క్రీడలు
రంజీ ట్రోఫీ-2017 విజేత విధర్భ
విధర్బ జట్టు తొలిసారి రంజీ ట్రోఫీ విజేతగా నిలిచింది. ఇండోర్‌లో జనవరి 1న జరిగిన ఫైనల్లో ఢిల్లీపై విధర్భ విజయం సాధించింది. ప్రైజ్‌మనీగా విదర్భకు రూ.2 కోట్లు దక్కింది.
స్విట్జర్లాండ్ కు హాప్ మన్ కప్
స్విట్జర్లాండ్ హాప్‌మన్ కప్ టైటిల్ కైవసం చేసుకుంది. పెర్త్‌లో జనవరి 6న ముగిసిన పోటీల్లో జర్మనీపై స్విట్జర్లాండ్ గెలుపొందింది. 30 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ టోర్నీలో స్విట్జర్లాండ్ విజేతగా నిలవడం ఇది మూడోసారి.
టాటా ఓపెన్ విజేత సిమోన్
ఫ్రాన్స్ టెన్నిస్ ప్లేయర్ గిల్స్ సిమోన్ భారత్‌లో జరిగే ఏకైక ఏటీపీ టోర్నీ.. టాటా ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నాడు. పుణేలో జనవరి 6న జరిగిన ఫైనల్లో సిమోన్ 7–6 తేడాతో కెవిన్ అండర్సన్ (దక్షిణా ఫ్రికా)ను ఓడించాడు. డబుల్స్ టైటిల్ ను రాబిన్ హాసే–మిడెల్కూప్(నెదర్లాండ్స్) జోడీ గెలుచుకుంది.
స్కీయింగ్ లో దేశానికి తొలి పతకం
హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన అమ్మాయి అంచల్ ఠాకూర్ స్కీయింగ్‌లో దేశానికి తొలి అంతర్జాతీయ పతకం అందించింది. టర్కీలో అంతర్జాతీయ స్కీ సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఆల్ఫైన్ ఎజ్డర్ 3200 కప్‌లో స్లాలోమ్ రేస్ విభాగంలో అంచల్ కాంస్య పతకం గెలిచింది.
క్రికెటర్ ఆఫ్ ది ఇయర్.. కోహ్లీ
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ (గ్యారీఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ) అవార్డు దక్కింది. దీంతోపాటు ఐసీసీ టెస్ట్ టీం ఆఫ్ ది ఇయర్, వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్‌కు కోహ్లీ కెప్టెన్‌గా ఎన్నికయ్యాడు. ఐసీసీ వార్షిక అవార్డులను జనవరి 18న దుబాయ్‌లో ప్రకటించారు.
అవార్డు విజేతలు
ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ : స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)
ఐసీసీ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్: రషీద్ ఖాన్ (అఫ్గానిస్తాన్)
ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ : హసన్∙అలీ (పాకిస్తాన్)
ఫ్యాన్స్ మూమెంట్ ఆఫ్ ది ఇయర్ : పాకిస్తాన్ చాంపియన్స్ ట్రోఫీ కైవసం చేసుకోవడం.
ఐసీసీ అంపైర్ ఆఫ్ ది ఇయర్ : మరాయిస్ ఎరాస్మస్ (దక్షిణాఫ్రికా)
అంధుల ప్రపంచ కప్ విజేత భారత్
అంధుల 2వ ప్రపంచకప్‌ను భారత్ గెలుచు కుంది. షార్జాలో జనవరి 20న జరిగిన ఫైనల్లో పాకిస్థాన్‌ను ఓడించి..టైటిల్ నిలబెట్టుకుంది. తెలుగువాడైన అజయ్‌కుమార్ రెడ్డి నేతృత్వం లోని భారత జట్టు టోర్నీ ఆసాంతం అద్భుతంగా ఆడింది. సునీల్ రమేష్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ పురస్కారం దక్కింది.
ఆస్ట్రేలియన్ ఓపెన్ – 2018
– ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్) గెలుచుకున్నాడు. మెల్బోర్న్లో జనవరి 28న జరిగిన ఫైనల్లో మారిన్ సిలిచ్(క్రొయేషియా) ను ఫెదరర్ ఓడించాడు. ఫెదరర్‌కు ఇది ఆరో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్.
– మహిళల సింగిల్స్ టైటిల్‌ను కరోలినా వోజ్నియాకి (డెన్మార్క్)గెలుచుకుంది. దీంతో గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన∙తొలి డెన్మార్క్ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.
– పురుషుల డబుల్స్ టైటిల్‌ను మాట్ పవిచ్ (క్రొయేషియా), ఒలివర్ మరాచ్ (ఆస్ట్రియా) జోడీ; మహిళల డబుల్స్ టైటిల్‌ను టిమియా బాబోస్ (హంగేరీ), క్రిస్టినా మడనోవిచ్ (ఫ్రాన్స్) జోడీ; మిక్సిడ్ డబుల్స్ టైటిల్‌ను దబ్రౌస్కీ (కెనడా), పవిచ్ (క్రొయేషియా) జోడీ గెలుచుకుంది.
-
భారత్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను దక్షిణాఫ్రికా గెలుచుకుంది. జొహన్నెస్‌బర్గ్‌లో జనవరి 27న ముగిసిన మూడో టెస్టును భారత్ గెలుచుకోవడంతో సిరీస్ 2–1 తేడాతో దక్షిణాఫ్రికా వశమైంది.
అండర్ -19 ప్రపంచ కప్ భారత్ కైవసం
భారత్ అండర్–19 ప్రపంచకప్ కైవసం చేసుకుంది. న్యూజిలాండ్‌లో ఫిబ్రవరి 3న జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియాపై భారత్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో నాలుగుసార్లు ఈ కప్ గెలుచుకున్న జట్టుగా రికార్డు సృష్టించింది.
బీవెన్జాంగ్.. ఇండియన్ ఓపెన్ బ్యాడ్మింటన్..
ఇండియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ టైటిల్‌ను బీవెన్ జాంగ్(అమెరికా) గెలుచుకుంది. న్యూఢిల్లీలో ఫిబ్రవరి 4న జరిగిన ఫైనల్లో పీవీ సింధుపై బీవెన్ గెలుపొందింది. పురుషుల సింగిల్స్ టైటిల్‌ను షి యుకి(చైనా) గెలుచుకున్నాడు.
ఇండియ్ స్క్వాష్ ఓపెన్
భారత స్క్వాష్ క్రీడాకారుడు సౌరవ్ ఘోషల్ ఇండియ్ స్క్వాష్ ఓపెన్ టోర్నీ చాంపియన్‌గా నిలిచాడు. ముంబైలో ఫిబ్రవరి 11న జరిగిన ఫైనల్లో నికోలస్ ముల్లర్(ఫ్రాన్స్)పై విజయం సాధించాడు.
సమీర్ కు స్విస్ ఓపెన్ టైటిల్
భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సమీర్ వర్మ స్విస్ ఓపెన్(బ్యాడ్మింటన్) పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నాడు. వియన్నాలో ఫిబ్రవరి 25న జరిగిన ఫైనల్లో జాన్ జార్జెన్సెన్(డెన్మార్క్)ను సమీర్ ఓడించాడు.
విజయ్ హజారే విజేత కర్ణాటక
వన్డే ఫార్మాట్ విజయ్ హజారే ట్రోఫీని కర్ణాటక గెలుచుకుంది. 2018, ఫిబ్రవరి 27న న్యూఢిల్లీలో ముగిసిన ఫైనల్లో సౌరాష్ట్రను కర్ణాటక ఓడించింది.
లారెస్ స్పోర్ట్స్ అవార్డులు – 2017
క్రీడారంగంలో ఆస్కార్ లాంటి లారెస్ స్పోర్ట్స్ అవార్డులను 2017 సంవత్సరానికి మోంటేకార్లో (మొనాకో)లో 2018, ఫిబ్రవరి 27న బహుకరించారు. ఈ అవార్డుల్లో రోజర్ ఫెదరర్‌కు రెండు అవార్డులు దక్కాయి.
అవార్డు విజేత
వరల్డ్ స్పోర్ట్మన్ ఆఫ్ ద ఇయర్ రోజర్ ఫెదరర్
కమ్‌బ్యాక్ ఆఫ్ ద ఇయర్ రోజర్ ఫెదరర్
స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ద ఇయర్ సెరెనా విలియమ్స్
తాల్ స్మారక చెస్ విజేత ఆనంద్
ప్రతిష్టాత్మక తాల్ స్మారక టోర్నమెంట్లో ర్యాపిడ్ విభాగంలో విశ్వనాథన్ ఆనంద్ చాంపియన్‌గా నిలిచారు. మాస్కోలో 2018 మార్చి 4న ముగిసిన పది మంది గ్రాండ్ శాష్రియార్ మమెద్యరోవ్ రెండో స్థానంలో నిలిచాడు.
ఆసియా సీనియర్ రెజ్లింగ్
ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఒక స్వర్ణం, ఒక రజతం, ఆరు కాంస్యాలతో కలిపి మొత్తం ఎనిమిది పతకాలు లభించాయి. బిష్కెక్ (కిర్గిస్తాన్)లో 2018, మార్చి 4న ముగిసిన ఈ పోటీలో చైనా ఏడు స్వర్ణ పతకాలతో మొత్తం 14 పతకాలు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. ఇరాన్ ఆరు స్వర్ణ పతకాలతో మొత్తం 10 పతకాలతో రెండో స్థానం, ఉజ్బెకిస్థాన్ నాలుగు స్వర్ణాలతో మొత్తం 15 పతకాలతో మూడో స్థానంలో నిలిచాయి.
ఐబీఎస్ టీమ్ స్నూకర్ ప్రపంచ కప్
ఐబీఎస్ఎఫ్ టీమ్ స్నూకర్ ప్రపంచకప్‌లో భారత్ విజేతగా నిలిచింది. దోహలో 2018, మార్చి2న జరిగిన ఫైనల్లో భారత్ 3–2తో పాకిస్థాన్‌పై విజయం సాధించింది. భారత జట్టులో పంకజ్ అడ్వాణీతో పాటు చంద్ర, మనన్ ఉన్నారు.
నవ్ చోత్ కౌర్ …
ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో నవ్‌జోత్ కౌర్‌కు స్వర్ణం పతకం లభించింది. దీంతో ఆమె ఈ చాంపియన్ షిప్ స్వర్ణం గెలిచిన భారత తొలి మహిళగా రికార్డు సాధించింది. 2018, మార్చి 2న బిషెక్(కిర్గిజ్‌స్థాన్) జరిగిన పోటీల్లో 65 కిలోల విభాగంలో నవజోత్ పసిడి గెలుచుకోగా.. రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతక విజేత సాక్షి మలిక్ కాంస్య పతకం సాధించింది.
ఇండియ్ స్క్వాష్ ఓపెన్ టోర్నీ
భారత స్క్వాష్ క్రీడాకారుడు సౌరవ్ ఘోషల్ ఇండియ్ స్క్వాష్ ఓపెన్ టోర్నీ చాంపియన్‌గా నిలిచాడు. ముంబైలో ఫిబ్రవరి 11న జరిగిన ఫైనల్లో నికోలస్ ముల్లర్(ఫ్రాన్స్)పై విజయం సాధించాడు.
మనూ భాకర్ కు రెండో స్వర్ణం
మెక్సికోలో జరిగిన ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో మనూ భాకర్ రెండో స్వర్ణ పతకం గెలుచుకుంది. మొదటగా 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్లో స్వర్ణం నెగ్గిన మనూ.. తర్వాత 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్లో భారత్‌కు చెందిన ఓంప్రకాశ్‌తో కలిసి 2వ స్వర్ణం గెలుచుకుంది.
దేవధర్ ట్రోఫీ విజేత భారత్ బి
దేవధర్ క్రికెట్ ట్రోఫీని ‘భారత బి’ జట్టు గెలుచుకుంది. ధర్మశాలలో మార్చి 8న జరిగిన ఫైనల్లో కర్ణాటకపై భారత్ బి గొలుపొందింది.
అజ్లాన్ షా హాకీ విజేత ఆస్ట్రేలియా
అజ్లాన్ షా హాకీ టోర్నమెంట్ టైటిల్‌ను ఆస్ట్రేలియా గెలుచుకుంది. ఇఫా(మలేషియా)లో మార్చి 10న జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఆస్ట్రేలియా ఓడించింది.
షూటింగ్ ప్రపంచకప్ లో తొలి స్థానంలో భారత్
షూటింగ్ ప్రపంచకప్ చరిత్రలో తొలిసారిగా భారత్ అగ్రస్థానంలో నిలిచింది మెక్సికోలో మార్చి 12న ముగిసిన టోర్నీలో మొత్తం నాలుగు స్వర్ణాలు, రజతం, కాంస్యం సాధించి.. పతకాల పట్టికలో ప్రథమ స్థానంలో నిలిచింది.
ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్
బర్మింగ్‌హామ్‌లో మార్చి 18న ముగిసిన ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పురుషుల సింగిల్స్ టైటిల్‌ను షి యుకి(చైనా); మహిళల సింగిల్స్ టైటిల్‌ను తై జు యింగ్(తైవాన్–రిపబ్లిక్ ఆఫ్ చైనా) కైవసం చేసుకున్నారు.
ఇరానీ క్రికెట్ ట్రోఫీ విజేత విదర్భ
ఇరానీ క్రికెట్ ట్రోఫీని విదర్భ గెలుచుకుంది. నాగ్‌పూర్‌లో మార్చి 18న జరిగిన ఫైనల్లో రెస్టాఫ్ ఇండియాను విదర్భ ఓడించింది.
ఆసియా బిలియర్డ్స్ చాంపియన్.. పంకజ్
భారత్‌కు చెందిన పంకజ్ అద్వానీ ఆసియా బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. మయన్మార్ లోని యంగాన్లో మార్చి 24న జరిగిన ఫైనల్లో భారత్‌కే చెందిన భాస్కర్‌పై పంకజ్ విజయం సాధించాడు. ఆసియా పోటీల్లో పంకజ్‌కు ఇది 11వ స్వర్ణం కావడం విశేషం. మహిళల విభాగం ఫైనల్లో భారత్‌కు చెందిన అమీ కమని(భారత్).. థాయిలాండ్‌కు చెందిన సిరపాపార్న్పై విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది.
ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రి విజేత వెటెల్
ఫార్ములావన్ ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రి టైటిల్‌ను సెబాస్టియన్ వెటెల్ గెలుచుకున్నాడు. మెల్బోర్న్లో మార్చి 25న జరిగిన రేసులో వెటెల్ మొదటి స్థానం కైవసం చేసుకోగా, లూయిస్ హామిల్టన్ రెండో స్థానంలో నిలిచాడు.
జాతీయ హాకీ విజేత పంజాబ్
నేషనల్ హాకీ చాంపియన్‌షిప్ టైటిల్‌ను పంజాబ్ గెలుచుకుంది. లక్నోలో మార్చి 25న జరిగిన ఫైనల్లో పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డ్(పీఎస్‌పీబీ) జట్టును పంజాబ్ ఓడించింది.
బాల్‌టాంపరింగ్ ఉదంతం
బాల్ టాంపరింగ్ సూత్రధారులు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) కఠిన శిక్షలు విధించింది. వారిద్దరినీ ఏడాదిపాటు అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్ నుంచి నిషేధించింది. బాల్ టాంపరింగ్లో పాత్రధారైన బాన్‌క్రాఫ్ట్‌పై 9 నెలల వేటు పడింది.
షూటింగ్ జూనియర్ ప్రపంచకప్
సిడ్నీలో జరిగిన షూటింగ్ జూనియర్ ప్రపంచకప్‌లో భారత్ రెండో స్థానంలో నిలిచింది. 9 స్వర్ణాలు, 5 రజతాలు, 8 కాంస్యాలతో కలిపి 22 పతకాలను కైవసం చేసుకోగా, చైనా 9 స్వర్ణాలు, 8 రజతాలు, 8 కాంస్యాలతో మొత్తం 25 పతకాలు సాధించి మొదటి స్థానంలో నిలిచింది.
21వ కామన్వెల్త్ క్రీడలు
ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో ఏప్రిల్ 4న కామన్వెల్త్ క్రీడలు (21వ) అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. బ్రిటన్ రాణి ప్రతినిధిగా హాజరైన ప్రిన్స్ చార్లెస్..క్రీడలు అధికారికంగా ప్రారంభమైనట్లు ప్రకటించారు. 12 రోజులపాటు జరిగిన ఈ క్రీడల్లో.. 71 దేశాల నుంచి 6,600 మంది క్రీడాకారులు, 23 క్రీడాంశాల్లో 275 స్వర్ణ పతకాల కోసం పోటీపడ్డారు. భార త్ తరఫున 218 మంది క్రీడాకారులు 17 క్రీడాంశాల్లో పాల్గొన్నారు. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు నేతృత్వంలో భారత బృందం మార్చ్ఫాస్ట్ చేసింది. ఆతిథ్య ఆస్ట్రేలియా అత్యధికంగా 400 మందికి పైగా అథ్లెట్లతో ఆరంభోత్సవం లో పాల్గొంది. ఈ క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణాన్ని 48 కిలోల వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను అందించింది.
– కామన్వెల్త్ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెయిట్ లిఫ్టర్ రాగాల వెంకట రాహుల్ స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. 85 కిలోల విభాగంలో ఏప్రిల్ 7న జరిగిన పోటీలో రాహుల్ విజేతగా నిలిచాడు. స్నాచ్‌లో 151 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 187 కిలోలు ఎత్తిన రాహుల్..మొత్తంగా 338 కిలోలతో స్వర్ణం చేజిక్కించుకున్నాడు.
– కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా ఏప్రిల్ 9న జరిగిన బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో భారత్ 3–1 తేడాతో మలేషియాపై గెలుపొందింది. దీంతో కామన్వెల్త్ చరిత్రలో తొలిసారిగా ఈ ఈవెంట్లో స్వర్ణ పతకం గెలుచుకుంది. 2006 మెల్బోర్న్, 2010 న్యూఢిల్లీ, 2014 గ్లాస్కో గేమ్స్‌లో విజేతగా నిలిచిన మలేషియా ఈసారి భారత్ చేతిలో ఓడిపోయింది.
– భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ వరుసగా మూడోసారి కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం నెగ్గి హ్యాట్రిక్ సాధించాడు. ఏప్రిల్ 12న జరిగిన 74 కిలోల ఫ్రీ సై్టల్ విభాగ పోటీలో దక్షిణాఫ్రికా ఆటగాడు జొహన్నెస్ బోతాపై సుశీల్ విజయం సాధించాడు.
పతకాల పట్టిక (తొలి ఐదు స్థానాలు)
దేశం స్వర్ణం రజతం కాంస్యం మొత్తం
ఆస్ట్రేలియా 80 59 59 198
ఇంగ్లండ్ 45 45 46 136
భారత్ 26 20 20 66
కెనడా 15 40 27 82
న్యూజిలాండ్ 15 16 15 46
బహ్రెయిన్ గ్రాండ్ ప్రి విజేత వెటెల్
ఫార్ములావన్ బహ్రెయిన్ గ్రాండ్ ప్రిలో ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ విజేతగా నిలిచాడు. ఏప్రిల్ 8న జరిగిన రేసులో వెటెల్ తొలి స్థానంలో నిలవగా, మెర్సిడెస్ డ్రైవర్ బొటాస్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
చైనా గ్రాండ్ ప్రీ విజేత రికియార్డో
ఫార్ములావన్ చైనా గ్రాండ్ ప్రి టైటిల్‌ను రికియార్డో గెలుచుకున్నాడు. షాంఘైలో ఏప్రిల్ 15న జరిగిన రేసులో రికియార్డో మొదటి స్థానంలో నిలవగా, హామిల్టన్ రెండో స్థానానికి పరిమితమయ్యాడు.
బ్యాడ్మింటన్ లో నంబర్ వన్ కు కిడాంబి
కిడాంబి శ్రీకాంత్ బ్యాడ్మింటన్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానానికి చేరుకున్నాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ఏప్రిల్ 12న ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో శ్రీకాంత్‌కు తొలి స్థానం దక్కింది.
బార్సిలోనా ఓపెన్ విజేత నాదల్
స్పెయిన్‌కి చెందిన రాఫెల్ నాదల్ 11వ సారి బార్సిలోనా ఓపెన్ టెన్నిస్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. బార్సిలోనాలో ఏప్రిల్ 29న జరిగిన ఫైనల్లో గ్రీస్ ఆటగాడు స్టెఫానోస్ సిట్ సిపాస్ను నాదల్ ఓడించాడు. ఇది నాదల్ కెరీర్లో 77వ సింగిల్స్ టైటిల్. తాజా విజయంతో అత్యధిక సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో నాదల్ నాలుగో స్థానంలో నిలిచాడు.
ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్
ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను జపాన్‌కు చెందిన కెంటో మొమోటా గెలుచుకున్నాడు. ఈ టైటిల్ నెగ్గిన తొలి జపాన్ ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. వుహాన్(చైనా)లో ఏప్రిల్ 29న జరిగిన ఫైనల్లో చెన్ లాంగ్(చైనా)పై కెంటో గెలుపొందాడు. మహిళల సింగిల్స్ టైటిల్‌ను తైవాన్‌కు చెందిన తాయ్ జు ఇంగ్ గెలుచుకుంది.
మాడ్రిడ్ఓపెన్ – టెన్నిస్
చెక్‌రిపబ్లిక్ టెన్నిస్ క్రీడాకారిణి పెట్రా క్విటోవా మాడ్రిడ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేతగా నిలిచింది. మాడ్రిడ్‌లో మే 13న జరిగిన ఫైనల్లో కికి బెర్టెన్స్ (నెదర్లాండ్స్)ను ఓడించి, టైటిల్ సాధించింది. దీంతో ఈ టోర్నీని మూడుసార్లు గెలిచిన తొలి క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. పురుషుల సింగిల్స్ టైటిల్‌ను అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) గెలుచుకున్నాడు. ఫైనల్లో డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)ను ఓడించి, టైటిల్ సాధించాడు.
స్పెయిన్ గ్రాండ్ ప్రి విజేత హామిల్టన్
మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఫార్ములావన్ స్పెయిన్ గ్రాండ్ ప్రి టైటిల్ సాధించాడు. బార్సిలోనాలో మే 13న జరిగిన రేసులో హామిల్టన్ మొదటి స్థానంలో నిలవగా, మెర్సిడెస్‌కే చెందిన బొటాస్ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్లో హామిల్టన్‌కు ఇది రెండో టైటిల్ కాగా, కెరీర్లో 64వ విజయం.
ఇటాలియన్ ఓపెన్ విజేత నాదల్
రాఫెల్ నాదల్ ఎనిమిదోసారి ఇటాలియన్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. రోమ్‌లో మే 20న జరిగిన ఫైనల్లో అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)పై నాదల్ గెలుపొందాడు. ఈ విజయంతో ఫెదరర్‌ను వెనక్కునెట్టి lనెం.1 స్థానం కైవసం చేసుకున్నాడు.
మొనాకో గ్రాండ్ ప్రీ విజేత రికియార్డో
రెడ్‌బుల్ డ్రైవర్ డానియల్ రికియార్డో ఫార్ములావన్ మొనాకో గ్రాండ్ ప్రీలో విజేతగా నిలిచాడు. ఫెరారీ డ్రైవర్ వెటెల్ రెండో స్థానంలో నిలిచాడు.
ఉబెర్ కప్ విజేత జపాన్
మహిళల బాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఉబెర్ కప్‌ను జపాన్ గెలుచుకుంది. బ్యాంకాక్‌లో మే 26న జరిగిన ఫైన ల్స్‌లో థాయ్‌లాండ్‌ను జపాన్ ఓడించింది.
పాలి ఉమ్రిగర్ అవార్డు విజేత కోహ్లీ
గత రెండేళ్లుగా అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీS ప్రతిష్టాత్మక పాలి ఉమ్రిగర్ అవార్డుతో పాటు 2016–17, 2017–18 సీజన్లకు గాను బీసీసీఐ ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. ఈ అవార్డు కింద కోహ్లీకి ఒక్కో సీజన్‌కు రూ.15 లక్షల చొప్పున రెండు సీజన్లకు రూ.30 లక్షల ప్రైజ్ మనీ దక్కనుంది. మహిళల కేటగిరీలో ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్లుగా హర్మన్ ప్రీత్ కౌర్ (2016–17), స్మృతి మంధాన (2017–18) లాలా అమర్నాథ్ అవార్డుకు ఎంపికయ్యారు.
ఆదాయంలో కోహ్లీకి 83వ స్థానం
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆదాయం ఆర్జించే టాప్–100 క్రీడాకారుల జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి 83వ స్థానం దక్కింది. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక క్రికెటర్ కోహ్లీ. గతేడాది 89వ స్థానంలో ఉన్న కోహ్లీ ఈ ఏడాది ఆరు స్థానాలు మెరుగుపరుచుకున్నాడు. అతని వార్షిక ఆదాయం 24 మిలియన్ డాలర్లు (సుమారు రూ.160 కోట్లు). ఇందులో ఆట ద్వారా 4 మిలియన్ డాలర్లు (సుమారు రూ.27.5 కోట్లు), వాణిజ్య ఒప్పందాల ద్వారా 20 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.133 కోట్లు) ఆర్జిస్తున్నాడు. ఈ జాబితాలో బాక్సర్ ఫ్లాయిడ్ మేవెదర్ 275 మిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో ఉండగా, అర్జెంటీనా ఫుట్ బాలర్ లియోనెల్మెస్సి రూ.742 కోట్ల వార్షికాదాయంతో రెండో స్థానంలో ఉన్నాడు.
ఐపీఎల్ 11వ సీజన్ విజేత చెన్నై సూపర్ కింగ్స్
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 11వ సీజన్ ఐపీఎల్ విజేతగా నిలిచింది. మే 27న ముంబైలో జరిగిన ఫైనల్లో 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును ఓడించింది. మూడో సారి టైటిల్ గెలుచుకున్న చెన్నై జట్టుకు రూ.20 కోట్లు, రన్నరప్ జట్టుకు రూ.12.5 కోట్లు ప్రైజ్ మనీ దక్కింది.
నార్వే చెస్.. ఆనంద్..
భారత్‌కు చెందిన విశ్వనాథన్ ఆనంద్.. నార్వే చెస్ టోర్నమెంట్లో ఉమ్మడిగా రెండో స్థానంలో నిలిచాడు. స్టవేంజర్ (నార్వే)లో జూన్ 8న ముగిసిన పోటీల్లో ఫాబియానో కరౌనా (ఇటలీ) టోర్నీ విజేతగా నిలిచాడు.
క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోర్
తాజా ముక్కోణపు సిరీస్‌లో న్యూజిలాండ్ మహిళల జట్టు 490 పరుగులు సాధించి అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా నిలిచింది. జూన్ 8న ఆతిథ్య ఐర్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఈ ఘనతను సాధించింది.
మహిళల టీ 20 ఆసియాకప్
మహిళల టీ 20 ఆసియాకప్ టైటిల్‌ను బంగ్లాదేశ్ తొలిసారి కైవసం చేసుకుంది. కౌలాలంపూర్‌లో జూన్ 10న జరిగిన ఫైనల్లో భారత్‌ను ఓడించింది. ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు హర్మన్ ప్రీత్‌కు దక్కగా, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రుమాన్ అహ్మద్‌ను వరించింది.
ఇంటర్ కాంటినెంటల్ కప్
సునీల్ ఛెత్రి సార థ్యంలోని భారత ఫుట్‌బాల్ జట్టు ఇంటర్ కాంటినెంటల్ కప్ గెలుచుకుంది. జూన్ 10న జరిగిన ఫైనల్లో 2–0తో కెన్యాపై విజయం సాధించింది. టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఛెత్రి.. అంతర్జాతీయంగా అత్యధిక గోల్స్ కొట్టిన రెండో ఆటగాడిగా అర్జెంటీనా సూపర్‌స్టార్ లియోనల్ మెస్సి సరసన నిలిచాడు. క్రిస్టియానో రొనాల్డో 81 గోల్స్‌తో అగ్రస్థానంలో ఉన్నాడు.
ఫ్రెంచ్ఓపెన్ – 2018
-
ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను సిమోనా హలెప్ (రొమేనియా) గెలుచుకుంది. జూన్ 9న జరిగిన ఫైనల్లో స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా)ను ఓడించి తన కెరీర్లో తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను దక్కించుకుంది.
-
పురుషుల సింగిల్స్ ఫైనల్లో సీడ్ థీమ్ (ఆస్ట్రియా)ను ఓడించిన రఫెల్ నాదల్ తన కెరీర్లో 11వ సారి ఈ టైటిల్‌ను గెలుచుకుని ఒకే గ్రాండ్‌స్లామ్‌ను అత్యధిక సార్లు గెలిచిన మార్గరెట్ కోర్ట్ రికార్డును సమం చేశాడు.
-
బార్బరా క్రెసికోవా–కేథరినా సినియాకోవా (చెక్) జంట ఫైనల్లో ఎరిహజమి– మకోంటో నినోమియా (జపాన్) జోడీపై గెలిచి మహిళల డబుల్స్ టైటిల్‌ను గెలుచుకుంది.
-
పురుషుల డబుల్స్ పీరె హుగ్స్ హెర్బెర్ట్, నికోలస్ మహుత్ (ఫ్రాన్స్) జోడీ ఫైనల్స్‌లో ఓలివర్ మరాచ్ (ఆస్ట్రేలియా), మటె పనిచ్ (క్రొయేషియా)లను ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకున్నారు.
-
మిక్స్డ్ డబుల్స్‌లో గాబ్రిలా దబ్రోస్కీ (కెనడా), రోహన్ బోపన్న (భారత్)ల జోడీ టైటిల్ విజేతలుగా నిలిచారు. వీరు ఫైనల్లో అన్నా లీనా గ్రొయెన్ఫెల్డ్ (జర్మనీ), రాబర్ట్ ఫరా (కొలంబియా)లను ఓడించారు.
21వ ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్
21వ ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఆరంభ వేడుకలను రష్యా రాజధాని మాస్కోలోని లుజ్నికి స్టేడియంలో జూన్ 14న నిర్వహించారు. 32 రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో 32 జట్లు పాల్గొంటాయి. రష్యా, సౌదీ అరేబియాలు పోటీ పడిన తొలి మ్యాచ్‌లో రష్యా గెలిచింది.
ఇంగ్లండ్ రికార్డ్
ఇంగ్లండ్ వన్డే క్రికెట్ జట్టు తన రికార్డును తానే బద్దలుకొడుతూ 50 ఓవర్లలో 481 పరుగుల అత్యధిక స్కోరు నమోదు చేసింది. ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా నాటింగ్‌హామ్‌లో జరిగిన మూడో వన్డేలో ఈ ఘనతను సాధించింది. వన్డేల్లో ఇదే అత్యధిక స్కోరు.
ఫ్రెంచ్ గ్రాండ్ ప్రి విజేత హామిల్టన్
మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఫార్ములావన్ ఫ్రెంచ్ గ్రాండ్ ప్రీ టైటిల్ గెలుచుకున్నాడు. అతని కెరీర్లో ఇది 65వ టైటిల్. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) రెండో స్థానంలో, రైకోనెన్ (ఫెరారీ) మూడో స్థానంలో నిలిచారు.
ప్రపంచకప్ స్టేజ్–3 టోర్నీలో దీపికకు స్వర్ణం
భారత ఆర్చర్ దీపిక కుమారి ప్రపంచకప్ స్టేజ్–3 టోర్నీలో మహిళల రికర్వ్ విభాగంలో పసిడి పతకం సొంతం చేసుకుంది. అమెరికాలోని సాల్ట్‌లేక్ సిటీలో జూన్ 25న జరిగిన తుది పోటీలో మిచెలి క్రొపెన్ (జర్మనీ)ని దీపిక ఓడించింది. ఈ విజయంతో ఆమె టర్కీలో జరిగే ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్ టోర్నీకి అర్హత సాధించింది.
హామిల్టన్‌కు హంగేరి గ్రాండ్‌ప్రి టైటిల్
మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్‌కు హంగేరి గ్రాండ్‌ప్రి టైటిల్ లభించింది. ఈ మేరకు హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో జూలై 29న జరిగిన రేసులో హామిల్టన్ 70 ల్యాప్‌ల దూరాన్ని గంటా 37 నిమిషాల 16.427 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. హంగేరియన్ సర్క్యూట్లో హామిల్టన్‌కు ఇది ఆరో టైటిల్ కాగా ఈ సీజన్లో ఐదో టైటిల్.
రష్యా ఓపెన్ టోర్నీ విజేత సౌరభ్
బీడబ్ల్యూఎఫ్ టూర్ సూపర్-100 రష్యా ఓపెన్ టోర్నీలో భారత షట్లర్ సౌరభ్ వర్మ విజేతగా నిలిచాడు. జూలై 29న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో సౌరభ్ 19-21, 21-12, 21-17తో కొకి వతనబె (జపాన్)పై గెలుపొందాడు.
టీఎంజీఏ పేరుతో సచిన్ క్రికెట్ అకాడమీ
భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఇంగ్లండ్‌కు చెందిన మిడిలెసెక్స్‌తో కలిసి ‘టెండూల్కర్ మిడిలెసెక్స్ గ్లోబల్ అకాడమీ’ (టీఎంజీఏ) పేరుతో అంతర్జాతీయ క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్లు జూలై 18న ప్రకటించాడు. ఈ మేరకు త్వరలో ఇంగ్లండ్‌లోని నార్త్‌వుడ్‌లో తొలిదశ శిక్షణ శిబిరంను ప్రారంభించనున్నట్లు తెలిపాడు. సచిన్ కోచ్‌గా వ్యవహరించే ఈ శిబిరంలో 9 నుంచి 14 ఏళ్ల బాలబాలికలకు శిక్షణ ఇస్తారు.
యూఎస్ ఓపెన్ ప్రైజ్‌మనీ పెంపు
యూఎస్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ విజేతకు ఇచ్చే ప్రైజ్‌మనీని జూలై 18న 38 లక్షల డాలర్ల (రూ. 26 కోట్లు) కు పెంచారు. దీంతో అత్యధిక ప్రైజ్‌మనీ ఇస్తున్న గ్రాండ్‌స్లామ్ టోర్నీగా యూస్ ఓపెన్ నిలవనుంది. మొత్తం టోర్నీ ప్రైజ్‌మనీ 5 కోట్ల 30 లక్షల డాలర్లు (రూ. 363 కోట్లు).
1973 నుంచి పురుషులు, మహిళల సింగిల్స్ విజేతలకు సమాన ప్రైజ్‌మనీ ఇస్తున్న గ్రాండ్స్లామ్గా యూఎస్ ఓపెన్ నిలిచింది.
భారత్‌కు హాకీ సిరీస్
న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల హాకీ సిరీస్‌లో భారత పురుషుల జట్టు విజయం సాధించింది. ఈ మేరకు బెంగళూరులో జూలై 22న జరిగిన మూడో మ్యాచ్‌లో భారత్ 4-0తో న్యూజిలాండ్‌పై గెలిచింది.
హామిల్టన్‌కు జర్మనీ గ్రాండ్‌ప్రి టైటిల్
జర్మనీ గ్రాండ్‌ప్రి టైటిల్‌ను మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ గెలుచుకున్నాడు. జర్మనీలోని హాకెన్హీమ్లో జూలై 22న జరిగిన ఫార్ములావన్ రేసులో 67 ల్యాప్‌లను గంటా 32 నిమిషాల 29.845 సెకన్లలో పూర్తి చేసి హామిల్టన్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్లో హామిల్టన్‌కు ఇది నాలుగో టైటిల్.
అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో హిమ దాస్‌కు స్వర్ణం
ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణి హిమ దాస్ స్వర్ణం గెలుచుకుంది. ఫిన్లాండ్లోని టాంపెరెలో జూలై 12న జరిగిన పరుగు పందెంలో 400 మీటర్ల దూరాన్ని దాస్ 51.46 సెకన్లలో చేరుకుంది. దీంతో ఐఏఏఎఫ్ వరల్డ్ ట్రాక్ ఈవెంట్లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారత అథ్లెట్‌గా హిమ దాస్ గుర్తింపు పొందింది. అసోంలోని నాగావ్‌కు చెందిన 18 ఏళ్ల హిమ ఇటీవల గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో 400 మీటర్ల పరుగులో ఆరో స్థానంలో నిలిచింది.
వింబుల్డన్ పురుషుల సింగిల్స్ విజేత జొకోవిచ్
టెన్నిస్ సీజన్ మూడో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ వింబుల్డన్‌లో సెర్బియాకి చెందిన నొవాక్ జొకోవిచ్ విజేతగా నిలిచాడు. లండన్‌లో జూలై 15న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో 6-2, 6-2, 7-6 (7/3)తో ఎనిమిదో సీడ్ కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)పై 12వ సీడ్ జొకోవిచ్ గెలుపొందాడు.
కెర్బర్‌కు వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్
24వ మహిళల వింబుల్డన్ టైటిల్‌ను 11వ సీడ్ ఎంజెలిక్ కెర్బర్ సొంతం చేసుకుంది. ఈ మేరకు లండన్‌లో జూలై 14న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో 6-3, 6-3తో అమెరికాకి చెందిన సెరెనా విలియమ్స్‌పై కెర్బర్ విజయం సాధించింది. దీంతో స్టేఫీ గ్రాఫ్ (1996) తర్వాత వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ నెగ్గిన జర్మనీ క్రీడాకారిణిగా 30 ఏళ్ల కెర్బర్ గుర్తింపు పొందింది. ఇప్పటికే రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను కెర్బర్ గెలుచుకుంది.
థాయ్‌లాండ్ ఓపెన్ ఒకుహారా విజయం
థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-500 టోర్నమెంట్లో జపాన్‌కి చెందిన నొజోమి ఒకుహారా విజయం సాధించింది. బ్యాంకాక్‌లో జూలై 15న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ పీ.వీ సింధూపై 15-21, 18-21తో ఒకుహారా గెలుపొందింది.
ఫ్రాన్స్ కు ప్రపంచ ఫుట్‌బాల్ కప్
21వ ఫుట్‌బాల్ ప్రపంచ కప్ -2018(ఫిఫా)ను ఫ్రాన్స్ జట్టు(ది బ్లూస్) కైవసం చేసుకుంది. రష్యాలోని లుజ్నికి స్టేడి యంలో జూలై 15న జరిగిన ఫైనల్లో 4-2తో క్రొయేషియాపై ఫ్రాన్స్ విజయం సాధించింది. 1998లో జరిగిన 16 ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌లోనూ ఫ్రాన్స్ విజేతగా నిలిచింది.
కప్‌ను గెలుచుకున్న ఫ్రాన్స్ జట్టుకు 3 కోట్ల 80 లక్షల డాలర్ల (రూ. 260 కోట్లు)ను బహుమతిగా ఇస్తారు. అలాగే రన్నరప్ క్రొయేషియా జట్టుకు 2 కోట్ల 80 లక్షల డాలర్లు (రూ. 191 కోట్లు), మూడో స్థానం పొందిన బెల్జియం జట్టుకు 2 కోట్ల 40 లక్షల డాలర్లు (రూ. 164 కోట్లు), నాలుగో స్థానంలో నిలిచిన ఇంగ్లండ్‌కు 2 కోట్ల 20 లక్షల డాలర్ల (రూ. 150 కోట్లు)ను ఇస్తారు. ఫిఫా కప్ 2026ను అమెరికా, కెనడా, మెక్సికోలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి.
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పేరు మార్పు
స్పోర్ట్స అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) పేరును ‘స్పోర్ట్స ఇండియా’గా మారుస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జులై 4న న్యూఢిల్లీలో జరిగిన ‘సాయ్’ 50వ సర్వసభ్య సమావేశంలో ‘స్పోర్ట్స అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్ఏఐ) నుంచి అథారిటీ పదాన్ని తొలగించి స్పోర్ట్స్ ఇండియాగా మార్చాం అని కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ వెల్లడించారు. ‘సాయ్’ని 1984లో స్థాపించారు.
హాకీ చాంపియన్స్ ట్రోఫీ విజేతగా ఆస్ట్రేలియా
బ్రెడా (నెదర్లాండ్స్)లో జరిగిన హాకీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌ను ఓడించిన ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. చాంపియన్స్ ట్రోఫీలో భారత పురుషుల హాకీ జట్టు వరుసగా రెండోసారి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
సిన్సినాటి ఓపెన్ టైటిల్ విజేత జొకోవిచ్
సిన్సినాటి ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టైటిల్ విజేతగా సెర్బియాకి చెందిన నొవాక్ జొకోవిచ్ నిలిచాడు. అమెరికాలోని సిన్సినాటిలో ఆగస్టు 20న జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో జొకోవిచ్ 6-4, 6-4తో రోజర్ ఫెడరర్‌పై విజయం సాధించాడు. దీంతో అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ)లో తొమ్మిది మాస్టర్స్ సిరీస్-1000 టైటిల్స్‌ను గెలుచుకున్న తొలి క్రీడాకారుడుగా జొకోవిచ్ రికార్డు నెలకొల్పాడు.
మారిన్‌కు బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్
స్పెయిన్‌కి చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కరోలినా మారిన్‌కు మహిళల ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ లభించింది. ఈ మేరకు ఆగస్టు 5న చైనాలోని నాన్జింగ్లో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఎనిమిదో ర్యాంకర్ మారిన్ 19-21, 10-21తో మూడో ర్యాంకర్ పీవీ సింధుపై గెలిచి స్వర్ణం దక్కించుకుంది. దీంతో ఈ ఈవెంట్లో మహిళల సింగిల్స్ విభాగంలో మూడు స్వర్ణాలు గెలిచిన ఏకైక ప్లేయర్‌గా మారిన్ గుర్తింపు పొందింది.
2014 ఫైనల్లో లీ జురుయ్ (చైనా)పై, 2015 ఫైనల్లో సైనా నెహ్వాల్ (భారత్)పై గెలిచి ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన మారిన్ 2016 రియో ఒలింపిక్స్ ఫైనల్లో సింధుని ఓడి ంచి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది.
పురుషుల బ్యాడ్మింటన్ చాంపియన్‌గా మొమోటా
పురుషుల ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ టోర్నీలో జపాన్‌కి చెందిన కెంటో మొమోటా విజేతగా నిలిచాడు. ఆగస్టు 5న చైనాలోని నాన్జింగ్లో జరిగిన పురుషుల ఫైనల్లో మూడో ర్యాంకర్ షి యుకి (చైనా)పై 21-11, 21-13తో ప్రపంచ ఏడో ర్యాంకర్ మొమోటా గెలిచి టైటిల్ కైవసం చేసుకున్నాడు. దీంతో ఈ ఈవెంట్లో పురుషుల సింగిల్స్ విభాగంలో ప్లేయర్ టైటిల్ సాధించిన తొలి జపాన్ క్రీడాకారునిగా మొమోటో గుర్తింపు పొందాడు.
రోజర్స్ కప్ విజేత నాదల్
రోజర్స్ కప్ ఏటీపీ మాస్టర్స్-1000 టోర్నీలో స్పెయిన్‌కి చెందిన టెన్నిస్ క్రీడాకారుడు రాఫెల్ నాదల్ విజేతగా నిలిచాడు. కెనడాలోని టొరంటోలో ఆగస్టు 13న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనలో టాప్ సీడ్ నాదల్ 6-2, 7-6 (7/4)తో గ్రీస్‌కి చెందిన స్టెఫానోస్ సిట్సిపాస్‌పై గెలుపొందాడు. 2005, 2008, 2013లలో కూడా 32 ఏళ్ల నాదల్ ఈ టైటిల్‌ను సాధించాడు. ఓవరాల్‌గా నాదల్ కెరీర్లో ఇది 80వ సింగిల్స్ టైటిల్ కాగా మాస్టర్స్ సిరీస్‌లో 33వ టైటిల్.
రోజర్స్ కప్ మహిళల విజేత హలెప్
రోజర్స్ కప్ మహిళల విభాగంలో ప్రపంచ నెంబర్ వన్, రొమేనియా క్రీడాకారిణి సిమోనా హలెప్ విజేతగా నిలిచింది. కెనడాలోని టొరంటోలో ఆగస్టు 13న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో అమెరికాకి చెందిన స్లోన్ స్టీఫెన్స్ పై 7-6(6), 3-6, 6-4తో గెలుపొందింది. దీంతో ఈ ఏడాది మూడో ఏటీపీ టైటిల్‌ను హలెప్ గెలుచుకున్నట్టయింది.