కరెంట్ అఫైర్స్ – జూలై 14, 2020

కరోనా కట్టడికి తొలి వ్యాక్సిన్….

క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకున్న రష్యా

రష్యా కరోనా వైరస్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ను విజయవంతంగా పూర్తి చేసుకుందని సెచెనోవ్ వర్సిటీ పేర్కొంది. వలంటీర్లపై ప్రయోగ పరీక్షలు పూర్తయ్యాయని ఇనిస్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ లేషన్ మెడిసిన్ అండ్ బయోటెక్నాలజీ డైరెక్టర్ వాడిత్ తారాసోవ్ వెల్లడించారు. గమలీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎపిడమాలజీ అండ్ మైక్రో బయాలజీ ఉత్పత్తి చేసిన ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ జూన్-18న మొదలు పెట్టారని, ప్రయోగ పరీక్షలు ఎదుర్కొంటున్న వలంటీర్ల తొలి బృందం బుధవారం(జూలై15) డిశ్చార్జ్ కానుండగా రెండో బృందం ఈ నెల 20వ తేదీన డిశ్చార్జ్ అవుతుందని తారాసోవ్ వివరించారు.

FTCCI తొలి ఆన్ మెంటర్ షిప్

మహిళా ఎంటర్ ప్రెన్యూర్ల కోసం ఏర్పాటు

కరోనా సమస్యలను అధిగమిస్తూ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FTCCI) మహిళా ఎంటర్ ప్రెన్యూర్లకు తొలి ఆన్ మెంటర్ షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నుంచి 30 మంది మహిళా పారిశ్రామికవేత్తలను ఈ అవకాశానికి ఎంపిక చేసింది. మహిళా విభాగం అధ్యక్షురాలు భగవతి బాల్ద్వా ఈ కార్యాక్రమాన్ని పర్యవేక్షిస్తుండగా, మెంటర్ కనికా గుప్తా ప్రధానంగా 5 అంశాలపై వారికి అవగాహన కల్పించనున్నారు. FTCCI అధ్యక్షుడు కరుణేంద్ర జాస్తి ఆదివారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆదివారంతో సహా ఈ నెల 18, 25 తేదీల్లో మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఈ సందర్భంగా కరుణేంద్ర జాస్తి మాట్లాడుతూ దేశంలో 14% మహిళా ఎంటర్ ప్రెన్యూర్లు వివిధ రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు.

వరల్డ్ T-20 కెప్టెన్ గా రోహిత్ శర్మ

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ ప్రకటించిన వరల్డ్ T-20 జట్టుకు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. IPL జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ కు హెడ్ కోచ్ గా ఉన్న టామ్ మూడీని కామెంటేటర్ హర్షా భోగ్లే ప్రస్తుత తరం క్రికెటర్లతో వరల్డ్ T-20 జట్టును ప్రకటించాల్సిందిగా కోరగా …రోహిత్ ని ఓపెనర్ గా ఎంపిక చేసి అతడికి జట్టు సారథ్య బాధ్యతలు కూడా అప్పగించాడు. ధోనికి ఈ జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం. ఈ జట్టులోని 12 మందిలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి మూడో స్థానంలోఅవకాశం ఇచ్చాడు. కీపర్ గా ధోనీ స్థానంలో వెస్టిండీస్ వికెట్ కీపర్ నికోలస్ పూరన్ ను సెలక్ట్ చేశాడు.

స్టిరియన్ గ్రాండ్ ప్రీ 2020 విజేత హామిల్టన్

ఫార్ములావన్ మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ స్టిరియన్ గ్రాండ్ ప్రీ విజేతగా నిలిచాడు. సహచర మెర్సిడెస్ డ్రైవర్ వాల్టెరీ బొటాస్ 2వ స్థానంలో నిలవగారెడ్ బుల్ కు చెందిన వెస్టాపెన్ 3వ స్థానంలో నిలిచాడు.

కజిరంగా పార్క్ లో బంగారు పులి

భారత్ లో ఉన్న ఒకే ఒక బంగారు రంగు పులి ఇటీవల కజిరంగా అడవుల్లో కనిపించిందని IFS అధికారి పర్వీన్ కాశ్వాన్ అసోంలోని కజిరంగా ఫారెస్ట్ లో ఆ గోల్డెన్ టైగర్ గడ్డి పొదల వెలుపల కూర్చుని సేదతీరుతున్న బంగారు పులి ఫోటోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. సాధారణ పులులకు భిన్నంగా ఇది పసిడి వర్ణంలో మెరిసిపోతూ..ముఖం కూడా ఇతర పులులకు భిన్నంగా కనిపిస్తుంది. దీనికి స్ట్రాబెర్రీ టైగర్, టాబీ టైగర్ అనీ ప్రాంతాలవారీగా వివిధ పేర్లు ఉన్నాయి. దీనికి పుట్టుకతోనే జన్యులోపం వల్ల బంగారు వర్ణం వస్తుందని, ఇలాంటివి ప్రపంచంలో పలు చోట్ల జంతు ప్రదర్శనశాలల్లో ఉన్నా అటవీ ప్రాంతంలో కనిపించడం చాలా అరుదు అని అటవీ శాఖ అధికారి పర్వీన్ కాశ్వాన్ వివరణ ఇచ్చారు.

డిగ్రీతో పాటు పాస్ పోర్ట్

హర్యానాలోని బాలికలందరికీ గ్రాడ్యుయేషన్ ముగిసిన వెంటనే పాస్ పోర్ట్ లు ఇస్తామని ఆ రాష్ట్ర CM మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయం సహాయం తీసుకోవాలని, తద్వారా గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు పాస్ పోర్ట్ ను విద్యార్థులకు అందజేయవచ్చని విద్యాసంస్థలకు ఖట్టర్ ఆదేశించారు. ఆదివారం జరిగిన హర్ సిర్ హెల్మెట్ కార్యక్రమంలో ప్రసంగిస్తూ మహిళల్లో ఉన్నత విద్యను ప్రోత్సహించేందుకు పాస్ పోర్ట్ పథకాన్ని తీసుకొచ్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఉచిత హెల్మెట్లు, లైసెన్సులు అందజేశారు.

ధ్యాన్ చంద్ కుమారుడికి జీవిత సాఫల్య పురస్కారం

హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ కుమారుడైన అశోక్ కుమార్ కు మోహన్ బగాన్ ఫుట్ బాల్ క్లబ్.. జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేసింది. తండ్రి చూపిన బాటలో హాకీ స్టిక్ పట్టిన అశోక్ కుమార్ 1975 ప్రపంచ కప్ లో భారత జట్టును విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. క్లబ్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జూలై 13న జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో(కరోనా కారణంగా) క్లబ్ కార్యదర్శి శ్రీం జోయ్ బోస్ మాట్లాడుతూ హాకీకి అశోక్ కుమార్ చేసిన సేవలకు గాను ఈ పురస్కారం అందజేస్తున్నం అని తెలిపారు.

దేశంలో అతిపెద్ద ఎకో పార్క్ కు శ్రీకారం

పాలమూరులో దేశంలోనే అతిపెద్ద అర్బన్ ఎకో పార్క్ కు మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టారు. మహబూబ్ నగర్ జిల్లాలోని అప్పన్నపల్లి రిజర్వ్ పార్క్ పరిధిలో 2087 ఎకరాల్లో విస్తరించిన ఈ పార్క్ కు కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్ గా నామకరణం చేశారు.

ఇప్పటి వరకు దేశంలోనే అతిపెద్ద పార్క్ గా ఉన్న కోల్ కతాలోని 1000 ఎకరాల్లో విస్తరించిన మెయిడెన్ పార్క్ రెండో స్థానంలోకి రాగా తర్వాతి స్థానాల్లో జెంషెడ్పూర్ లోని 500 ఎకరాల్లో విస్తరించిన జూబ్లీ పార్క్, లక్నోలోని 376 ఎకరాల్లో విస్తరించిన జ్ఞానేశ్వర్ మిశ్రా పార్క్ లు ఉన్నాయి.

భారతదేశ అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా అమెరికా

వరుసగా రెండో ఆర్థిక సంవత్సరం లో కూడా అమెరికాయే….

వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం 2019-20 ఆర్థిక సంవత్సరంలో అమెరికా భారత్ మధ్య 88.75 బిలియన్ డాలర్ల (8,875 కోట్ల డాలర్లు) వ్యాపారం జరిగింది. ఇది 2018-19 లో 87.96 బిలియన్ డాలర్ల(8,796 కోట్ల డాలర్లు) గా ఉంది.

గతంలో భారత అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా చైనా ఉండేది. ఇప్పుడు ఆ స్థానంలో అమెరికా నిలిచింది. భారత దేశానికి వాణిజ్య మిగులు ఉన్న అతికొద్ది దేశాల్లో అమెరికా ఒకటి. అమెరికా చైనా ల మధ్య ట్రేడ్ గ్యాప్ 2018-19లో 16.86 బిలియన్ డాలర్లు కాగా, 2019-20 లో 17.42 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇండియాచైనా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2018-19లో 87.08 బిలియన్ డాలర్లు కాగా 2019-20 లో 81.87 బిలియన్ డాలర్లుగా ఉంది. అమెరికాతో భారత్ సర్ ప్లస్ లో ఉండగా, చైనాతో వాణిజ్య లోటులో ఉండడమే కాదు అది కూడా పెద్ద మొత్తంలో ఉంది.

భారత్ లో రూ. 75 వేల కోట్ల పెట్టుబడి

గూగుల్ CEO సుందర్ పిచాయ్ వెల్లడి

ఇంటర్నెట్ దిగ్గజ కంపెనీ గూగుల్ భారత్ లో రూ. 75 వేల కోట్ల (1000 కోట్ల డాలర్లు) పెట్టుబడిగా వచ్చే ఏడేళ్లలో పెడతామని ప్రకటించింది. గూగుల్ CEO సుందర్ పిచాయ్ మాట్లాడుతూ భారత్ డిజిటలైజేషన్ నిధిని ఏర్పాటు చేసి పెట్టుబడి పెడతామని, ఈ పెట్టుబడి ప్రధానంగా 4 విభాగాల్లో ఉంటుందనన్నారు.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments