వికాసం: మహబూబ్ నగర్…! తెలంగాణలో ప్రత్యేక పరిస్థితులు నెలకొన్న జిల్లా. పక్కనే కృష్ణా నది ఉన్నా.. కరువు, వలసలతో గోస పడే ప్రాంతం. ఇలాంటి చోట ప్రజల అంచనాలను అందుకోవడం ఏ ప్రభుత్వానికైనా కత్తి మీద సాము వంటిదే. ఈ సవాల్ ని బాధ్యతలా స్వీకరించిన కేసీఆర్ ప్రభుత్వం.. ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించి ఓట్ల రూపంలో దీవెనలను తిరిగి పొందింది. ఎన్నికలకు ముందు… చాలా మంది విశ్లేషిస్తూ… “మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ కు కష్టమే రా భయ్. ఒక్కో జిల్లాలో రెండు, మూడు సీట్లు గెలవడం కూడా కష్టమే” అన్నారు.
మీడియాలో ఉన్న చాలా మంది మిత్రులు కూడా ఇదే విశ్లేషణ చేశారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తు.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 14 స్థానాల్లో 13 సీట్లను కారు కైవసం చేసుకుంది. కారు జోరుకి కాంగ్రెస్ దిగ్గజాలు ఓటమి పాలయ్యారు. గులాబీ అభ్యర్థులకు భారీ మెజారిటీ కట్టబెట్టి పాలమూరు ప్రజలు రాజకీయాల్లో నవ చరిత్రకు నాంది పలికారు. మరి… ఇంతటి భారీ విజయాన్ని కేసీఆర్ కి, టీఆర్ఎస్ పార్టీకి అందించిన ఘనత…ఆ ఒక్కడికే దక్కుతుంది. ఆ అసాధ్యుడే.. తెలంగాణ వాటర్ మెన్.. తన్నీరు హరీశ్ రావు.
ఔన్… హరీశుడే. ఈ ట్రబుల్ షూటర్ గురి పాలమూరుపై పెట్టిన తర్వాతే… ఆ జిల్లాలో కారు జోరు పెరిగింది. గ్రౌండ్ లెవల్లోకి బ్రేకులు లేకుండా దూసుకుపోయింది. రాజకీయంగా.. కొడంగల్, మక్తల్, గద్వాల వంటి చోట్ల హరీశ్ వ్యూహాలు అద్భుత ఫలితాలు ఇచ్చాయి. కానీ.. అంతకముందు నీటి పారుదల శాఖ మంత్రిగా హరీశ్ రావు మహబూబ్ నగర్ జిల్లాపై పెట్టిన ప్రత్యేక శ్రద్ధ.. జిల్లా ప్రజలు ప్రత్యక్షంగా చూశారు. అసంపూర్తిగా ఉన్న ఎంజీకేఎల్ఐ, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ పనులను పూర్తి చేయడంతోపాటు కొత్తగా పాలమూరు–రంగారెడ్డి, తుమ్మిళ్ల ఎత్తిపోతలను ప్రారంభించారు. ఈ నాలుగేండ్లలోనే కేసీఆర్ ప్రభుత్వం ఆరు ప్రాజెక్టులకు రూ.5,715 కోట్లను కేటాయించింది, రూ.3,550 కోట్లతో పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పనులు చేయించింది. ఈ ఏడాది ప్రారంభించిన తుమ్మిళ్ల ఎత్తిపోతలకు రూ.50 కోట్లు ఇచ్చింది.
ప్రాజెక్టులు పరుగులు
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న నాలుగు ప్రాజెక్టుల్లో కేవలం ఒక్క ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా మాత్రమే ఐదు వేల ఎకరాలకు సమైక్యపాలనలో సాగునీరు అందేది. ఇది గతం. కానీ ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగేండ్లలోనే 6.70 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు సంకల్పించింది. గత రెండేండ్లుగా ఎంజీకేఎల్ఐ, భీమా, నెట్టెంపాడ్, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల ద్వారా దాదాపు 5 లక్షల ఎకరాలకు సాగునీరందించింది. ఈ ఏడాది ఆయకట్టు సాగును మరింత పెంచేందుకు చర్యలు చేపట్టింది. ఎంజీకేఎల్ఐ ద్వారా 3.50 లక్షలు, భీమా-1, 2 ఫేజ్ ద్వారా 1.70 లక్షలు, నెట్టెంపాడ్ ద్వారా మరో 1.20 లక్షలు, కోయిల్‌సాగర్ ద్వారా 30 వేల ఎకరాలకు సాగునీరందించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తద్వారా ఉమ్మడి పాలమూరులో టీఆర్ఎస్ చేపట్టిన పనులు ద్వారా అందే ఫలాలు.. 8 లక్షల ఎకరాలకు చేరనున్నాయి.
కేసీఆర్ ప్లాన్.. హరీశ్ యాక్షన్..
ప్రాజెక్టుల పనులన్నీ వేగంగా పూర్తి చేసేందుకు హరీశ్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశకత్వంలో.. పాలమూరుకి పచ్చలహారం తొడిగేందుకు అహర్నిశలు శ్రమించారు. ప్రాజెక్టుల వద్దే నిద్రించి.. ఇంజినీర్లు, ఇతర సిబ్బందికి సూచనలు ఇచ్చారు. పనులను నిత్యం పర్యవేక్షిస్తూ.. ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుకొని ఆరా తీశారు. కేసీఆర్ ధృడ సంకల్పం… హరీశ్ చిత్తశుద్ధి పాలమూరుని ప్రగతి బాటలో పెట్టాయి. ఒకనాటి కరువుల జిల్లాని నేడు పచ్చని పంటలతో కళకళలాడేలా చేశాయి. పల్లెల్లో పెద్దలను అడిగితే.. అందరు ఇదే విషయాన్ని చెబుతున్నారు. మా జీవితంలో ఇంత వేగంగా అభివృద్ధి పనులు ఎప్పుడూ చూడలేదని. అందుకే… ఇప్పుడు హరీశ్ ని చూస్తే.. పాలమూరు ప్రజల మనసు ఆత్మీయతతో ఉప్పొంగుతుంది. ఆ ప్రేమాభిమానాలతోనే మహబూబ్ నగర్ ప్రజలు.. కేసీఆర్ ని మరోసారి ఆశీర్వదించారు. ఏకంగా జిల్లాలో ఉన్న 14 స్థానాల్లో 13 చోట్ల బ్రహ్మరథం పట్టారు. కేసీఆర్… హరీశ్ ద్వయాన్ని విశ్వసించారు. కొడంగల్ లో రేవంత్ రెడ్డి, గద్వాలలో డీకే అరుణ, వనపర్తిలో చిన్నారెడ్డి, నాగర్ కర్నూల్ లో నాగం జనార్దన్ రెడ్డి వంటి మహామహులను ఓడించారు.
రైతు బంధు, రైతు బీమా, ఆసరా పింఛన్లు, కళ్యాణ లక్ష్మీ… ఇలా విజయానికి అనేక కారణాలు ఉన్నా.. పాలమూరులో మాత్రం నీరే అన్నిటికంటే కీలకం. ఆ నీటితో రైతుల పాదాలు కడిగిన… హరీశ్ అంటే జిల్లా వాసులకు ఇప్పుడు ప్రత్యేక అభిమానం. అందుకే… పాలమూరులో కారు జోరు.. వయా హరీశ్ అన్న మాట నూటికి నూరుపాళ్లు నిజం.