☛ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య 34:66 నిష్పత్తిలో కృష్ణా నీటి పంపకం
కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లో లభ్యతగా ఉండే జలాలను పాత పద్ధతి ప్రకారమే పంచుకోవాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నిర్ణయించాయి. 2019-20 వాటర్ ఇయర్లో ప్రాజెక్టుల్లో చేరే నీటిని 34:66 నిష్పత్తిన పంచుకోవాలనే ఒప్పందానికి వచ్చాయి. హైదరాబాద్ లోని జలసౌధలో ఆగస్టు 9న సమావేశమైన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు… ఇరు రాష్ట్రాల తక్షణ తాగు, సాగు నీటి అవసరాలను తీర్చేందుకు వీలుగా ఎవరి అవసరాన్నిబట్టి వారు నీటి వినియోగం చేసుకోవచ్చని, ప్రాజెక్టుల్లోకి వరద ప్రవాహాలు తగ్గాక విని యోగ లెక్కలు చూసుకుందామనే అభిప్రాయానికి వచ్చాయి.
-
కృష్ణా బోర్డు చైర్మన్ – ఆర్కే గుప్తా
☛ తెలంగాణ, ఏపీలో ఎక్కడి నుంచైనా రేషన్
తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇక నుంచి రెండు రాష్ట్రాల్లో ఎక్కడైనా రేషన్ తీసుకునే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. వన్ నేషన్.. వన్ రేషన్ కార్డు పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాన్ని ఆగస్టు 9న ప్రారంభించింది. ఈ మేరకు తెలంగాణలో ఈ విధానాన్ని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి రాం విలాస్ పాశ్వాన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఢిల్లీ నుంచి ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో తెలంగాణ పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సభర్వాల్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని తొలి విడత నాలుగు రాష్ట్రాల్లో ప్రారంభించాలని భావించిన కేంద్రం… మహారాష్ట్ర–గుజరాత్‌ను ఒక యూనిట్‌గా, ఆంధ్రప్రదేశ్–తెలంగాణలను మరో యూనిట్‌గా ఎంచుకుంది. ఈ ప్రయోగాన్ని ఆగస్టు 9న లాంఛనంగా ప్రారంభించింది.
☛ విజయవాడలో డిప్లొమాటిక్ ఔట్ రీచ్ సదస్సు – సీఎం జగన్ ప్రసంగం
ఆంధ్రప్రదేశ్ లోని విజయావడలో ఆగస్టు 9న దౌత్యవేత్తలు, విదేశీ ప్రతినిధుల డిప్లొమేటిక్ ఔట్ రీచ్ సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి అవసరమైన వాతావరణం కల్పిస్తామని.. పారిశ్రామికవేత్తలు పెట్టుబడలుతో రావాలంటూ ఆహ్వానం పలికారు.
కలిసి పనిచేద్దామని సూచించారు. పరిశ్రమలకు ఎలాంటి సహకారం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమన్వయంతో ఈ సదస్సు నిర్వహించారు.
☛ జాతీయ క్రీడా సమాఖ్యల – NSF పరిధిలోకి బీసీసీఐ
భారత క్రికెట్ నియంత్రణ మండలి – బీసీసీఐ ని ఇతర క్రీడా సమాఖ్యల్లాగే గుర్తిస్తూ కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ ఆగస్టు 9న నిర్ణయం తీసుకుంది. దీంతో.. క్రికెటర్లు కూడా జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ – NADA నిర్వహించే పరీక్షలకు హాజరుకావాల్సిందే. సొంతంగా డోపింగ్ పరీక్షలు నిర్వహించే అవకాశం లేదు.
ఇప్పటి వరకు భారత క్రికెటర్ల శాంపిల్స్ ను స్వీడన్ కు చెందిన ఐడీటీఎం సేకరించి జాతీయ డోపింగ్ టెస్టింగ్ లాటొబరేటరీకి పంపించేది. ఇకపై ఐడీటీఎంకు ఆ అధికారం ఉండదు. నేరుగా నాడానే పరీక్షలు నిర్వహిస్తుంది.
2002 నుంచి డోపింగ్ పరీక్షలు నిర్వహిస్తున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి 2006లో ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ – వాడాతో ఒప్పందం చేసుకుంది. ఐసీసీ సభ్య దేశాలన్నీ దీనికి అంగీకరించగా.. ఒక్క భారత్ మాత్రం ఇందులో చేరేందుకు నిరాకరించింది.
☛ తిబిలిసి గ్రాండ్ ప్రీ రెజ్లింగ్ లో బజరంగ్ కు స్వర్ణం
భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా జార్జియాలో జరుగుతున్న తిబిలిసి గ్రాండ్ ప్రీ టోర్నమెంట్ లో.. ఆగస్టు 9న జరిగిన పురుషుల 65 కేజీల ఫ్రీ స్టయిల్ విభాగంలో 2 – 0 పాయింట్లతో తేడాతో ఇరాన్ కు చెందిన పీమన్ బిబ్యానిపై విజయం సాధించి.. స్వర్ణం గెలుచుకున్నాడు. తద్వారా ఈ టైటిల్ ని నిలబెట్టుకోవటంతో పాటు ఈ ఏడాది నాలుగో స్వర్ణాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.
☛ అక్టోబర్ 31 నుంచి J&K, Ladakh యూటీలు
దేశ తొలి హోంమంత్రి సర్దార్ పటేల్ జయంతి రోజైన అక్టోబర్ 31 నుంచి జమ్మూ అండ్ కశ్మీర్, లదాఖ్ లు కేంద్ర పాలిత ప్రాంతాలు (UT)గా మారనున్నాయి. జమ్మూ కశ్మీర్ ను రెండుగా విభజించి, కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చే జమ్ము కశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు – 2019 కి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆగస్టు 9న ఆమోదం తెలిపారు. దీంతో ఇది చట్టంగా మారింది. ఈ చట్టం అక్టోబర్ 31 నుంచి అమలవుతుందని హోంశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.