రాష్ట్రీయం
హైదరాబాద్ లో ముఖ్య సదస్సులు
-
హైదరాబాద్‌లో ఫిబ్రవరి 19 నుంచి మూడు రోజులపాటు జరిగిన ఇన్ఫర్మేషన్టెక్నాలజీ వరల్డ్కాంగ్రెస్ను ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ద్వారా కాంగ్రెస్‌ను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. ఈ కాంగ్రెస్ ను వరల్డ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ అలయెన్స్, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్ వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్కామ్), రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించాయి.
-
హైదరాబాద్ లో ఫిబ్రవరి 22 నుంచి మూడు రోజులపాటు 15వ బయో ఆసియా సదస్సు జరిగింది. దీనికి తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారకరామారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
– హైదరాబాద్‌లో ఫిబ్రవరి 26 నుంచి రెండు రోజులపాటు జాతీయ ఇ–పరిపాలన సదస్సు జరిగింది. ఇందులో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార–ప్రజా పంపిణీ శాఖ మంత్రి సీఆర్ చౌధరి, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, యూఐడీఏఐ సీఈవో అజయ్ భూషణ్ పాండే తదితరులు పాల్గొన్నారు.
ఆదిభట్లలో వైమానిక ఉత్పత్తుల పరిశ్రమ
రంగారెడ్డి జిల్లాలోని ఆదిభట్లలో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ) వైమానిక సెజ్ లో టాటా–బోయింగ్ వైమానిక ఉత్పత్తుల పరిశ్రమను 2018 మార్చి 1న కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, టాటా సంస్థల గౌరవ చైర్మన్ రతన్ టాటా, అమెరికా రాయబారి కెన్నత్ జెస్టర్ లతో కలిసి ప్రారంభించారు.
తెలంగాణ బడ్జెట్ 2018-19
ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ 2018–19 సంవత్సరానికి రూ.1,74,453 కోట్ల బడ్జెట్‌ను మార్చి 15న శాసనసభకు సమర్పించారు. గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం బడ్జెట్ అంచనాలు 16.9 శాతం మేర పెరిగాయి.
ముఖ్యాంశాలు:
-
రాష్ట్ర సొంత రాబడులు: రూ.73,751 కోట్లు.
-
కేంద్ర పన్నుల వాటా: రూ.19,207 కోట్లు.
-
ద్రవ్యలోటు: రూ.29,077 కోట్లు.
-
రెవెన్యూ మిగులు: రూ.5,520 కోట్లు.
-
ద్రవ్యలోటు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3.45 శాతం.
ప్రధాన కేటాయింపులు:
-
వ్యవసాయ రంగం: రూ.12,601 కోట్లు
-
సాగునీటి రంగం: రూ.25,000 కోట్లు.
-
విద్యుత్‌రంగం: రూ. 4,393 కోట్లు.
ఒకటి నుంచి పది వరకు తెలుగు తప్పనిసరి
తెలంగాణలో ఒకటి నుంచి పదోతరగతి వరకు తెలుగును తప్పనిసరి చేస్తూ తీసుకొచ్చిన బిల్లుకు శాసనసభ మార్చి 24న ఆమోదం తెలిపింది.
తెలంగాణ – ముఖ్యమైన బిల్లులు
-
డైరెక్టర్జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) ఎంపిక, నియామక బిల్లు–2018ను తెలంగాణ శాసనసభ మార్చి 24న ఆమోదించింది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు పోలీసు డైరెక్టర్ జనరల్(డీజీపీ) నియామక అధికారం పూర్తిగా రాష్ట్రాలకే చెందుతుందని, ఆ మేరకు నూతన చట్టం తీసుకొస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు.
-
ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన, నియంత్రణ బిల్లు–2018 ను తెలంగాణ శాసనసభ మార్చి 28న ఆమోదించింది.
పంచాయతీరాజ్ చట్ట సవరణ, పురపాలక చట్ట సవరణ బిల్లులను తెలంగాణ రాష్ట్ర శాసనసభ మార్చి 29న ఆమోదించింది. పంచాయతీలు, మున్సిపాలిటీల స్వరూపాన్ని మార్చేందుకే నూతన చట్టం తీసుకొస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు.
– తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఏప్రిల్21న ప్రకటించారు.
వీ హబ్ ప్రారంభం
తెలంగాణ ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల కేంద్రం వీహబ్‌ను మార్చి 8న హైదరాబాద్‌లో ప్రారంభించారు.
నూతన పీఆర్సీ
ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల పెంపునకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన వేతన సవరణ కమిషన్(పీఆర్సీ)ను ఏర్పాటు చేస్తూ మే 18న ఉత్తర్వులు జారీ చేసింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి సీఆర్ బిశ్వాల్ చైర్మన్ గా, మరో ఇద్దరు విశ్రాంత ఐఏఎస్‌లు ఉమామహేశ్వర్ రావు, మహ్మద్ రఫత్ అలీ సభ్యులుగా కమిషన్ ఏర్పాటైంది.
ఔషధ నగరికి పర్యావరణ అనుమతులు
రంగారెడ్డి జిల్లా యాచారం, కందుకూరు మండలాల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ ఔషధ నగరి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లభించాయి. కేంద్ర పర్యావరణ నిపుణుల సమీక్షా కమిటీ సిఫార్సు మేరకు మే 19న కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది.
జోన్ల సంస్కరణలు
రాష్ట్రంలో ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
మొదటి జోన్ – కాళేశ్వరం, రెండో జోన్– బాసర, మూడో జోన్– రాజన్న, నాలుగో జోన్– భద్రాద్రి, ఐదో జోన్– యాదాద్రి, ఆరో జోన్– చార్మినార్, ఏడో జోన్– జోగుళాంబ జోన్లుగా నామకరణం చేశారు.
- ఇక మొదటి మల్టీజోన్‌లో కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి జోన్లు
- రెండో మల్టీజోన్‌లో యాదాద్రి, జోగుళాంబ, చార్మినార్ జోన్లు
- దీంతో ఉత్తర తెలంగాణ జిల్లాలను ఒకటో మల్టీ జోన్లో, దక్షిణ తెలంగాణ జిల్లాలను రెండో మల్టీ జోన్లో చేర్చినట్లయింది. జోనల్ స్థాయి, రాష్ట్ర కేడర్ కు మధ్యలో ఉండే పోస్టులను మల్టీ జోనల్ పోస్టులుగా పరిగణిస్తారు.
రైతు బీమా
రైతులందరికీ రూ.5 లక్షల జీవిత బీమా కల్పించేలా రైతు బీమా పథకాన్ని ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ పథకం ఆగస్టు 15 నుంచి అమలవుతుంది. 18 నుంచి 59 ఏళ్ల వయసున్న వారికి బీమా వర్తిస్తుంది.
ప్రొ.కేశవరావు జాదవ్ కన్నుమూత
తెలంగాణ తొలితరం ఉద్యమ నేత, సోషలిస్టు పార్టీ నాయకుడు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్(85) జూన్16న మరణించారు.
స్వచ్ఛ సర్వేక్షణ్– 2018లో తొలి స్థానంలో హైదరాబాద్
స్వచ్ఛ సర్వేక్షణ్– 2018 కింద ఘన వ్యర్థాల నిర్వహణలో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. జూన్23న ఇండోర్ లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి నుంచి మేయర్ బొంతు రామ్మోహన్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. సిద్దిపేట దక్షిణాదిలో ఉత్తమ స్వచ్ఛ పట్టణంగా ఎంపికైంది. ఉత్తమ రాష్ట్రాల ర్యాంకుల్లో తెలంగాణ ఏడో స్థానం, ఏపీ ఐదో స్థానం సొంతం చేసుకున్నాయి.
తెలంగాణ వృద్ధి రేటు 17.2 శాతం
కాగ్గణాంకాల ప్రకారం ఆదాయాభివృద్ధి రేటులో తెలంగాణ 17.2% సగటుతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని సీఎం కార్యాలయం (సీఎంఓ) తెలిపింది.
స్వాతంత్య్ర సమరయోధుడు చంద్రయ్య కన్నుమూత
స్వాతంత్య్ర సమరయోధుడు పడాల చంద్రయ్య (96) జూలై 25న కన్నుమూశారు. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌కు చెందిన చంద్రయ్య రజాకార్లకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేశారు. మహారాష్ట్రలో మిలిటరీ శిక్షణ తీసుకున్న ఆయన గాంధీజీ పిలుపు మేరకు ఉద్యోగాన్ని వదిలి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. చాలా ఏళ్ల పాటు కాంగ్రెస్‌లో ఉన్న చంద్రయ్య కాంగ్రెస్ విధానాలు నచ్చక సోషలిస్టు పార్టీలో చేరారు.
రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని మాజీ ప్రధాని పీవీ నరసింహరావు, అల్గిరెడ్డి కాశీ విశ్వనాథరెడ్డితో కలసి ముల్కనూర్ సహకార గ్రామీణ బ్యాంక్‌ను చంద్రయ్య స్థాపించారు. అలాగే బ్యాంకు వ్యవస్థాపక కార్యదర్శిగా 18 ఏళ్ల పాటు పనిచేశారు.
‘పశుపోషణ – పంచసూత్రాలు’ పుస్తకావిష్కరణ
ఆచార్య వి.ఎన్.విశ్వనాథ రెడ్డి రచించిన ‘పశుపోషణ–పంచసూత్రాలు’ అనే పుస్తకంను ఐఏఎస్ అధికారి డాక్టర్ మన్మోహన్సింగ్ విశాఖపట్నం జిల్లా పాయకరావుపేటలో జూలై 26న ఆవిష్కరించారు. పశువుల జాతి, మేత, ఆరోగ్యం, పునరుత్పత్తి, ఆదాయం వంటి పంచసూత్రాలతో పాటు ఆర్గానిక్ ఎరువుల తయారీ, యంత్రాల వినియోగం వంటి విషయాలను ఈ పుస్తకంలో వివరించారు.
ఎంబీసీలోకి మరో 35 కులాలు
తెలంగాణలోని మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ (ఎంబీసీ) కేటగిరీలోకి మరో 35 కులాలను చేరుస్తూ ప్రభుత్వం జూలై 26న ఉత్తర్వులు జారీ చేసింది. జీవన స్థితిగతులు, సామాజిక నేపథ్యం, సంక్షేమం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఎంబీసీ యాక్ట్-2013 కింద వీటిని చేర్చింది.
ఈ కేటగిరీలో బాలసంతి/బాహుపురి, బుడబుక్కల, దాసరి, దొమ్మర, గంగిరెద్దుల, జంగం, జోగి, కాటిపాపల, మొండిబండ/మొండివరు, వంశరాజ్/పిచ్చిగుంట్ల, పాముల, పర్ది, పంబలా, పెద్దమ్మవండ్లు/దేవరవండ్లు/ఎల్లమ్మవండ్లు/ముత్యాలమ్మవండ్లు/దమ్మాలి, వీరముష్టి/వీరబద్రీయ, గుడాలా, కంజారా–బట్ట, రెడ్డిక/కెంపర, మొండెపట్ట, నొక్కర్, పర్కిముగ్గుల, యాట, చొపేమరి, కైకడి, జోషినందివాలాస్, మందుల, కునపలి, పట్ర, పాల ఎక్రాయి/ఎకిల/వ్యాకుల/ఎకిరి/నాయినవారు/పాలేగారు/తొలగరి/కావలి, రాజన్నలా/రాజన్నలు, బుక్కఅయ్యవారు, గొట్రాలా, కస్కిపడి/కస్కిపుడి, సిద్దుల, సికిల్‌గర్/సైకల్‌గర్, అనాథలు, తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను చేర్చారు.
హైదరాబాద్‌లో తొలి బ్లాక్‌చైన్ కాంగ్రెస్
హైదరాబాద్, గోవాలో తొలి అంతర్జాతీయ బ్లాక్‌చైన్ కాంగ్రెస్ జరగనుంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ సదస్సును ఆగస్టు 3, 4 తేదీల్లో హైదరాబాద్‌లో, 5న గోవాలో నిర్వహించనున్నట్లు తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ జూలై 26న వెల్లడించారు. నీతి ఆయోగ్, తెలంగాణ, గోవా రాష్ట్ర ప్రభుత్వాలు, న్యూక్లియస్ విజన్ లు సంయుక్తంగా నిర్వహించే ఈ సదస్సులో ఐటీ పరిశ్రమలు, స్టార్టప్‌ల యజమానులతోపాటు మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు.
బిట్ కాయిన్ అనే క్రిప్టో కరెన్సీ క్రయవిక్రయాలకు సంబంధించిన లావాదేవీలను అత్యంత సురక్షితంగా భద్రపరిచేందుకు బ్లాక్‌చైన్ సాఫ్ట్‌వేర్‌ను ‘ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ ప్రూఫ్ లెడ్జర్’గా రూపొందించారు
ఐటీడీఏ తొలి ఇంగ్లిష్ మీడియం స్కూల్ ప్రారంభం
తెలంగాణలో ఇంటిగ్రేటేడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఐటీడీఏ) తొలి ఇంగ్లిష్ మీడియం ప్రాథమిక పాఠశాల జూలై 26న ప్రారంభమైంది. ఆదిలాబాద్ రూరల్ మండలం చించుఘాట్ పంచాయతీలోని న్యూ చించుఘాట్‌లో కలెక్టర్ దివ్యదేవరాజన్ ఈ స్కూల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులతో ‘నివ బాతల్ ఫోరొల్ (నీ పేరు ఏంటీ)’ అని గోండి భాషలో పలకరించారు.
మై బాడీ ! వాట్ ఐ సే గోస్’ పుస్తకావిష్కరణ
వరల్డ్ విజన్ అనే స్వచ్ఛంద సేవా సంస్థ రూపొందించిన ‘మై బాడీ! వాట్ ఐ సే గోస్’ (నా శరీరం నేను చెప్పినట్లు నడుచుకుంటుంది) అనే పుస్తకంను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సచివాలయంలో జూలై 25న ఆవిష్కరించారు. బాలికలను లైంగిక వేధింపుల నుంచి కాపాడటం ప్రతి పౌరుని బాధ్యత అనే ప్రచార ఉద్యమంలో భాగంగా ఈ పుస్తకాన్ని రూపొందించారు. వరల్డ్ విజన్ పనిచేసే గ్రామాలు, పాఠశాలల్లో ఈ పుస్తకాన్ని ఉచితంగా అందిస్తామని సంస్థ ప్రతినిధి తబితవాణి తెలిపారు. పిల్లల వ్యక్తిగత శారీరక భద్రత, పరిశుభ్రత వంటి అంశాలపై అవగాహ న కల్పించే విధంగా ఈ పుస్తకాన్ని రూపొందించారు.
ఉస్మానియాలో వాణిజ్య సదస్సు
హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 71వ అఖిల భారత వాణిజ్య సదస్సును నిర్వహించనున్నారు. ఇన్నోవేషన్, ఉద్యోగ కల్పన, స్థిరమైన అభివృద్ధి అనే అంశాలపై డిసెంబర్ 20 నుంచి 22 వరకు సదస్సును నిర్వహించనున్నట్లు సదస్సు కార్యదర్శి ప్రొ.వెంకటేశ్వర్లు జూలై 27న తెలిపారు. ఈ సదస్సులో పరిశోధన విద్యార్థులు, వ్యాపార, పారిశ్రామిక, ఆర్థిక వేత్తలతో సహా దాదాపు 2 వేల మంది పాల్గొననున్నారు. 2017లో 70వ సదస్సును జైపూర్‌లో నిర్వహించారు.
ఉత్తమ పరిశోధనకు ఎంఎంషా పురస్కారం
కామర్స్, బిజినెస్ మేనేజ్మెంట్ రంగంలో అత్యున్నత స్థాయిలో పరిశోధనలు చేసిన వారికి ప్రొఫెసర్ ఎంఎం షా పురస్కారాన్ని వాణిజ్య సదస్సులో అంద జేయనున్నారు. 2012లో ఎంఎం షా తనయుడు అనీల్ షా కోటి రూపాయలను విరాళంగా అందచేసి, తన తండ్రి పేరు మీద ఈ అవార్డును స్థాపించారు.
పెద్దపులి ఫోటోతో పోస్టల్ స్టాంప్ విడుదల
దేశంలో తొలిసారిగా పెద్దపులి ఫొటోతో ఉన్న పోస్టల్ స్టాంప్‌ను కేంద్ర ప్రభుత్వం జూలై 27న విడుదల చేసింది. తెలంగాణలో కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలోని పెంచికల్పేట్ అటవీ ప్రాంతంలో ఉంటున్న ఫాల్గుణ అనే పెద్దపులి ఫోటోను ఈ స్టాంప్‌పై ముద్రించారు.
ఉద్యాన వర్శిటీల్లో వైఎస్సార్ వర్శిటీకి అగ్రస్థానం
దేశంలో ఉన్న ఉద్యాన యూనివర్సిటీలలో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన యూనివర్సిటీకి అగ్రస్థానం లభించింది. ఈ మేరకు న్యూఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) 2018 ఏడాది ర్యాంకులు జూలై 28న ప్రకటించింది. వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయాల పనితీరు, రైతులకు అందించిన ప్రయోజనాల ఆధారంగా ఐసీఎఆర్ ఈ ర్యాంకులను కేటాయించింది.
సినారె పేరిట జాతీయ పురస్కారం
జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి పేరిట ‘డాక్టర్ సి.నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కారం’ ను ప్రవేశపెడుతున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు జూలై 28న వెల్లడించారు. సుశీలా నారాయణరెడ్డి ట్రస్టు తరఫున ఏటా సినారె జయంతి రోజున (జులై 29) ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. పుర స్కారం కింద రూ.3 లక్షల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందిస్తారు. 2019లో హైదరాబాద్‌లో తొలి పురస్కారం ను బహుకరిస్తారు.
ప్రభుత్వ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం
తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జూలై 28న నిర్ణయించింది. ఈ మేరకు పథకం అమలుకు సాధ్యాసాధ్యాలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం పరిశీలిస్తుంది. ఇప్పటికే పథకం అమలు బాధ్యతలను అక్షయపాత్రకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం ద్వారా ప్రభుత్వ జూనియర్ కాలేజీ, మోడల్ స్కూల్లోని ఇంటర్మీడియట్ విద్యార్థులు, డీఈడీ, బీఈడీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో ఉన్న దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజన సదుపాయం పొందనున్నారు.
పర్యాటక ప్రాంతంగా శామీర్‌పేట చెరువు
హైదరాబాద్–కరీంనగర్ రాజీవ్ రహదారి పక్కన ఉన్న శామీర్‌పేట చెరువు, దాని పరిసర ప్రాంతాలను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని తెలంగాణ ప్రభుత్వం జూలై 30న నిర్ణయించింది. ఇందుకోసం ఏడాది పొడవునా చెరువులో నీరు ఉండేలా చర్యలు చేపట్టడంతోపాటు, పర్యాటకుల ఆహ్లాదం, ఆనందం కోసం అన్ని ఏర్పాట్లను చేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించే కొండ పోచమ్మ రిజర్వాయర్ ద్వారా శామీర్‌పేట చెరువుకు, అక్కడి నుంచి కాలువ ద్వారా బస్వాపూర్ రిజర్వాయర్‌కు నీటిని అందించనున్నారు.
హైదరాబాద్‌లో రాంజీగోండు మ్యూజియం
హైదరాబాద్‌లోని బాపూఘాట్లో తెలంగాణ తొలితర గిరిజన స్వాతంత్య్ర సమరయోధుడు రాంజీగోండు పేరుతో గిరిజన మ్యూజియంను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఎకరన్నర స్థలంలో రూ.15 కోట్లతో ఈ మ్యూజియంను నిర్మిస్తున్నట్లు జూలై 30న కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మ్యూజియంలో గిరిజనులకు సంబంధించిన చరిత్ర, ఆనాటి స్వాతంత్య్ర పోరాట దృశ్యాలు, తెలంగాణ గిరిజన యోధులకు ప్రాధాన్యం కల్పించనున్నారు. ఇప్పటికే గుజరాత్లో నిర్మించిన గిరిజన మ్యూజియంలో రాంజీగోండు, కుమురంబీం లకు ప్రత్యేక స్థానం కల్పించారు.
1857 సిపాయి తిరుగుబాటు సమయంలో గిరిజనుల హక్కుల కోసం బ్రిటిష్, నిజాం సైన్యం పెత్తనాన్ని రాంజీగోండు ఎదురించి సైన్యానికి పట్టుబడ్డారు. దేశ ప్రథమ స్వాతంత్య్ర పోరాటం తరువాత బ్రిటిష్–నిజాం నిరంకుశత్వాలను ఎదురించిన తొలి సమరయోధుడిగా రాంజీగోండు గుర్తింపు పొందారు.
పీవోఎస్ పరికరం ఆవిష్కరణ
హైదరాబాద్‌కు చెందిన పేమెంట్ సొల్యూషన్స్ కంపెనీ ‘పేస్విఫ్’ పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) పరికరాన్ని విడుదల చేసింది. ఈ మేరకు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ వ్యవస్థ కలిగిన పీవోఎస్ పరికరాన్ని ఐటీ శాఖ మంత్రి కె. తారక రామరావు జూలై 18న ఆవిష్కరించారు. ఈ పరికరం ద్వారా క్రెడిట్, డెబిట్ కార్డులు, వాలెట్స్, ఆన్లైన్ పేమెంట్, యూపీఐ, భారత్ క్యూఆర్ వంటి అన్ని రకాల పేమెంట్ ఆప్షన్లను ఉపయోగించుకోవచ్చు.
ఏపీ సీఐడీ చీఫ్‌గా అమిత్‌గార్గ్
ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సీఐడీ) చీఫ్‌గా అమిత్‌గార్గ్ బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు గుంటూరు జిల్లా మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యలయంలో ద్వారకా తిరుమలరావు నుంచి ఆయన జూలై 19న బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు సీఐడీ చీఫ్‌గా ఉన్న తిరుమలరావు విజయవాడ నగర పోలీస్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు.
సంఘసేవకుడు అగ్నిగుండాల కన్నుమూత
ప్రముఖ సంఘ సేవకుడు అగ్నిగుండాల వెంకట రంగారావు (105) హైదరాబాద్‌లో జూలై 20న కన్నుమూశారు. గుంటూరు జిల్లా అగ్నిగుండాల గ్రామంలో జన్మించిన ఆయన ఇంజనీరింగ్ చదివారు. భూస్వామి అయిన రంగారావు తనకున్న భూములను నిరుపేదలకు పంచడంతోపాటు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు.
ఎస్ఆర్పీ ప్రాజెక్టుకు ఏపీలో మూడు స్టేషన్లు
స్టేషన్ రీ డెవలప్మెంట్ ప్రాజెక్టు(ఎస్ఆర్పీ)కు ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు రైల్వే స్టేషన్లు ఎంపికయ్యాయి. ఈ మేరకు గుంటూరు, కర్నూలు, గుంతకల్ స్టేషన్లను రైల్వేశాఖ జూలై 21న ఎంపిక చేసింది. స్టేషన్లలో ప్రయాణీకులకు అత్యాధునిక సౌకర్యాలను రైల్వేశాఖ కల్పిస్తే బడ్జెట్ హోటళ్లు, మల్టీప్లెక్స్ థియేటర్లను ప్రైవేటు సంస్థలు నిర్మిస్తాయి. ఇందుకోసం రూ.120 కోట్లు మంజూరు చేయనున్నారు.
రైల్వేల్లో ప్రైవేటు పెట్టుబడులు ఆహ్వానించేందుకు స్టేషన్ రీ డెవలప్మెంట్ (ఎస్ఆర్పీ) కార్యక్రమంను రైల్వే మంత్రిత్వ శాఖ 2017లో ప్రారంభించింది. కార్యక్రమంలో భాగంగా తొలి దశలో దక్షిణ మధ్య రైల్వేలో సికింద్రాబాద్, విజయవాడ రైల్వేస్టేషన్లను ఎంపిక చేశారు. ఇప్పటికే ప్రాజెక్టులో భాగంగా విజయవాడ స్టేషన్‌కు రూ.40 కోట్లు కేటాయించగా తిరుపతి స్టేషన్‌ను రూ.400 కోట్లు, నెల్లూరు స్టేషన్‌ను రూ.40 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. దేశం మొత్తం మీద 23 స్టేషన్లను ఎస్‌ఆర్‌పీకి ఎంపిక చేశారు.
అంతర్జాతీయ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన
‘అమరావతి అంతర్జాతీయ స్పోర్ట్స్ కాంప్లెక్స్’కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూలై 24న శంకుస్థాపన చేశారు. విజయవాడలోని విద్యాధరపురంలో రూ.60 కోట్లతో ఈ కాంప్లెక్స్‌ను నిర్మిస్తున్నారు. అలాగే ఒలింపిక్స్‌లో పతకాలను సాధించేందుకు పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చేందుకు రూపొందించిన ‘గాండీవ’ ప్రాజెక్టును చంద్రబాబు ప్రారంభించారు.
గాండీవ ప్రాజెక్టు నిర్వహణకు భారత క్రికెట్ మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లేకు చెందిన టెన్విక్ సంస్థతో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఒప్పందం కుదుర్చుకుంది. అదే విధంగా పాంచజన్య ప్రాజెక్టు పేరుతో విశాఖపట్నం, నెల్లూరు, నర్సారావుపేట, గుడివాడ, అనంతపురంలో ఏర్పాటు చేసిన శాప్ స్పోర్ట్స అకాడమీలను లాంఛనంగా ప్రారంభించారు.
సూక్ష్మ సేద్యంలో తెలంగాణకు పదో స్థానం
దేశవ్యాప్తంగా అత్యధికంగా సూక్ష్మ సేద్యం చేస్తున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణకు పదో స్థానం దక్కింది. రాష్ట్రంలో 3. 31 లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం అందుబాటులో ఉంది. 2018 ఫిబ్రవరి నాటికి లక్ష భూసార కార్డులను మాత్రమే ప్రభుత్వం రైతులకు అందజేసింది. ఈ మేరకు జాతీయ వ్యవసాయ గణాంక నివేదికను కేంద్ర వ్యవసాయ శాఖ జూలై 14న విడుదల చేసింది.
ఈ జాబితాలో 44.71 లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యాన్ని రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చి రాజస్థాన్ మొదటి స్థానంలో ఉంది. అలాగే 35.31 లక్షల ఎకరాలతో మహారాష్ట్ర, 28.45 లక్షల ఎకరాలతో గుజరాత్, 7.1 లక్షల ఎకరాలతో ఛత్తీస్‌గఢ్‌లు వరుసగా రాజస్థాన్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2.3 కోట్ల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం అందుబాటులో ఉంది.
మరోవైపు 1950- 51లో వరి ఉత్పాదకత హెక్టారుకు 6.68 క్వింటాళ్లుంటే, 2016-17 నాటికి 25.5 లక్షలకు చేరుకుంది. అలాగే 1980-81లో వంట నూనెల తలసరి అందుబాటు 3.8 కిలోలుండగా 2015-16లో 17.7 కిలోలకు పెరిగింది. 1980-81లో పంచదార తలసరి అందుబాటు 7.3 కిలోలు ఉండగా 2015-16లో 19.4 కిలోలకు చేరింది.
పోతార్లంక ఎత్తిపోతల పథకం ప్రారంభం
గుంటూరు జిల్లా కొల్లూరు మండలంలోని పోతార్లంక ఎత్తిపోతల పథకంను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జూలై 16న ప్రారంభించారు. రూ.49.68 కోట్లతో నిర్మించిన ఈ పథకం ద్వారా 4,995 ఎకరాలకు సాగునీటిని అందించనున్నారు. అనంతరం కొల్లూరు మండలం దోనేపూడి గ్రామంలో గ్రామ దర్శిని, కొల్లూరు జిల్లాపరిషత్ హైస్కూల్లో గ్రామ వికాసం కార్యక్రమాన్ని ప్రారంభించి సభలు నిర్వహించారు.
గుంటూరు జిల్లా వాసికి ‘ఆధునిక రైతు’ పురస్కారం
గుంటూరు జిల్లా యాజలికి చెందిన లక్ష్మీనరసింహకు ‘ఆధునిక రైతు’ పురస్కారం లభించింది. సాఫ్ట్వేర్ రంగాన్ని వీడి గ్రామీణ ప్రాంతాల్లో పర్యావరణ అనుకూలమైన, ఆర్థికంగా ఉపయుక్తమైన వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నందుకు ఆయనకు కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది. ఈ మేరకు ఢిల్లీలో జూలై 17న జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్మీనరసింహకు అవార్డును ప్రదానం చేశారు.
ఒలింపిక్స్‌లో పతకాల సాధనకు ‘ప్రాజెక్టు గాండీవ’
ఒలింపిక్స్‌లో పతకాలు సాధించడమే లక్ష్యంగా ‘ప్రాజెక్టు గాండీవ’ పేరుతో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా అన్ని పాఠశాలల్లో ప్రతిభావంతులను ఎంపిక చేసి గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ ఇప్పిస్తారు. అలాగే ‘పాంచజన్య’ కింద బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, హాకీ, సైక్లింగ్, ఖోఖో, కబడ్డీ, హ్యాండ్‌బాల్, వాలీబాల్ తదితర క్రీడల్లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు.
కర్ణాటకలో 34 వేల కోట్ల రైతు రుణ మాఫీ
కర్ణాటకలో రైతులకు రూ.34 వేల కోట్ల రుణమాఫీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి జూలై 5న ప్రకటించారు. ఇందులో భాగంగా 2017 డిసెంబర్ 31 వరకు రూ.2 లక్షల లోపు ఉన్న అన్ని వ్యవసాయ రుణాలను మాఫీ చేయనున్నారు. ఈ మేరకు జేడీఎస్–కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ను కుమారస్వామి ప్రవేశపెట్టారు.
తెలంగాణలో గిరిబాల వికాస్ పథకం ప్రారంభం
తెలంగాణలో గిరిజన విద్యార్థినీ, విద్యార్థుల సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణకై ఉద్దేశించిన ‘గిరిబాల వికాస్’ పథకం ప్రారంభమైంది. ఈ పథకాన్ని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఏటూరు నాగారం పరిధిలోని గిరిజన పాఠశాలల్లో గిరిజన సంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ జూలై 6న ప్రారంభించారు. దీని ద్వారా విద్యార్థుల అనారోగ్య, ఇతర సమస్యల్ని తొలిదశలోనే గుర్తించి పరిష్కరిస్తారు.
కొలకలూరి ఇనాక్ కు రావిశాస్త్రి అవార్డు
సుప్రసిద్ధ కథ, నవల, నాటక రచయిత, విమర్శకుడు కొలకలూరి ఇనాక్‌కు రావిశాస్త్రి లిటరరీ ట్రస్ట్ వార్షిక పురస్కారం లభించింది. సాహితీ సృజన, పరిశోధన, విమర్శ వంటి అంశాల్లో కృషి చేసినందుకు ఆయనకు ఈ అవార్డు దక్కింది. ఈ మేరకు ట్రస్ట్ సభ్యుడు, రావిశాస్త్రి తనయుడు రాచకొండ ఉమాకుమారశాస్త్రి జూలై 9న చెప్పారు. ఇనాక్ ఆశాజ్యోతి, ఆది ఆంధ్రుడు, భుజంగరాయ చరిత్ర, షరామామూలే, ఊరబావి మొదలైన కవితా, కథా సంపుటాలు, నాటకాలతో సహా దాదాపు వంద పుస్తకాలను వెలువరించారు.
2016 నుంచి రావిశాస్త్రి అవార్డులను అందజేస్తుండగా 2016లో రామతీర్థకు, 2017లో పతంజలి శాస్త్రికి ఈ అవార్డులను ఇచ్చారు. రావిశాస్త్రి జయంతి జూలై 30న అవార్డును ప్రదానం చేస్తారు.
హైదరాబాద్‌లో కారోకు శంకుస్థాపన
బేగంపేటలోని పాత విమానాశ్రయంలో పౌర విమానయాన పరిశోధన సంస్థ (కారో) ఏర్పాటుకు ఆ శాఖా మంత్రి సురేశ్ ప్రభు ఈనెల 5న శంకుస్థాపన చేశారు. ఎయిర్ నావిగేషన్ సేవలు (ఏఎన్ఎస్), ఎయిర్ స్పేస్, ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ తదితర విభాగాల్లో పరిశోధనలు జరిపి దేశీయ సొల్యూషన్లు అభివృద్ధి చేయడానికి కారో తోడ్పడుతుంది.
విజయవాడలో ‘ఆరుగాలం’ పుస్తకావిష్కరణ
వ్యవసాయ రంగ నిపుణుడు, పార్లమెంటు మాజీ సభ్యుడు డాక్టర్ యలమంచిలి శివాజీ రచించిన ‘ఆరుగాలం’ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు విజయవాడలో జూలై 8న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అన్నం పెట్టే చేతులకు ఊతమివ్వాలే తప్ప రాజకీయాలు తగదని ఆయన సూచించారు. ఈ పుస్తకాన్ని రైతునేస్తం ఫౌండేషన్ ప్రచురించింది.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీకి మొదటి ర్యాంకు
2017 సంవత్సరానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈవోడీబీ)లో 98.42 శాతం స్కోర్‌తో ఆంధ్రప్రదేశ్ మొదటి ర్యాంకును కైవసం చేసుకుంది. ఈ జాబితాలో 98.33 శాతం స్కోర్ సాధించి తెలంగాణ రెండో ర్యాంకు పొందగా తర్వాతి స్థానాల్లో హర్యానా, ఝార్ఖండ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, రాజస్తాన్ రాష్ట్రాలు నిలిచాయి. ఈ మేరకు కేంద్ర వాణిజ్య శాఖ కు చెందిన ఇండస్ట్రియల్ పాలసీ, ప్రమోషన్ విభాగం(డీఐపీపీ), ప్రపంచ బ్యాంకు భాగస్వామ్యంతో రూపొందించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులను జూలై 10న విడుదల చేశారు. 2016 ఈవోడీబీ జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాలు తొలిస్థానాన్ని పంచుకున్నాయి.
హైదరాబాద్‌లో యూఏఈ దౌత్య కార్యాలయం
యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దౌత్య కార్యాలయంను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నారు. యూఏఈ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయేద్ అల్ నహ్యాన్ జూన్ 28న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నగరంలో తమ దౌత్య కార్యాలయం ఏర్పాటుకు షేక్ అబ్దుల్లా సానుకూలత తెలిపారు.
గట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన
జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలం పెంచికలపాడు వద్ద నిర్మించనున్న గట్టు ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు జూన్ 29న శంకుస్థాపన చేశారు. కరువు పీడిత ప్రాంతమైన గట్టు పరిధిలో 33 వేల ఎకరాలకు కృష్ణా నీటిని అందించేందుకు రూ. 553.98 కోట్లతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. అలాగే తుమ్మిళ్ల ఎత్తిపోతల పనులను సీఎం పరిశీలించారు.
వైద్యారోగ్యంలో తెలంగాణకు 12వ ర్యాంకు
వైద్యారోగ్య రంగంపై జాతీయ స్థాయిలో నీతి ఆయోగ్ మొదటిసారిగా నిర్వహించిన ‘బేస్‌లైన్ ర్యాంకింగ్ అండ్ రియల్ టైం’ సర్వేలో తెలంగాణ 12వ ర్యాంకు పొందింది. దేశంలో 101 జిల్లాలో నిర్వహించిన ఈ సర్వే వివరాలను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు విశ్లేషించాయి. ఆరోగ్యం, పోషకాహారం, నవజాత శిశువుల ఆరోగ్యం, పిల్లల ఎదుగుదల, మౌలిక సదుపాయాల వంటి 13 అంశాలపై ఆయా జిల్లాల్లో సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో జిల్లాల వారీగా ఖమ్మం జిల్లా పదకొండో ర్యాంకు సాధించగా భూపాలపల్లి జిల్లా 20, ఆసిఫాబాద్ జిల్లా 100 ర్యాంకులో నిలిచాయి.
రాష్ట్రంలో ప్రతి వెయ్యి మంది నవజాత శిశువుల్లో మరణాల సంఖ్య 23గా ఉందని నివేదిక తెలిపింది. లింగ నిష్పత్తిలో ప్రతి వెయ్యి మంది బాలురకు 918 మంది బాలికలు ఉన్నారు. రాష్ట్రంలో జరిగే ప్రసవాల్లో 85.35 శాతం ప్రసవాలు ఆస్పత్రుల్లో జరుగుతున్నాయి. ప్రతి లక్ష మందిలో టీబీ రోగులు 123 మంది ఉండగా టీబీ చికిత్సలను విజయవంతం చేయడంలో తెలంగాణ వెనుక బడింది.
అమరావతిలో టెలీమెడికాన్ 2018 సదస్సు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నవంబర్ 3న 14వ అంతర్జాతీయ టెలిమెడికాన్ 2018’ సదస్సుని నిర్వహించనున్నట్లు టెలీమెడికాన్ 2018 ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్, సైంటిస్ట్ డాక్టర్ మూర్తి రేమళ్ల జూన్ 30న తెలిపారు. టెలీమెడిసన్పై నిర్వహించే ఈ సదస్సులో వైద్యులు, టెక్నాలజీ ప్రొఫెషనల్స్, పాలసీ మేకర్స్, అడ్మినిస్ట్రేటర్స్ వంటి వారు 800 మందికిపైగా పాల్గొననున్నారు.
‘మిడిల్ కొలాబ్’ ప్రాజెక్టుకు ఏపీ, తెలంగాణ ఆమోదం
గోదావరి బేసిన్లో ఎగువన ఒడిశా చేపడుతున్న మిడిల్ కొలాబ్ ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు జూలై 3న ఆమోదం తెలిపాయి. దీంతో ప్రాజెక్టుకు సాంకేతిక అనుమతులు ఇవ్వాలని గోదావరి బోర్డు నిర్ణయించింది. గోదావరి సబ్ బేసిన్లో ప్రధాన ఉపనదిగా ఉన్న ఇంద్రావతిపై మిడిల్ కొలాబ్ బహుళార్థ సాధక ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. తెలంగాణ నీటి వాటాకు గండికొట్టేలా ఒడిశా ప్రభుత్వం మిడిల్ కొలాబ్ చేపడుతోందని తెలంగాణ తొలుత అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రస్తుతం గోదావరి బోర్డు అధ్యక్షుడిగా హెచ్‌కే సాహూ ఉన్నారు.
తెలంగాణలో బ్లాక్‌చైన్ డిస్ట్రిక్ట్
దేశంలోనే తొలిసారిగా బ్లాక్‌చైన్ డిస్ట్రిక్ట్‌ను తెలంగాణలో ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లో ఆగస్టు 3న జరిగిన ఇంటర్నేషనల్ బ్లాక్‌చైన్ కాంగ్రెస్‌లో టెక్నాలజీ కంపెనీ టెక్ మహీంద్రా, తెలంగాణ ఐటీ శాఖ ఒప్పందం కుదుర్చుకున్నాయి. అలాగే నూక్లియస్ విజన్, ఎలెవన్01 ఫౌండేషన్ ఈ ప్రాజెక్టులో పాలుపంచుకోనున్నాయి.
కాంగ్రెస్‌లో ప్రసంగించిన ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు విద్యార్హత పత్రాల జారీలో బ్లాక్‌చైన్ టెక్నాలజీని వినియోగించనున్నట్టు తెలిపారు. పైలట్ ప్రాజెక్టు కింద 10వ తరగతి, ఇంటర్ విద్యార్థులకు సర్టిఫికెట్లు జారీ చేస్తామని చెప్పారు. విద్యార్హతల ధ్రువీకరణ పత్రాల సమాచారంతోపాటు పలు అంశాలకు సంబంధించిన సమాచారాన్ని బ్లాక్‌చైన్ ఆధారంగా భద్రపరుస్తారు.
తుమ్మలూరులో ప్లాస్టిక్ పార్కు
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా తుమ్మలూరులో 110 ఎకరాల్లో ప్లాస్టిక్ పార్కును ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ మంత్రి కె తారక రామారావు ఆగస్టు 3న తెలిపారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో నాలుగు రోజుల పాటు జరగనున్న ఐప్లెక్స్ (ఇంటర్నేషనల్ ప్లాస్టిక్స్ ఎక్స్పొజిషన్ )-2018ను ప్రారంభించిన కేటీఆర్ ఈ మేరకు వెల్లడించారు. ఈ ప్లాస్టిక్ పార్కును టాప్మా (తెలంగాణ అండ్ ఏపీ ప్లాస్టిక్స్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్) తో కలిసి ఏర్పాటు చేస్తున్నారు
జీహెచ్ఎంసీలో డీఆర్ఎఫ్
అనుకోని విపత్తులు, ఆకస్మిక ప్రమాదాలు జరిగినప్పుడు నష్టనివారణ చర్యలు చేపట్టేందుకు హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ)లో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(డీఆర్ఎఫ్)ను ఏర్పాటు చేశారు. డీఆర్ఎఫ్ విభాగాన్ని పరిశ్రమలు, ఐటీ, మునిసిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ఆగస్టు 4న ప్రారంభించారు. దీంతో డీఆర్ఎఫ్ ఏర్పాటైన తొలి నగరంగా హైదరాబాద్ నిలవగా ముంబై తరువాత ఈవీడీఎం ఏర్పాటు చేసిన కార్పొరేషన్‌గా జీహెచ్ఎంసీ గుర్తింపు పొందింది.
అగ్ని ప్రమాదాలు, భవనాలు కూలినప్పుడు, వరదలు ఇతరత్రా ప్రమాద సమయాల్లో అన్ని శాఖలు సమన్వయంతో ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా డీఆర్ఎఫ్ పనిచేస్తుంది.
అనంతపురంలో సెంట్రల్ వర్శిటీ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ‘సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ ప్రారంభమైంది. జేఎన్టీయూ–అనంతపురంలోని ఇంక్యుబేషన్ కేంద్రంలో ఏర్పాటు చేసిన వర్శిటీ తాత్కాలిక క్యాంపస్‌ను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆగస్టు 5న ప్రారంభించారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లాలోని బుక్కరాయసముద్రం మండలం జంతలూరు వద్ద 460 ఎకరాల్లో రూ.1,000 కోట్లతో శాశ్వత క్యాంపస్‌ను నిర్మించేందుకు కృషి చేస్తామని జవదేకర్ చెప్పారు.
హై ఎనర్జీ డెన్సిటి స్టోరేజ్ డివైజ్ ఆవిష్కరణ
ప్రపంచంలోనే తొలిసారిగా హై ఎనర్జీ డెన్సిటి స్టోరేజ్ డివైజ్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గుంటూరు జిల్లా ఉండవల్లిలో ఆగస్టు 7న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విశాఖపట్నంలో వంద ఎకరాల్లో ఎనర్జీ స్టోరేజ్ పార్క్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు చెప్పారు. ఈ ఎనర్జీ స్టోరేజ్ డివైస్‌ను భారత్ ఎనర్జీ స్టోరేజ్ టెక్నాలజీ(బీఈఎస్‌టీ) ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసింది. వ్యవసాయం, పరిశ్రమలు, రవాణా, టెలికం, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో ఎనర్జీ స్టోరేజ్‌కి అత్యధిక ప్రాధాన్యత ఉంది.
దూబగుంటలో కలాం ట్రిపుల్ ఐటీకి శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా పామూరు మండలం దూబగుంట వద్ద అబ్దుల్ కలాం ట్రిపుల్ ఐటీకి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగస్టు 7న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు లక్ష్యాన్ని ఛేదించి ఉన్నతస్థాయికి చేరుకుని రాష్ట్రాన్ని వినూత్న ఆవిష్కరణల కేంద్రంగా ఆవిష్కరింపజేయాలని చంద్రబాబు అన్నారు.
హైదరాబాద్‌లో ఐకియా స్టోర్ ప్రారంభం
స్వీడన్‌కు చెందిన అంతర్జాతీయ ఫర్నిచర్ సంస్థ ఐకియా భారత్‌లో తన మొదటి స్టోర్‌ను హైదరాబాద్‌లో ఆగస్టు 9న ప్రారంభించింది. ఈ స్టోర్‌ను హైదరాబాద్‌లోని హైటెక్ సిటీకి సమీపంలో రూ.1,000 కోట్ల వ్యయంతో 4,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఈ స్టోర్‌లో 7,500 రకాల ఫర్నిచర్, ఫర్నిషింగ్, వంటింటి సామగ్రిని విక్రయిస్తారు. అలాగే దేశంలో అతిపెద్దదైన ఒకేసారి వెయి్య మంది కూర్చునే సామర్థ్యం ఉన్న రెస్టారెంట్‌ను ఐకియా స్టోర్‌లో ఏర్పాటు చేశారు.
దేశంలో మొత్తం 40 నగరాల్లో ఐకియా ఔట్లెట్లను ఏర్పాటు చేయాలని ఆ సంస్థ నిర్ధేశించుకుంది. ఇందులో భాగంగా 2019లో ముంబై స్టోర్‌ను అందుబాటులోకి తేనున్నారు. అలాగే బెంగళూరు, గురుగ్రామ్, అహ్మదాబాద్, పుణే, చెన్నై, కోల్‌కతా, సూరత్‌లలో ఐకియా స్టోర్లను ఏర్పాటు చేస్తామని ఐకియా గ్రూప్ సీఈవో జాస్పర్ బ్రాడిన్ తెలిపారు.