ఢిల్లీ ఎల్జీకి సర్వ అధికారాలు లేవని సుప్రీంకోర్టు తీర్పు

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ)కు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారం లేదని దేశ అత్యున్నత న్యాయస్థానం జూలై 4న తీర్పు వెలువరించింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం సలహాలు, సూచనలకు అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఢిల్లీకి రాష్ట్ర హోదా లేదని, జాతీయ రాజధాని అయిన ఢిల్లీ ప్రత్యేకమైనది, భిన్నమైనది కాబట్టి ఎల్జీ హోదా రాష్ట్ర గర్నవర్ హోదాతో సమానమైనది కాదని పేర్కొంది. ఆయన ఒక పాలనాధికారి మాత్రమే అని తెలిపింది.

కేంద్రానికి, ఢిల్లీ ప్రభుత్వానికీ మధ్య తలెత్తిన వివాదంపై జస్టిస్ దీపక్ మిశ్రాతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఢిల్లీ అధికారాలు, హోదాకు సంబంధించిన ఆర్టికల్ 239AA తో ముడిపడి ఉన్న అనేక విషయాలపై తీర్పు వెలువరించింది. శాంతి భద్రతలు, పోలీస్, భూములు మినహా మిగతా అన్ని అంశాల్లో చట్టాలు చేసేందుకు ఢిల్లీ శాసన సభకు అధికారం ఉంటుందని స్పష్టం చేసింది.
వివాదం ఎందుకు ?  

2014లో ఆమ్‌ఆద్మీ పార్టీ ఢిల్లీలో అధికారం చేపట్టినప్పటి నుంచి కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వానికీ మధ్య అధికార పరిధిపై వివాదం నడుస్తోంది. ఈ నాలుగేళ్లలో ప్రస్తుత ఎల్జీ అనిల్ బైజల్, మాజీ ఎల్జీ నజీబ్‌ జంగ్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీసుకున్న అనేక నిర్ణయాలను అడ్డుకోవడం వివాదానికి కారణమైంది. ఈ నేపథ్యంలో ఎల్జీ కార్యనిర్వాహక అధిపతే అంటూ 2016 ఆగస్టు 4న ఢిల్లీ హైకోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో ఎల్జీ కేంద్రం మద్దతుతో తన ప్రభుత్వ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారని ఆరోపిస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments