పవన్ కోసం పార్టీల పాకులాట ! “కాపు” కాసేది ఎవరో ?

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వాతావరణం పూర్తిగా ఆవరించింది. ఏ నోట విన్నా.. జగన్ పవన్ బాబు. ఈ ముగ్గురు పేర్లు, వీరిలో ఎవరు ఎవరితో కలుస్తారు.. ఎవరిని ఎవరు దూరం పెడతారు అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. టీడీపీ, వైసీపీ ప్రధాన పార్టీలుగా పోటీ పడుతుంటే.. జనసేన మాత్రం ప్రత్యామ్నాయం మేమే అంటూ దూసుకొస్తోంది. ఈ నెల చివరన, లేదా మార్చి తొలి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందన్న అంచనాలతో.. పార్టీలు, బడా నేతలు సభలు, సమావేశాల హోరు పెంచారు. ముఖ్యంగాఅధికార, విపక్షాలు బల నిరూపణ కోసం బీసీ సభల పేరిట భారీ జనసందోహాన్ని సమీకరించి బలాబలాలను ప్రదర్శించుకున్నాయి. రాష్ట్రంలో బీసీ జనాభా అత్యధికం కావడంతో వారిపై వరాల వర్షం కురిపించిన రెండు పార్టీలు మరో బలమైన సామాజికవర్గం ఓట్ల కోసం కాపు కాస్తున్నాయి. ఆ వర్గం నేతలు తమ నాయకుడుగా భావిస్తున్న పవన్ కల్యాణ్ మద్దతు కోరేందుకు తెలుగుదేశం, వైసీపీ గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఇప్పటికే పలు వేదికల్లో పవన్ తో తమకు పేచీ లేదని కలిసి నడవడానికి సిద్ధమని చంద్రబాబు స్నేహహస్తం చాటిన నేపథ్యంలో వారి పాత స్నేహం బలపడే అవకాశముందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే వైసీపీలోని ఓ వర్గం నేతలు పవన్ ని కలుపుకుపోవాలని జగన్ కు సూచిస్తున్నట్లు సమాచారం.

గత ఎన్నికల్లో ఒంటరిగా అత్యధిక ఓట్ల శాతం గెలుచుకున్న వైసీపీ సీట్ల విషయంలో మాత్రం వెనుకబడింది. బీజేపీ, జనసేన పొత్తు కారణంగా తెలుగుదేశం పార్టీ కేవలం ఒక్కశాతం మాత్రమే ఎక్కువ ఓట్లు సాధించి అధికార పీఠాన్ని దక్కించుకుంది. ఆయా పార్టీల పొత్తు కారణంగా వైసీపీ గోదావరి జిల్లాల్లో తీవ్రంగా నష్టపోయింది. ఉభయగోదావరి జిల్లాల్లో 34 స్థానాల్లో 6 స్థానాలకే పరిమితమైంది. ఈ దఫా అలాంటి పరిస్థితి ఎదురవకూడదంటే కాపులను కలుపుకుపోవాలని వైసీపీ అధినేత జగన్ కు ఆపార్టీ నేతలు సూచిస్తున్నారు. అత్యాశ, అతివిశ్వాసానికి పోయి గత ఎన్నికల మాదిరే మరోసారి అధికారానికి దూరం కావద్దని తమ అభిప్రాయాన్ని కుండబద్దలుకొట్టి చెబుతున్నారు.

రాజ‌కీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శ‌త్రువులు ఉండ‌ర‌నేదానికి వాస్తవం. ఉప్పునిప్పులా ఉండే కాంగ్రెస్‌టీడీపీ కలిసినడుస్తున్నాయి. అలాగే.. 2009, 2014లో జ‌గ‌న్ అవినీతిపై విరుచుకుప‌డిన నేత‌లు కూడా వైసీపీ పంచన చేరుతున్నారు. మ‌తోన్మాద పార్టీ అంటూ తిట్టిన నోళ్లు కూడా ఇప్పుడు బీజేపీ పాల‌న‌పై ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఇవ‌న్నీ రాజ‌కీయాలు స‌హ‌జం అనుకోవ‌టం మిన‌హా.. త‌ప్పొప్పులు విశ్లేషించేంత సాహ‌సం కూడా చేయ‌లేని పరిస్థితి. ఇప్పుడు ఇదే వరసలో జగన్ కూడా పవన్ స్నేహంకోసం …. పవనే జగన్ తో పొత్తుకోసం ఆరాటపడుతున్నట్లు కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న లీకులు స్పష్టం చేస్తున్నాయి.

ఉభయగోదావరి జిల్లాల్లో పవన్ కు మంచి మద్దతు ఉంది. గత ఎన్నికల్లో వైసీపీ నష్టపోయింది కూడా ఆ ప్రాంతంలోనే కాబట్టి పవన్ తో కలిసి వెళ్లడం వల్ల ఆ రెండు జిల్లాల్లోని 34 శాసనసభ స్థానాల్లో పెద్దఎత్తున ప్రభావం ఉంటుందని భావిస్తున్నాయి. అయితే ఎవ‌రికి వారు త‌మ వైపు బ‌లం. బ‌ల‌గం ఉందంటూ జబ్బలు చ‌ర‌చుకుంటున్నా.. లోప‌ల మాత్రం ఏదో భ‌యం వెంటాడుతూనే ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో మెజార్టీ ఓట్లు ఏం చేసుకోవాలో తెలియ‌ట్లేదంటూ.. అతి విశ్వాసానికి పోయిన వైసీపీ నేత‌లు ఇప్పుడు.. సాధార‌ణ మెజార్టీతో బ‌య‌ట‌ప‌డితే చాల‌నుకుంటున్నారు. టీడీపీలోనూ ఇదే పరిస్థితి. దాదాపు 40 మంది సిట్టింగ్‌లు ఓట‌మి అంచున ఉన్నారంటూ వారి అభ్యర్థిత్వంపై నీలినీడ‌లు అలుముకున్నాయంటూ ఏడాదికాలంగా ప్రచారం సాగుతుంది. ఇటువంటి వేళ ఓట్లను చీల్చే ప‌వ‌న్‌తో ఎవ‌రెంత నష్టపోతారో అనే భ‌యం కూడా వెంటాడుతుంది. అందుకే.. ఈ విష‌యంలో జ‌గ‌న్ ఈ సారి ముందుగానే మేల్కోన్నాడు. కాపు నేత‌ల‌ను కూడ‌గ‌ట్టుకునే ప్రయత్నంలో వేగం పెంచాడు. ఇదే స‌మ‌యంలో ఆ సామాజిక‌వ‌ర్గం నుంచి ప‌వ‌న్‌పై ఒత్తిడి పెంచేలా చర్చలు సాగిస్తున్నట్లు స‌మాచారం. కూక‌ట్‌ప‌ల్లిలో రెడ్డి, కాపు వ‌ర్గాలు నంద‌మూరి వార‌సురాలు సుహాసిని ఓడించిన విష‌యాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఈ రెండు వ‌ర్గాలు క‌ల‌వ‌టం ద్వారా ఏపీలో గెలుపును త‌మ ఖాతాలో వేసుకోవాల‌నేది జ‌గ‌న్ ఎత్తుగ‌డ‌గా తెలుస్తోంది.

పవన్ ను సైతం జగన్ కు తోడుగా ఉండాలని తెలిపినట్లు కాపు నేతలు అంటున్నారు. ఏపీలో ఇప్పటి వరకు అధికారం చెలాయించిన రెడ్లు, కమ్మల మధ్య కాపు సామాజికవర్గంగా తామూ అధికార పీఠమెక్కాలని తాపత్రయపడుతున్న నేతలు మాత్రం ఒంటరిగానే వెళ్లాలనితక్కువ సీట్లొచ్చినా పూర్తిస్థాయి మెజారిటీ ఎవరికీ రాని పక్షంలో కింగ్ మేకర్ గా నిలవొచ్చని పవన్ కు సూచిస్తున్నారు. కర్ణాటకలో మాదిరి ఏపీలోనూ జరగొచ్చని కాబట్టి ఎన్నికలముందు పొత్తులు వద్దని జనసైనికులు పవన్ వద్ద మొరపెట్టుకుంటున్నారు. వాస్తవానికి జ‌న‌సేన‌లో కొంద‌రు.. జ‌గ‌న్‌తో పొత్తును అంగీక‌రిస్తుంటే.. ఇంకొంద‌రు మాత్రం.. జ‌గ‌న్‌, చంద్రబాబుకు దూరంగా ఉంటూనే.. బ‌ల నిరూపణ చెయ్యాలని కోరుకుంటున్నారు. జగన్ మాత్రం పవన్ తో పొత్తు కోసం కాపు కాస్తున్నట్లు ఓ వర్గం నేతలు లీకులిస్తున్నారు. సీట్ల సర్దుబాటు విషయంలో స్పష్టత వస్తే పొత్తు ఖరారవడం ఖాయమని భావిస్తున్నారు.

సీమలో జనసేనకు అంత ఆదరణ లేదని గుర్తించిన పవన్ కల్యాణ్ సైతం పార్టీకి ఉన్న బలానికి అనుగుణంగా సీట్లు అడిగితే ఇవ్వడానికి జగన్ కూడా ముందుకొస్తాడన్నది సీనియర్ నేతలు అంచనా. గత కొన్ని రోజులగా జగన్ సైతం పవన్ కల్యాణ్ పై ఎలాంటి వ్యాఖ్యలు, విమర్శలు చేయకపోవడం…. ఇలాంటి ఊహాగానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. చంద్రబాబు కూడా పవన్ పై విమర్శలు చేయవద్దంటూ తమ పార్టీ నేతలకు సూచించారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ పట్ల, టీడీపీ వైసీపీల ఇటీవల వైఖరిని పరిశీలిస్తే.. ఏపీ అధికార పీఠాన్ని అధిరోహించాలంటే.. పవన్ తోడు అవసరమని భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇలా రెండు ప్రధాన పార్టీలుపవన్ కోసం కాపుకాస్తుండటంతో.. జనసైనికులు తమ నాయకుడికి ఉన్న పాపులారిటీ, ఫాలోయింగ్, డిసైడింగ్ ఫ్యాక్టర్ చూసి ఉబ్బితబ్బిబ్బవుతున్నారట… !

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments