌ ఎడిటర్‌ ఎ.కృష్ణారావు, రచయిత వెన్నా వల్లభ్‌రావును నియమించారు. వచ్చే 3 సంవత్సరాలకు జ్ఞానపీఠ్, మూర్తీదేవి పురస్కార గ్రహీతలను ఎంపిక చేసేందుకు జ్ఞానపీఠ్ సంస్థ భాషల వారీగా కమిటీలను ఏర్పాటు చేస్తింది.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments