కరోనా కట్టడికి దారి చూపిన ధారావి !!

ప్రపంచాన్ని మొత్తం కరోనా కమ్మేస్తున్న పరిస్థితిలో.. ఈ మహమ్మారిని నియంత్రణ చర్యలతో తరిమికొట్టే మార్గాల కోసం అంతా అన్వేషిస్తున్నారు. ప్రమాదకర వైరస్ ని అసలు కట్టడి చేయడం సాధ్యమేనా అనే సందేహం, భయం పరిశోధకుల నుంచి కూడా వ్యక్తమైంది. ఈ సందర్భంలో.. పక్కా ప్రణాళికలతో వ్యవహరిస్తే వైరస్ ని నియంత్రించడం, ఇన్ఫెక్షన్ వ్యాప్తిని అరికట్టవచ్చని నిరూపించింది.. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడైన ముంబైలోని ధారావి. మొదట్లో కరోనాతో ఆగమాగమై పటిష్ఠ చర్యలతో తేరుకున్న ఇటలీ, స్పెయిన్, దక్షిణ కొరియా సరసన ఆత్మవిశ్వాసంతో నిలిచింది.. ధారావి.

ఇంతకీ ధారావి చేపట్టిన చర్యలేంటి ? కేవలం 2.16 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో 8 లక్షల జనాభా కలిగిన ఆ ప్రాంతాన్ని కరోనా కకావికలం చేస్తుందని అంతా ఆందోళన చెందారు. అగ్గిపెట్టెల్లాంటి ఒక్కో ఇంట్లో 8 నుంచి 10 మంది నివసించే చోట కరోనా ఎంత మందిని బలితీసుకుంటుందో అని భయపడ్డారు. ఏప్రిల్ లో మొదటి పాజిటివ్ కేసు నమోదైంది మొదలు.. కేవలం ముంబై నగరమే కాకుండా దేశం మొత్తానికి ధారావి గురించి గుబులు మొదలైంది. ఎక్కువగా నిరక్ష్యరాసులు, కార్మికులు, కూలీలతో నిండిన ఆ ప్రాంతంలో భౌతిక దూరం, హోమ్ ఐసోలేషన్ పాటించడం కష్టమని.. ఇక తీవ్ర ప్రాణ నష్టం చూడకతప్పదని భావిస్తున్న పరిస్థితిలోమహారాష్ట్ర ప్రభుత్వం, ముంబై మున్సిపల్ కార్పొరేషన్, వైద్యులు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో, పకడ్బందీ చర్యలతో కరోనాని కట్టడి చేశాయి. టెస్టింగ్, ట్రాకింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ విధానం ద్వారా మూడు నెలల్లోనే వైరస్ వ్యాప్తిని నియంత్రించారు. ఈ క్రమంలో ఎదురైన అడ్డంకులని అధిగమించి.. కరోనా కట్టడిలో ధారావిని మోడల్ గా నిలిపారు.

ధారావిలో.. క్లిష్ట పరిస్థితులు

ధారావి స్లమ్ లో 8 లక్షల జనాభా ఉంటేఅందులో దాదాపు 80 శాతం మంది కమ్యూనిటీ బాత్రూంలనే వాడుతున్నారు. ఇక్కడ 450 కమ్యూనిటీ టాయిలెట్స్ ఉన్నాయి.

అత్యధిక మంది ఇంట్లో ఆహారం వండుకోరు. బయటి ఆహారమే తింటారు.

ఇరుకు గదుల్లో 8 నుంచి 10 మంది ఉంటారు.

ఇరుకుగా ఉండే సందుల్లో రెండు, మూడు అంతస్తుల బిల్డింగ్ లు ఉంటాయి. వాటిలో గ్రౌండ్ ఫ్లోర్ నివాసాలకు, పై ఫ్లోర్ లో ఫ్యాక్టరీలను నిర్వహిస్తుంటారు.

వైరస్ ను వెంటాడి.. వేటాడి

ధారావిలో పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసిన ముంబై మున్సిపల్ కార్పొరేషన్.. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంతో వైరస్ ను వేటాడి అంతం చేయాలని నిర్ణయించింది. 24 మంది ప్రైవేటు వైద్యులు సేవలు అందించేందుకు ముందుకు వచ్చారు. ప్రభుత్వం ఆ వైద్యులకు పీపీఈ కిట్లు, థర్మల్ స్కానర్లు, పల్స్ మీటర్లు, మాస్కులు, గ్లవ్స్ అందించింది. బృందాలుగా ఏర్పడి.. ఇంటింటికీ వెళ్లి 3.6 లక్షల మందికి జ్వర పరీక్షలు నిర్వహించారు. 13, 500 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్ వస్తే.. వారి కాంటాక్టులను ట్రేస్ చేసి.. ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్ లో ఉంచారు. ప్రైవేటు క్లినిక్ లను సానిటైజ్ చేసి వైద్య సేవలు ప్రారంభించారు. కరోనా లక్షణాలతో వచ్చే వారి వివరాలను మున్సిపల్ కార్పొరేషన్ కు అందించేలా ఏర్పాట్లు చేశారు. ఎక్కువ సంఖ్యలో పేషెంట్లు వస్తే చికిత్స అందించేందుకు రికార్డు సమయంలో 200 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. పాజిటివ్ లకు, ప్రైమరీ కాంటాక్ట్ లకు సమీపంలోని పాఠశాలలు, ఫంక్షన్ హాళ్లు, క్రీడా సముదాయాల్లో క్వారంటైన్ ఏర్పాటు చేశారు. డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లను, అత్యవసర వైద్య పరికరాలను 24 గంటలు అందుబాటులో ఉంచారు. చికిత్స పొందుతున్న వారికి పౌష్టిక ఆహారం, అవసరమైన మందులు, విటమిన్ టాబ్లెట్లు క్రమం తప్పకుండా అందేలా ఏర్పాట్లు చేశారు. కరోనా లక్షణాలు ఉన్న ప్రజలు కూడా స్వచ్ఛందంగా టెస్టింగ్ కోసం ముందుకు రావడం, అనుమానితుల వివరాలు అందించడంతో.. కరోనా కట్టడిలో ప్రభుత్వం యంత్రాంగం విజయవంతమైంది.

ధారావిలో కరోనా స్టాటిస్టిక్స్

జూలై 10 నాటికి ధారావిలో నమోదైన కరోనా పాజిటివ్ కేసులు 2,359. ఇందులో 1,952 మంది ఇన్ఫెక్షన్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం 166 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 215 మంది మరణించారు ( జూలై 10 నాటికి ). ఒక్కో పాజిటివ్ కేసుకి… 24 మంది చొప్పున మొత్తం 58, 154 మందిని ట్రేస్ చేశారు. సగటున ఒక్కో పాజిటివ్ కేసుకి ఐదుగురుని ప్రభుత్వం క్వారంటైన్ కి తరలించారు.

కరోనా కష్ట కాలంలో ధారావి చూపిన దారి.. ఇప్పుడు మిగతా స్లమ్ ఏరియాలకు, ఎక్కువ జనాభా కలిగిన నగరాలకు ఆచరణీయం. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ధారావిలో చూపిన చిత్తశుద్ధి.. ముంబై నగర వ్యాప్తంగా చూపకపోవడంతోనగరంలో మిగతా ప్రాంతాల్లో కేసులు రోజు రోజుకీ ఎక్కువ అవుతూనే ఉన్నాయి.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments