రూ. వెయ్యి అప్పుకి 5 ఏళ్లు వెట్టి చాకిరి !!

వెట్టి చాకిరి. దీని గురించి డిజిటల్ తరానికి పెద్దగా తెలియదు. సోషల్ పుస్తకాల్లో ఉంటుంది.. చదువుతారు.. అవునా.. అప్పట్లో ఇంత దారుణంగా ఉండేదా అనుకుంటారు. కేజీఎఫ్ వంటి సినిమాలు చూసి.. ఇలా కూడా జరుగుతుందా అని ఆశ్చర్యపోతారు. కానీ… సినిమాల్లో చూపే దారుణ చిత్రాలు.. అలాంటి పరిస్థితులు ఇప్పటికీ వెలిగిపోతున్న భారతంలో అక్కడక్కడా వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇదిగో.. పైన ఉన్న చిత్రమే అందుకు ఉదాహరణ. తమిళనాడులోని కాంచిపురంలో ఇటీవల రెవెన్యూ అధికారులు కట్టెకోత పరిశ్రమలపై దాడులు నిర్వహించారు. 42 మంది కార్మికులకు వెట్టి చాకిరీ నుంచి విముక్తి కల్పించారు. 60 ఏళ్ల కాశీ అనే పెద్దాయన కాంచీపురం తహశీల్దార్ కాళ్లకు దండం పెడుతున్న సందర్భంగా తీసిందే ఈ ఫోటో. న్యూస్ మినెట్ వెబ్ సైట్ ఇందుకు సంబంధించిన వార్తా కథనాన్ని తన వెబ్ సైట్ లో పోస్ట్ చేసింది.

కాంచీపురంలో కట్టెకోత పరిశ్రమలు చాలా ఉన్నాయి. వెట్టి చాకిరి నిర్మూలన కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల ద్వారా అక్కడి పరిస్థితులు తెలుసుకున్న అధికారులు.. జూలై 8న తనిఖీలు నిర్వహించారు. కాంచీపురంలో 28 మందిని, వెల్లూరులో 14 మందిని నిర్బంధం నుంచి విడిపించారు. పరిశ్రమల్లో పనిచేస్తున్న వారి పరిస్థితులు… చిన్న పిల్లలు కూడా బందీఖానాల్లో ఉండటం చూసి అధికారులు విస్తుపోయారు. ఆ అభాగ్యులు అనుభవించిన దుర్భర జీవితాలని విని చలించిపోయారు. కనీసం గర్భిణులను సొంత ఊరికి పోనిచ్చే వారు కాదని.. పురిటి నొప్పులు వస్తే దవాఖానాకు తీసుకెళ్లేందుకు కూడా దిక్కు లేకుండా చేశారని.. వండుకోవడానికి బియ్యం కూడా సరిపడినంత ఇచ్చే వారు కాదని తాము పడ్డ అవస్థలను కార్మికులు వివరించారు. పాపం.. వారు తీసుకున్న రెండు, మూడు వేల రూపాయల అప్పుని తీర్చేందుకు 5 ఏళ్లుగా నిర్బంధంలో.. పరిశ్రమల్లో వెట్టి కింద మగ్గుతున్నారు. ఇన్నాళ్లు వారు చేసిన పనికి ఎలాంటి వేతనాలు కూడా చెల్లించలేదట. ఇంతచేసినా.. నటరాజ్ అనే ఓ యజమాని.. కార్మికుల అప్పు రూ.30 వేలకు పెరిగింది అని.. వారు ఇంకా తమకు బాకీ ఉన్నారని నిస్సిగ్గుగా.. నిర్భయంగా అధికారులు ఎదుట వాదించాడట !

కార్మికుల పరిస్థితిని తెలుసుకున్న తర్వాత… మీకు విముక్తి కల్పించేందుకే తాము వచ్చామని అధికారులు చెప్పడంతో… కార్మికులు ఆనందంతో భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా.. 60 ఏళ్ల కాశీ తహశీల్దారు కాళ్లపై పడి కన్నీటితో కృతజ్ఞత తెలిపాడు. ఇప్పుడీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు అధికారులని ప్రశంసిస్తున్నారు. ఇంతకీ.. ఆ పెద్దాయని తీసుకున్న అప్పు ఎంతో తెలుసా.. ? కేవలం వెయ్యి రూపాయలు. ఆ చిన్న మొత్తానికి 5 ఏళ్లు ఆ దుర్మార్గుల చెరలో బంధీ అయి.. రెక్కలు ముక్కలు చేసుకున్నాడు. ప్రభుత్వ యంత్రాంగం జోక్యంతో.. వెట్టి నుంచి స్వతంత్రుడయ్యాడు. నిజంగా.. ప్రజల పట్ల ఉన్న బాధ్యతని అధికారులు చిత్తశుద్ధితో నిర్వహిస్తే… ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపవచ్చు కదా !!

☛ దేశంలో వెట్టిచాకిరి (Bonded Labour) ని నిషేధిస్తూ.. కేంద్ర ప్రభుత్వం 1976లో వెట్టిచాకిరి నిరోధక చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం… అప్పు పేరుతో ఎవరినైనా నిర్బంధించడం, పని చేయించుకోవడం నేరం.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments