ప్రగతి భవన్ కు కేసీఆర్ – రైతుబంధుపై కీలక ఆదేశాలు !!

రెండు వారాలుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు.. ఇవాళ ప్రగతి భవన్ కి చేరుకున్నారు. రోజు రోజుకీ కరోనా తీవ్రత ఎక్కువ అవుతున్న పరిస్థితిలో.. వైద్య సదుపాయాలను సమీక్షిస్తూ ప్రజల్లో ధైర్యం నింపాల్సిన సీఎం.. ఫాం హౌస్ లో ఏం చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శించాయి. #WhereisKCR ట్యాగ్ తో ముఖ్యమంత్రి ఎక్కడ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులతో ప్రశ్నలు సంధించిన విషయం తెలిసిందే. ఇద్దరు యువకులైతే ఏకంగా ప్రగతి భవన్ ముందు వేర్ ఈజ్ కేసీఆర్ అని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు. ముఖ్యమంత్రి ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని కోరుతు హై కోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ఈ పరిణామాల మధ్య తన ఆరోగ్యంపై వస్తోన్న వార్తలకు ఎండ్ కార్డ్ వేస్తూ.. రెండు వారాల తర్వాత ఇవాళ సీఎం కేసీఆర్ అధికార నివాసం ప్రగతి భవన్ కు చేరుకున్నారు. వచ్చిన రోజేరైతు బంధు, నియంత్రిత వ్యవసాయ అమలు తీరుపై మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా పలు కీలక సూచనలు చేసిన ముఖ్యమంత్రి కేసిఆర్రాష్ట్రంలో రైతులు అందరికీ రైతు బంధు సాయం అందాల్సిందే అని స్పష్టం చేశారు. “రాష్ట్రంలో రైతుబంధు సాయం అందని రైతులు ఏ మూలన ఎవరున్నా గుర్తించి, చిట్ట చివరి రైతు వరకు అందరికీ ఆర్థిక సాయం అందించాలి. ప్రభుత్వం సూచించిన మేరకే రైతులు వందకు వందశాతం నియంత్రిత పద్ధతిలో ఈ వానాకాలం పంట సాగు చేస్తుండడం శుభసూచకం, ఇది భవిష్యత్తులో సాధించే గొప్ప విజయానికి నాందిఅని కేసీఆర్ అన్నారు. ఇప్పటి వరకు 99.9 శాతం మంది రైతులకు రైతుబంధు సాయం అందిందన్నారు. మంత్రులు తమ జిల్లాలో, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో రైతులందరికీ సాయం అందిందా? ఇంకా ఎవరైనా మిగిలిపోయారా? అని తెలుసుకుని డబ్బులు అందించే ఏర్పాట్లు చేయాలని తెలిపారు. రైతులందరికీ రైతుబంధు సాయం అందించడానికి ఎంత వ్యయం అయినా ప్రభుత్వం వెనుకాడదని స్పష్టం చేశారు. రైతుబంధు సాయం అందించడానికి టైమ్ లిమిట్ లేదని, చివరి రైతుకు సాయం అందే వరకు విశ్రమించవద్దని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణం దసరా నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉత్పత్తి చేసే విత్తనాలను నిల్వ చేసేందుకు రూ.25 కోట్ల వ్యయంతో అతి పెద్ద అల్ట్రా మోడర్న్ కోల్డ్ స్టోరేజి నిర్మించనున్నట్లు సీఎం వెల్లడించారు. మంత్రులు శ్రీ ఎస్. నిరంజన్ రెడ్డి, శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ముఖ్య సలహాదారు శ్రీ రాజీవ్ శర్మ, సీఎస్ శ్రీ సోమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments