కరంట్ అఫైర్స్ – జూలై 24, 2020

ఆర్మీలో మహిళా అధికారుల కోసం శాశ్వత కమిషన్‌

ఆర్మీలో మహిళా అధికారుల కోసం శాశ్వత కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ రక్షణ శాఖ జూలై 23 ఉత్తర్వులు జారీ చేసింది. షార్ట్‌ సర్వీసు కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) కింద రిక్రూట్‌ చేసే మహిళా అధికారులందరినీ శాశ్వత కమిషన్‌కు తీసుకురావాలంటూ గత ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు మేరకు రక్షణ శాఖ శాశ్వత కమిషన్‌ను ఏర్పాటు చేసింది.

హైదరాబాద్ లో నీరా కేఫ్ నిర్మాణానికి శంకుస్థాపన

హైదరాబాద్‌లోని నెక్లెస్‌ రోడ్డులో నీరా కేఫ్‌ నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర మంత్రులు వి.శ్రీనివాస్‌గౌడ్, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, గౌడ సంఘాల ప్రతినిధులతో కలిసి కే. తారకరామారావు జూలై 23 శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కేటీఆర్‌ మాట్లాడుతూ, గీత వృత్తిపై రాష్ట్రంలో రెండులక్షలకు పైగా ఆధారపడి ఉన్నారని, ఈ వృత్తిపై ఉన్న రూ.16 కోట్ల పన్నును రద్దు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అని అన్నారు. ఈ నీరా కేఫ్‌ ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో పాపులర్‌ డ్రింక్‌గా నీరా ఉండబోతోందని చెప్పారు.

కృష్ణా’ ట్రైబ్యునల్‌ గడువు పొడిగింపు

కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్‌ గడువును మరో ఏడాది పాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల మధ్య నదీ జలాల పంపిణీ కోసం 2004లో ఈ ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేశారు. మూడు రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపిణీ పూర్తయింది. అయితే, ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపిణీ కోసం ఈ ట్రైబ్యునల్‌ గడువును పొడిగించారు. ఈ ఏడాది ఆగస్టు 1తో గడువు ముగుస్తుండడంతో, నివేదిక సమర్పించడానికి మరో ఏడాది పాటు సమయం కావాలని ట్రైబ్యునల్‌ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆగస్టు 1 నుంచి మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.

నిట్‌ ప్రవేశానికి 75 శాతం నిబంధన తొలగింపు

ప్రతిష్టాత్మక నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్‌), ఇతర కేంద్ర టెక్నికల్‌ విద్యాసంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన అర్హత నిబంధనల్లో కొంత వెసులుబాటు కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆయా విద్యా సంస్థల్లో ప్రవేశం పొందేందుకు కనీస అర్హతగా ఉన్న 12వ తరగతి బోర్డు పరీక్షలో కనీసం 75% మార్కులు పొంది ఉండాలన్న ప్రధాన నిబంధనను తొలగించింది. కరోనా మహమ్మారి కారణంగా పలు బోర్డులు పరీక్షలను పాక్షికంగా రద్దు చేసిన నేపథ్యంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ జూలై 23 ఈ నిర్ణయం తీసుకుంది. నిట్‌ తదితర ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ప్రవేశం పొందేందుకు ఇప్పటివరకు విద్యార్థులు జేఈఈ మెయిన్స్‌లో ఉత్తీర్ణులు కావడంతో పాటు, 12వ తరగతి బోర్డ్‌ పరీక్షలో కనీసం 75% మార్కులు కానీ, అర్హత పరీక్షలో టాప్‌ 20 పర్సంటైల్‌ ర్యాంక్‌ కానీ సాధించాల్సి ఉండేది.

ఫ్రాన్స్ నుంచి హ్యామర్ క్షిపణుల కొనుగోలు

చైనాతో ఉద్రిక్తతలు తీవ్రతరమవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం ఆర్మీని మరింత పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఫ్రాన్స్‌ నుంచి రఫేల్‌ యుద్ధ విమానాలు వస్తున్న సమయంలోనే వాటి సామర్థ్యాన్ని మరింత పెంచడానికి హ్యామర్‌ క్షిపణుల్ని ఫ్రాన్స్‌ నుంచి కొనుగోలు చేయనుంది. ఈ కొనుగోలుకు సంబంధించిన అధికారాలను అత్యవసర పరిస్థితుల కింద నరేంద్ర మోదీ ప్రభుత్వం భారత్‌ సాయుధ బలగాలకు కట్టబెట్టింది. ఈ క్షిపణులు గగనతలం నుంచి ఉపరితలానికి 60–70 కి.మీ. పరిధిలోని లక్ష్యాలను సమర్థవంతంగా ఛేదించగలవు. తూర్పు లద్దాఖ్‌ పర్వత శ్రేణుల నుంచి సరిహద్దుల్లో బంకర్లు, ఇతర శిబిరాలపై దాడులు చేసే అవకాశం హ్యామర్‌ క్షిపణి ద్వారా వీలు కలుగుతుంది. ‘హ్యామర్‌ క్షిపణులు కొనుగోలుకి సంబంధించిన ప్రక్రియ మొదలైంది.

మార్స్ పైకి చైనా తియాన్‌విన్‌–1” – ప్రయోగం విజయవంతం

అరుణ గ్రహంపైకి తియాన్‌విన్‌–1 శోధక నౌకను ప్రయోగించడంలో చైనా జూలై 23 విజయవంతమైంది. అంగారకుడి చుట్టూ చక్కర్లు కొట్టడంతోపాటు ఆ గ్రహంపై దిగడం తిరగడం ఈ శోధక నౌక ప్రయోగ లక్ష్యం. లాంగ్‌మార్చ్‌–5 రాకెట్‌ ద్వారా వెన్‌ఛాంగ్‌ అంతరిక్ష ప్రయోగశాల నుంచి నింగికి ఎగసిన ఐదు టన్నుల శోధక నౌక అంగారకుడివైపు తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ప్రయోగం జరిగిన 36 నిమిషాలకు ఆర్బిటర్, ల్యాండర్, రోవర్‌లతో కూడిన అంతరిక్ష నౌక భూ– అంగారక మార్పిడి కక్ష్యలోకి ప్రవేశించింది. ఏడు నెలల సుదీర్ఘ ప్రయాణం తరువాత అంగారక గ్రహాన్ని చేరుకుంటుందని చైనా జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం తెలిపింది. ఈ శోధక నౌక సుమారు 200 కిలోల బరువున్న ఆరు చక్రాలున్న రోవర్‌ను మార్స్ ఉపరితలంపైకి చేరుస్తుంది. ఆ రోవర్ అక్కడి మట్టిని, గ్రహ అంతర్భాగపు నిర్మాణం, వాతావరణం, నీరు వంటి వేర్వేరు అంశాలపై ప్రయోగాలు జరపనుంది.

2018 ఆసియా క్రీడల రజతం.. నేడు స్వర్ణమైంది

2018లో జరిగిన జకార్తా ఆసియా క్రీడల్లో భారత్‌ స్వర్ణ పతకాల జాబితాలో మరొకటి అదనంగా చేరింది. నాడు లభించిన రజతమే ఇప్పుడు స్వర్ణంగా మారింది. 4X400 మిక్స్‌డ్‌ రిలే ఈవెంట్లో భారత బృందం రెండో స్థానంలో (3 నిమిషాల 15.71 సెకన్లు) నిలిచింది. బహ్రెయిన్‌ (3 నిమిషాల 11.89 సెకన్లు) స్వర్ణం సాధించగా, కజకిస్తాన్‌ టీమ్‌ (3 నిమిషాల 19.52 సెకన్లు) కాంస్యం సాధించింది. అయితే బహ్రెయిన్‌ జట్టులో సభ్యుడైన కెమీ అడికోయా డోపింగ్‌లో పట్టుబడ్డాడు. అతనిపై అథ్లెటిక్స్‌ ఇంటిగ్రిటీ యూనిట్‌ నాలుగేళ్ల నిషేధం విధించింది. ఫలితంగా బహ్రెయిన్‌ను డిస్‌క్వాలిఫై చేస్తూ భారత్‌కు బంగారు పతకాన్ని ప్రకటించారు. ఈ స్వర్ణం గెలుచుకున్న బృందంలో మొహమ్మద్‌ అనస్, అరోకియా రాజీవ్, హిమ దాస్, పూవమ్మ సభ్యులుగా ఉన్నారు.

వాల్ మార్ట్ ఇండియాను కొనుగోలు చేసిన ఫ్లిప్ కార్ట్

దేశీ ఈ–కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ తాజాగా హోల్‌సేల్‌ వ్యాపార విభాగంలోకి అడుగుపెడుతోంది. ఇందులో భాగంగా వాల్‌మార్ట్‌ ఇండియాను కొనుగోలు చేసింది. అయితే ఈ డీల్‌ విలువ ఎంతన్నది వెల్లడించలేదు. ఈ ఏడాది ఆగస్టు నుంచి ఫ్లిప్‌కార్ట్‌ హోల్‌సేల్‌ పేరిట వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు సంస్థ జూలై 23 తెలిపింది.

అమర జవాన్ ఫిరోజ్ ఖాన్ కుటుంబానికి పరిహారం విడుదల

భారత సరిహద్దుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించిన లాన్స్‌నాయక్‌ ఫిరోజ్‌ఖాన్‌ కుటుంబానికి గ్యాలంటరీ అవార్డు కింద రూ.29.76 లక్షల పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం జూలై 23విడుదల చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఫిరోజ్‌ఖాన్‌ భార్య నస్రీన్‌ఖాన్‌ బ్యాంక్‌ ఖాతాలో నగదు జమ చేయాలని హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments